తినేది లంచాలు.. మోగించేది కంచాలా? | Irrigation Minister Ambati Rambabu Is Commenting | Sakshi
Sakshi News home page

తినేది లంచాలు.. మోగించేది కంచాలా?

Published Sat, Sep 30 2023 5:32 AM | Last Updated on Sat, Sep 30 2023 5:32 AM

Irrigation Minister Ambati Rambabu Is Commenting - Sakshi

సాక్షి, అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో అవినీతికి పాల్పడి, అడ్డంగా దొరికిపోయి ప్రజల ముందు తలదించుకుని సిగ్గుపడాల్సిన వారు కంచాలు మోగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆశ్చర్యంగా ఉందని నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అవినీతి చేసి కంచాలు కొట్టడం ఏమిటని.. తినేది లంచాలు.. మోగించేది కంచాలా? అంటూ ఆయన ప్రశ్నించారు. సిగ్గుపడాల్సిన చోట, తలదించుకోవాల్సిన చోట కూడా తల ఎగరేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అంబటి ఆ ప్రకటనలో ఇంకా ఏమన్నారంటే..

► టీడీపీ నేతల అహంకారాన్ని ప్రజలు మరింత అణచాల్సిన అవసరం ఉంది. 
► 2014 నుంచి 2019 వరకు మోగించిన అవినీతి మోత కారణంగానే చంద్రబాబుకు ఇప్పుడు ఇంట్లో ఈగల మోత జైల్లో దోమల మోత.. అన్న పరిస్థితి వచ్చింది. 
► చంద్రబాబును అరెస్టుచేసింది రాష్ట్ర సీఐడీ అన్నది ఎంత నిజమో,  కోర్టులు తిరస్కరించటంవల్లే చంద్రబాబు ఈరోజు రిమాండ్‌లో ఖైదీగా ఉన్నారన్నది కూడా అంతే నిజం. 
► ఐదేళ్లు అడ్డంగా తినేసిన బకాసురులంతా కలిసి కంచాలు ఎవరి మీద మోగిస్తున్నారు? విజిళ్లు ఎవరి మీద ఊదుతారు? హారన్లు ఎవరిని ఉద్దేశించి కొడతారు? 
► సీఎం జగన్‌ తన నాలుగేళ్ల పాలనలో పేదలకు డీబీటీ ద్వారా రూ.2.35 లక్షల కోట్లు బదిలీ చేస్తే.. అదే స్థాయిలో బడ్జెట్, నిధులు ఉన్నా ఆ సొమ్మంతా టీడీపీ హయాంలో ఉఫ్‌ అని ఊదేసినందుకు గుర్తుగా టీడీపీ వారంతా విజిళ్లు ఊదుతారా? 
► అలాగే, అవినీతి చేసి హైదరాబాద్‌ నుంచి పారిపోయి వచ్చి, బస్సులో పడుకున్నానని ఆడిన డ్రామాలకు గుర్తుగా హారన్లు మోగిస్తారా? 
► ఇక చంద్రబాబు అవినీతిని ఈడీ కూడా నిర్థారించి నలుగురిని అరెస్టు చేసింది. కాబట్టి, ఢిల్లీలో దాక్కున్న లోకేశ్‌ ఆ ఈడీ ఆఫీసు ముందు నిలబడి, ఇది అక్రమం అని కంచాలు కొడితే బాగుంటుంది. 
► రాష్ట్రపతి, మోదీ, అమిత్‌ షా కార్యాలయాల ముందు నిలబడి, తమ ఎంపీలు, పురందేశ్వరి, సీపీఐ నారాయణ, రామకృష్ణ, రేవంత్‌రెడ్డి, సుజనాచౌదరి, సీఎం రమేష్, సత్యకుమార్, రేణుకాచౌదరి, కూనంనేని సాంబశివరావు, బీవీ రాఘవులు, జయప్రకాష్‌ నారాయణ, వీళ్లందరినీ ఢిల్లీలో నిలబెట్టుకుని ఈడీ అరెస్టు అక్రమమని, స్కిల్‌ స్కామేలేదని కంచాలు కొడితే బాగుంటుంది. విజిల్స్‌ ఊదితే ఇంకా బాగుంటుంది. హారన్లు కొడితే మరింత బాగుంటుంది. 
► అలాగే, కేంద్ర ఆర్థికమంత్రి ఇంటి ముందు, ప్రధానమంత్రి ఇంటి ముందు, ఢిల్లీలోని ఐటీ శాఖ ప్రధాన కార్యాలయం ముందు కూడా బాబుకు మద్దతిచ్చే వారంతా కంచాలు, గిన్నెలు, తపాళాలు, గరిటెలు, గ్లాసులు అన్నీ తీసుకెళ్లి కొడితే బాగుంటుంది. 
► వీలుంటే నల్ల చొక్కాలతో ప్రదర్శన చేసి, వాట్‌ ఐ యామ్‌ సేయింగ్‌ అంటూ గతంలో కొట్టిన డైలాగుల్ని రిపీట్‌ చేస్తే బాగుంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement