ప్రపంచ బ్యాంకులో ఏపీ పలుకు‘బడి’ | AP Reputation In World Bank | Sakshi
Sakshi News home page

ప్రపంచ బ్యాంకులో ఏపీ పలుకు‘బడి’

Published Wed, Sep 27 2023 5:03 AM | Last Updated on Wed, Sep 27 2023 7:48 AM

AP Reputation In World Bank - Sakshi

ప్రపంచ బ్యాంక్‌ ప్రధాన కార్యాలయంలో బ్యాంక్‌ ఉన్నత ప్రతినిధులతో మాట్లాడుతున్న ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డు కుమార్తె,దళిత బాలిక దడాల జ్యోత్స్న

సాక్షి, అమరావతి: పేదరికం, అసమానతలను తగ్గించేందుకు విద్య అత్యంత శక్తివంతమైన సాధనమని, అందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో విద్యా సంస్కరణలను చేపట్టారని రాష్ట్ర విద్యార్థులు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు వివరించారు. రాష్ట్రం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న 10 మంది విద్యార్థుల బృందం అమెరికాలో ఐక్యరాజ్యసమితి సదస్సుకు వెళ్లిన విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా ఐక్యరాజ్యసమితి స్పెషల్‌ స్టేటస్‌ మెంబర్‌ ఉన్నవ షకిన్‌ కుమార్‌ నేతృత్వంలో వాషింగ్టన్‌ వెళ్లిన విద్యార్థుల బృందం అక్కడ ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో సోమవారం బ్యాంకు ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, సీఎం జగన్‌ సంక్షేమ పథకాల ద్వారా అం­ది­స్తున్న మేలును ఇంగ్లిష్‌లో చక్కగా వివరించారు. ఈ సందర్భంగా బ్యాంకు ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్న­లకు విద్యార్థులు సోదాహరణంగా సమాధానాలు చెప్పారు.

విద్యా సంస్కరణలతో ఎంతో మార్పు.. 
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలు సమాజంలో ఎంతో మార్పును తీసుకొచ్చాయని రాష్ట్ర విద్యార్థులు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు వివరించారు. నాలుగున్నరేళ్లలో ప్రభుత్వ పాఠశాలలు అద్భుతంగా మారాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న తాము నేడు ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు వరకు వచ్చి మాట్లాడుతున్నామంటే.. ఏపీలో పేదరిక నిర్మూలన, విద్యకు సీఎం వైఎస్‌ జగన్‌ ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో నాడు–నేడు: మనబడి, పేద పిల్లలు అంతర్జాతీయంగా ఉన్న పోటీని తట్టుకుని ఎదిగేందుకు విద్యకు ఇస్తున్న ప్రాధాన్యం, డిజిటల్‌ ఎడ్యుకేషన్, టోఫెల్‌ శిక్షణ, ట్యాబ్స్‌ పంపిణీ వంటి అంశాలను ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు విద్యార్థులు వివరించారు. రాష్ట్రంలో అన్ని వర్గాలవారు ఉన్నత చదువులు అభ్యసించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందన్నారు.

నాడు నేడు కింద పాఠశాలల్లో సకల వసతులు కల్పించడమే కాకుండా జగనన్న విద్యాకానుక, జగనన్న అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, ట్యాబ్స్‌ పంపిణీ తదితరాల గురించి వివరించారు. సాధారణ ప్రభుత్వ స్కూళ్ల నుంచి వచ్చిన తాము ఇలాంటి అంతర్జాతీయ వేదికలపై మాట్లాడడం రాష్ట్రంలో ప్రభుత్వ విద్యకు అందిన గౌరవంగా పేర్కొన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి వల్లే తాము ఈ స్థాయిలో ఉన్నామని ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ప్రభుత్వానికి సహకారం అందిస్తాం!
ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిధులు.. విద్యార్థులు చెప్పిన అంశాలను ఆసక్తిగా విని విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పేదరిక నిర్మూలన, విద్యారంగం అభివృద్ధికి సీఎం జగన్‌ చేస్తున్న కృషిని వారు అభినందించారు. ఈ రంగంలో తాము కూడా పాలుపంచుకోవాలనుకుంటున్నట్టు తెలిపారు.

విద్యా సంస్కరణలను ప్రభావవంతంగా అమలు చేసేందుకు కావాల్సిన యంత్రాంగంపై అభిప్రాయాలు చెప్పాలని విద్యార్థులను కోరారు. రాష్ట్రంలో విద్యా సంస్కరణలు విజయవంతం కావడానికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల ద్వారా తల్లులను చైతన్యవంతం చేసిందని విద్యార్థులు వెల్లడించారు. ఈ విధానం ఎంతో ఉత్తమమైందన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు తమ ఆలోచనలను మారి్పడి చేసుకునేందుకు, వాతావరణ మార్పు, స్థిరమైన అభివృద్ధి వంటి అంశాలపై చర్చించేందుకు ఒక ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయాలని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులను కోరారు. అలాగే ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలతో విద్యా మారి్పడి కార్యక్రమాలను ప్రారం­భించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పర్యావరణం, సంస్కృతిపై క్లబ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని దేశాల్లో మోడల్‌ యునైటెడ్‌ నేషన్స్‌ కాన్సెప్ట్‌ని ప్రవేశపెట్టి రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించాలని విద్యార్థులు కోరారు.

చరిత్ర సృష్టించిన ప్రభుత్వ పాఠశాలల విధ్యార్ధులు
భారత్‌లో సాంకేతిక విద్యను మెరుగుపరచడం, విద్యార్థులకు మరిన్ని కెరీర్‌ అవకాశాలను అందించడం కోసం జూన్‌ 23న ప్రపంచ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల బోర్డు 255.5 మిలియన్ల డాలర్ల రుణాన్ని ఆమోదించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా భారత్‌లో పేద విద్యార్థుల ప్రగతి కోసం సహకారం అందిస్తామని హామీ కూడా ఇచి్చంది.

ఈ క్రమంలో ఏపీ విద్యార్థులు ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ప్రసంగించడం, రాష్ట్రంలో పేదరిక నిర్మూలన, విద్యా సంస్కరణలను లబ్ధి పొందిన విద్యార్థులే స్వయంగా వివరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి ఎంపికైన విద్యార్థుల బృందం అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొని చరిత్ర సృష్టించింది.

వరల్డ్‌ బ్యాంకు ప్రతినిధులతో సమావేశంలో ప్రపంచ బ్యాంక్‌ సీనియర్‌ అనలిస్ట్‌ ట్రేసీ విల్లిచౌస్కీ, సీనియర్‌ ఎడ్యుకేషన్‌ స్పెషలిస్ట్‌ లారా గ్రెగొరీ, లీడ్‌ హెల్త్‌ స్పెషలిస్ట్‌ రిఫత్‌ హసన్, పబ్లిక్‌ ఎంగేజ్‌మెంట్‌ ఆఫీసర్‌ లిలౌతో పాటు సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు, కేజీబీవీ కార్యదర్శి మధుసూదనరావు, ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement