
‘బాస్’ తప్పించుకోలేరు!
టీడీపీ ‘నోటుకు ఓటు’ ఉదంతంపై న్యాయ నిపుణులు
కోర్టు సాక్ష్యాధారాలుగా వీడియో, ఆడియో, ఫోన్ సంభాషణలు
బాగోతంలో భాగస్వాములందరిపైనా దర్యాప్తుకు అవకాశం
కేసు నలుగురిపైనే పెట్టినా.. ఎందరి మీదైనా చార్జిషీట్
120బీ, 34 సెక్షన్లలో అందుకు అవకాశం
హైదరాబాద్: ఏదైనా ఘటనకు సంబంధించి తొలుత కేసు కొందరిపై మాత్రమే నమోదైనా, దర్యాప్తు ఆధారంగా కుట్ర వెనుక ఉన్న భాగస్వామ్యులందరిపైనా అభియోగాలు మోపవచ్చని సుప్రీంకోర్టు న్యాయవాది శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 120బీ, సెక్షన్ 34లు ఈ వెసులుబాటును కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ‘రేవంత్‌రెడ్డి నోటుకు ఓటు కేసు’పై సోమవారం ‘సాక్షి’ టీవీ నిర్వహించిన చర్చలో ఆయన ఢిల్లీ నుంచి మాట్లాడారు. దర్యాప్తు అనంతరం చార్జిషీట్‌లో మరికొందరు వ్యక్తుల పేర్లను, సెక్షన్లను చేర్చే అవకాశముందని ఆయన స్పష్టం చేశారు. ఈ మొత్తం తంతంగాన్ని ఏసీబీ రహస్య వీడియోల్లో చిత్రీకరించిన నేపథ్యంలో, ఆ వీడియో, ఆడియోల్లో కనిపిస్తున్న, వినిపిస్తున్న వ్యక్తులందరినీ ఏసీబీ విచారిస్తుందన్నారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ధ్రువీకరిస్తే ఈ వీడియో, ఆడియోలను సాక్ష్యాధారాల కింద కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందన్నారు. ‘బాసే పంపాడు’ అని సంభాషణలో రేవంత్ ప్రస్తావించిన నేపథ్యంలో ఆ వ్యక్తి ఎవరని దర్యాప్తులో తేల్చి అతనిపైనా చార్జిషీట్ వేస్తారన్నారు. ముడుపులుగా ఇవ్వజూపిన రూ.50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి, మిగతా రూ.4.5 కోట్లను ఎక్కడి నుంచి సమీకరిస్తున్నారు, ఇదంతా నల్లధనమా అనే అంశాల్లో సైతం దర్యాప్తు జరిపి... అవసరమైతే మనీ ల్యాండరింగ్, 420, 409 సెక్షన్లను కూడా చార్జిషీట్లో చేర్చుతారన్నారు. వీరందరిపైనా ఆరోపణలు రుజువైతే ఏడేళ్ల దాకా కూడా శిక్ష పడుతుందన్నారు.
ఏ దశలోనైనా ‘బాస్’ను కేసులో చేర్చవచ్చు
‘‘బాస్ చెప్పిన ప్రకారం ఇస్తున్నాను. మా బాస్ నన్ను ఆథరైజ్ చేశాడు. ఆయన ఇంకా ఇస్తాడు’’ అని రేవంత్ చెప్పినట్లు వీడియోల్లో వినిపిస్తోంది. ఈ వీడియోలను, ఫోన్ సంభాషణలను కోర్టులు సాక్ష్యాధారాలుగా స్వీకరిస్తాయి. ఏ దశలోనైనా ఈ కేసులో ‘బాస్’ను చేర్చవచ్చు. అయితే, ఎమ్మెల్యేలపై ఏసీబీ కేసులు చెల్లుబాటు కావని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ అంశం తేలాల్సి వుంది. ఏమైనా ముడుపులివ్వజూపడం ద్వారా ఎన్నికలను అవినీతిమయం చేశారు. రేవంత్‌తో పాటు టీడీపీ నైతిక బాధ్యత వహించాలి. రేవంత్‌పై సానుభూతి వుండదు’’
- హైకోర్టు సీనియర్ న్యాయవాది
ఎస్.రామచంద్రరావు
ఇతర సాక్ష్యాలు అవసరం లేదు
‘‘ఈ ఘటన తీవ్ర విస్మయానికి గురిచేసింది. రాజకీయ నగ్నత్వం బయటపడింది. అనైతిక రాజకీయాలకు ఇది పరాకాష్ట. వీడియో దృశ్యాల్లో సాక్ష్యాధారాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కోర్టులకు ఇంకే ఇతర సాక్ష్యాలూ అవసరం లేదు’’ - శ్రీనివాస్ రెడ్డి,
‘మన తెలంగాణ’ ప్రధాన సంపాదకుడు