ఓటుకు కోట్లు కేసులో అనేక ట్విస్టులు
- రేవంత్‌కు తొలుత జైలు.. ఆనక బెయిల్
- బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టుకెళ్లిన ఏసీబీ
- విజయవాడలో కేసు పెట్టిన మత్తయ్య
- దాని ఆధారంగా తెలంగాణ పోలీసులకు నోటీసులు
- సినిమా కథను తలపించిన ఎమ్మెల్యే సండ్ర ఎపిసోడ్
- విచారణకే హాజరుకాని జిమ్మిబాబు
- కేసు దర్యాప్తులో 42 మందిని సాక్షులుగా విచారించిన ఏసీబీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యేకు రూ. 5 కోట్లు ఎరవేసిన ‘ఓటుకు కోట్లు’ కేసులో అనేక ట్విస్టులు చోటు చేసుకున్నాయి. తొలుత టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డితో పాటు బిషప్ సెబాస్టియన్, రుద్రఉదయ్‌సింహలను అదుపులోకి తీసుకొన్న ఏసీబీ... వారిని విచారించిన అనంతరం అరెస్టు ప్రకటించింది. వీరిని వరుసగా ఏ-1, ఏ-2, ఏ-3 పేర్కొంది. అలాగే కుట్రలో జెరూసలెం మత్తయ్యకు పాత్ర ఉండటంతో అతన్ని ఏ-4గా పేర్కొంది. గతేడాది మే 31న ఏసీబీ కేసు నమోదు చేసింది. తర్వాత ఏ-4 మత్తయ్య విజయవాడకు మకాం మార్చాడు.
తనను తెలంగాణ ప్రభుత్వం వేధిస్తోందని, బెదిరింపులకు గురిచేస్తోందంటూ విజయవాడ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశాడు. వెంటనే కేసు నమోదైంది. తెలంగాణ పోలీసులకు, ప్రభుత్వానికి నోటీసులు జారీ అయ్యాయి. అంతేకాదు ఏసీబీ తనను అరెస్టు చేయకూడదం టూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మెట్లు ఎక్కాడు. మత్త్త య్య తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదులు వచ్చి వాదనలు వినిపించారు. ఒకానొక సందర్భంలో ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు.
రేవంత్ విషయంలో సుప్రీంకోర్టుకు...
ఓటుకు కోట్లు కేసులో ఏ-1 నిందితుడు రేవంత్‌రెడ్డి విషయంలో ఏసీబీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అతనికి బెయిల్ మంజూరు కాకుండా ఉండేందు ఏసీబీ శతవిధాల ప్రయత్నించింది. ఓటుకు కోట్లు కేసులో అరెస్టైన నెల రోజుల తర్వాత బెయిల్‌పై బయటకొచ్చారు. రేవంత్‌కు మొదట బెయిల్ ఇవ్వడానికి ఏసీబీ కోర్టు నిరాకరించింది. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఏసీబీ చేసిన విజ్ఞప్తి మేరకు... కేసు తీవ్రత దృష్ట్యా బెయిల్ మంజూరు చేయలేమని స్పష్టం చేసింది. అయితే నెల రోజుల తర్వాత రేవంత్‌రెడ్డి రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాడు. అప్పటికే 14రోజుల కస్టడీ ముగియడం, ఆధారాలన్నీ ఏసీబీ సేకరించినందున హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు కేవలం కొడంగల్ నియోజవర్గానికి మాత్రమే పరిమితం కావాలని సూచించింది. అంతేకాదు దర్యాప్తు అధికారులు ఎప్పుడు కోరితే అప్పుడు వారి ముందు హాజరు కావాలని ఆదేశించింది. పాస్‌పోర్టులనూ స్వాధీనం చేయాలని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఏసీబీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఏపీలో తలదాచుకున్న సండ్ర
కేసు విచారణలో భాగంగా టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అత్యంత కీలకమని భావించిన ఏసీబీ అతనికి నోటీసులు జారీ చేసింది. మొదట సాక్షిగా పేర్కొంటూ సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేసింది. అయితే సండ్ర దాదాపు 15 రోజులపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రేవంత్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన తర్వాత సండ్ర బయటకు వచ్చా రు. తనకు ఆరోగ్యం బాగోలేక రాజమండ్రిలోని బొల్లినేని ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు పేర్కొన్నారు. ఏసీబీ విచారణకు పిలిస్తే వస్తానంటూ ఆయనే లేఖలు రాశారు. ఆ లేఖలో తన సెల్ నంబర్ ఇచ్చి.. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానంటూ ప్రకటించారు. దీంతో ఏసీబీ మరోసారి సండ్రకు నోటీసులు జారీ చేస్తూ.. సీఆర్‌పీసీ 41(ఏ) కింద నింది తుల జాబితాలో చేర్చింది. ఏసీబీ నోటీసుల నేపథ్యంలో సండ్ర విచారణకు హాజరు కాగా రెండు రోజుల అనంతరం అరెస్టు ప్రకటించింది. అతను కూడా రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందారు.
లోకేశ్ కారు డ్రైవర్‌కు నోటీసులు..
దర్యాప్తులో భాగంగా ఏసీబీ దాదాపు 42 మందిని విచారించింది. వీరిలో ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసిన వేం నరేందర్‌రెడ్డితో పాటు అతని కుమారుడుని కూడా ఏసీబీ విచారించింది. వీరితో పాటు టీడీపీ కార్యాలయంలో పనిచేసే వారితో పాటు రేవంత్ డ్రైవర్, గన్‌మెన్స్ ఇలా ముఖ్యమైన వారందినీ విచారించింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ముఖ్య అనుచరులను కూడా ఏసీబీ మూడు రోజుల పాటు విచారించింది. లోకేశ్ కారు డ్రైవర్ కొండల్‌రెడ్డికి సైతం నోటీసులు జారీ చేసింది. అయితే అతను మాత్రం విచారణకు హాజరు కాలేదు. అలాగే తెలుగుయువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిమ్మిబాబుకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. జిమ్మిబాబు కొంత కాలం పశ్చిమగోదావరిలోని ఒక టీడీపీ నేత నివాసంలో ఆశ్రయం పొందినట్లు ఏసీబీ గుర్తించింది. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో అతన్ని ఇప్పటి దాకా విచారించలేదు.