‘ఓటుకు కోట్లు’ కేసులో చార్జిషీట్ | 'crores to vote, "the charge sheet in the case | Sakshi
Sakshi News home page

‘ఓటుకు కోట్లు’ కేసులో చార్జిషీట్

Published Wed, Jul 29 2015 12:16 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

‘ఓటుకు కోట్లు’ కేసులో చార్జిషీట్ - Sakshi

‘ఓటుకు కోట్లు’ కేసులో చార్జిషీట్

రేవంత్‌రెడ్డి, మరో ముగ్గురు నిందితులపై దాఖలు
 
హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితో పాటు ముగ్గురు నిందితులపై ఏసీబీ అధికారులు మంగళవారం ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ (అభియోగపత్రం) దాఖలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేయాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రూ.ఐదు కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని, అడ్వాన్స్‌గా రూ. 50 లక్షలిస్తూ రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో రేవంత్‌తోపాటు తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు హ్యారీ సెబాస్టియన్, ఉదయ సింహ, మత్తయ్య (ప్రస్తుతం పరారీలో ఉన్నారు)లను నిందితులుగా పేర్కొంటూ.. న్యాయమూర్తి లక్ష్మీపతికి ఈ చార్జిషీట్‌ను అందజేశారు.

అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్టు)లోని సెక్షన్ 12, ఐపీసీ సెక్షన్లు 120(బి)(నేరపూరిత కుట్ర), 34 (కామన్ ఇంటెన్షన్) కింద అభియోగాలను మోపారు. 25 పేజీల చార్జిషీట్‌ను దాఖలు చేసిన ఏసీబీ ఇందులో 39 మందిని సాక్షులుగా పేర్కొంది. అలాగే ఈ కేసుతో సంబంధమున్న అనేక మంది ఫోన్ సంభాషణల సారాంశాన్ని డాక్యుమెంట్ల రూపంలో కోర్టుకు సమర్పించినట్లు తెలుస్తోంది. ‘ఓటుకు కోట్లు’ కుట్రను నిరూపించేందుకు అవసరమైన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదికతోపాటు 316 కీలక డాక్యుమెంట్లను కూడా కోర్టుకు సమర్పించింది. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని, దర్యాప్తులో వెలుగుచూసిన అంశాల ఆధారంగా అనుబంధ చార్జిషీట్ దాఖలు చేస్తామని కోర్టుకు ఏసీబీ నివేదించింది.

 ఆ సొమ్మే కీలకం..
 స్టీఫెన్‌సన్‌కు ఇచ్చేందుకు రేవంత్, సెబాస్టియన్, ఉదయ్ సింహలు తెచ్చిన రూ. 50 లక్షలు ఈ కేసు నిరూపణలో కీలకంగా మారనున్నాయి. అడ్వాన్సుగా రూ. 50 లక్షలు ఇస్తున్నామని, ఓటింగ్ తర్వాత రూ.4.5 కోట్లు ఇస్తామంటూ రేవంత్‌రెడ్డి పదేపదే చెప్పిన విషయం కూడా వీడియోలో రికార్డయిన విషయం తెలిసిందే. డబ్బు తీయాలంటూ రేవంత్ సంజ్ఞలు చేయడం, ఉదయ్ సింహ డబ్బు తీసి టీపాయ్‌పై పెట్టడం, ఆ సొమ్ము రూ. 50 లక్షలు ఉన్నాయంటూ రేవంత్ చెప్పడంతో పాటు తదితర సంభాషణలను ఏసీబీ అధికారులు యథాతథంగా తెలుగులోనూ టైప్‌చేసి డాక్యుమెంట్ రూపంలో కోర్టుకు సమర్పించినట్లు సమాచారం.
 
 అనుబంధ చార్జిషీట్‌లో బాబు పేరు?
 ‘ఓటుకు కోట్లు’ ప్రలోభాల పర్వం వెనుక ఉన్న కీలక వ్యక్తుల పాత్రపై పూర్తి ఆధారాలు సేకరించిన ఏసీబీ.. మరో వారం రోజుల్లో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. అందులో  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, సండ్ర వెంకట వీరయ్యతోపాటు మరొకరిని నిందితులుగా చేర్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సెబాస్టియన్ ఫోన్ నుంచి చంద్రబాబు స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన సంభాషణతోపాటు చంద్రబాబు ఆదేశాల మేరకే తాను మాట్లాడేందుకు వచ్చానంటూ రేవంత్‌రెడ్డి పదేపదే చెప్పిన సంభాషణల ఆధారంగా బాబు కనుసన్నల్లోనే ఈ వ్యవహారం నడిచినట్లు ఏసీబీ నిర్ధారణకు వచ్చింది. ఈ కుంభకోణానికి చంద్రబాబే సూత్రధారి అనేందుకు పక్కా ఆధారాలున్న నేపథ్యంలో ఆయన్ను నేరుగా నిందితుడిగా చేర్చి అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయాలని ఏసీబీ భావిస్తున్నట్లు సమాచారం.
 
రంగంలోకి ఈడీ
‘ఓటుకు కోట్లు’ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగనుంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50లక్షలు ఇవ్వజూపడంతోపాటు మరో రూ.4.5 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో.. ఆ సొమ్మంతా ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని ఈడీ ఆరా తీయనుంది. సాధారణంగా సీబీఐ లేదా ఏసీబీ అధికారులు దర్యాప్తు పూర్తిచేసిన తర్వాత ఈడీ రంగంలోకి దిగుతుంది. తాజాగా మంగళవారం ఈ కేసులో ఏసీబీ చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో.. ఇక ఈడీ దర్యాప్తు ప్రారంభం కానుంది. ఈ చార్జిషీట్ ప్రతిని ఈడీ అధికారులు ఒకటి రెండు రోజుల్లో కోర్టు నుంచి తీసుకోనున్నారు. తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు (ఈసీఐఆర్) జారీ చేసి మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ల కింద దర్యాప్తు చేస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement