నిజాయితీ అధికారులకు రక్షణ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి ఆరోపణల విషయంలో మార్పులకు రంగం సిద్ధమైంది. సీబీఐ వంటి సంస్థలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను విచారించేముందు ఆయా శాఖల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మార్పులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నిజాయితీ అధికారులను కాపాడేందుకు అవినీతి వ్యతిరేక బిల్లులో సవరణలు తీసుకొచ్చి వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని గురువారం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. అధికారులు స్వేచ్ఛగా పనిచేసుకునేలా ఈ బిల్లు ధైర్యాన్నిస్తుందని.. సుపరిపాలనకు ఇది కీలకమైన అంశమని మంత్రి అన్నారు.
అవినీతి వ్యతిరేక సవరణ బిల్లును 2013, ఆగస్టు 19న రాజ్యసభలో ప్రవేశపెట్టారు. తర్వాత దీన్ని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి ప్రతిపాదించారు. 2016, ఫిబ్రవరి 6న రాజ్యసభకు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ నివేదిక ఇచ్చింది. గతేడాది ఏప్రిల్ 29న బిల్లులోని సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.