వారికి ప్రత్యేక రక్షణలెందుకు?
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు అవినీతి నిరోధక చట్టంలో ప్రత్యేక రక్షణలు కల్పించడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. అది ఆ చట్ట స్ఫూర్తికే విరుద్ధమని స్పష్టం చేసింది. వారిపై దర్యాప్తును ప్రారంభించే ముందు సీబీఐ వారి పై అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలన్న నిబంధనను తప్పుపట్టింది. వారికా ప్రత్యేక రక్షణ ఎందుకని ప్రశ్నించింది. అవినీతికి సంబంధించినంత వరకు నిందితులంతా ఒకే తరగతి అని కుండబద్ధలు కొట్టింది.
అది రాజ్యాంగంలోని సమాన హక్కు నిబంధనకు వ్యతిరేకమేనని బుధవారం జస్టిస్ ఆర్‌ఎం లోధా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తేల్చి చెప్పింది. ధర్మాసనం ప్రశ్నల పరంపరను ప్రభుత్వం తరఫు న్యాయవాది అదనపు సొలిసిటర్ జనరల్ ఎల్.నాగేశ్వరరావు తట్టుకోలేకపోయారు. ‘ఒకదాని వెంట మరొక ప్రశ్న దూసుకొస్తుంటే జవాబివ్వడం కష్టం. బదులిచ్చేందుకు నాకు కాస్త అవకాశమివ్వండి’ అంటూ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. బెంచ్ సంధించిన ప్రశ్నలు..
కొందరికే ఈ రక్షణ ఎందుకు? ఏ పద్ధతి ప్రకారం వర్గీకరణ చేశారు?
వేరే ఉద్యోగులకు ఈ ప్రయోజనం ఎందుకు లేదు? వీరికి, వారికి ఏంటీ తేడా?
విధానరూపకర్తలైన ఉన్నతాధికారులకు దర్యాప్తు నుంచి రక్షణ లభించి.. ఆ విధానాలను అమలు పరిచేవారు మాత్రం ఈ చట్టం పరిధిలోకి వస్తారా?
సంయుక్త కార్యదర్శి, ఆపై స్థాయి అధికారులు నిర్భీతితో పనిచేసేందుకు.. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టంలోనూ ప్రత్యేక రక్షణలు కల్పించారని, వాటి ప్రకారం అవినీతి ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించే ముందు వారి ఉన్నతాధికారి అనుమతి సీబీఐ తీసుకోవాల్సి ఉంటుందని అదనపు సొలిసిటర్ జనరల్ ధర్మాసనానికి తెలిపారు.