నందకుమార్, రామచంద్రభారతి, సింహయాజిలను ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వద్దకు తీసుకెళ్తున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: ‘టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ఎర’ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. రెడ్ హ్యాండెడ్‌గా నగదు పట్టుబడనందున ఈ కేసు అవినీతి నిరోధక చట్టం కిందకు రాదని హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు. అరెస్టు చేసిన నిందితులను రిమాండ్‌కు పంపాలంటూ పోలీసులు దాఖలు చేసిన రిపోర్టును తిరస్కరించారు. నిందితులను విడుదల చేయాలని.. వారికి సీఆర్పీసీ సెక్షన్ 41 ప్రకారం నోటీసులు జారీ చేసి విచారించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలతో నిందితులు కొనుగోలు సంప్రదింపులు జరిపిన ఆడియో, వీడియో ఫుటేజీలు ఉన్నాయని పోలీసులు విన్నవించినా దీనిని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోలేదని తెలిసింది.
గురువారం పొద్దంతా విచారించి..
టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి, బీజేపీలో చేరితే రూ.100 కోట్ల డబ్బు, కాంట్రాక్టులు, కేంద్ర పదవులు ఇస్తామని ముగ్గురు వ్యక్తులు ప్రలోభపెట్టారంటూ నలుగురు ఎమ్మెల్యేలు ఆరోపించడం, బుధవారం రాత్రి అజీజ్‌నగర్‌లోని ఫామ్‌హౌజ్‌పై పోలీసులు దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్‌రెడ్డి, రేగ కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డిలతో.. ఢిల్లీలోని ఫరీదాబాద్‌కు చెందిన పురోహితుడు రాంచంద్రభారతి అలియాస్ సతీశ్‌శర్మ, హైదరాబాద్‌కు చెందిన హోటల్స్ వ్యాపారి నందకుమార్, తిరుపతికి చెందిన సింహయాజీ స్వామిలు మంతనాలు జరిపినట్టుగా ఆరోపణలు వచ్చాయి.
రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి నిందితులు ముగ్గురిని మొయినాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారిపై ఐపీసీలోని 120బీ, 171 బీ, 171ఇ, 506 సెక్షన్లతోపాటు అవినీతి నిరోధక చట్టం–1988లోని సెక్షన్–8ను నమోదు చేశారు. వారిని శంషాబాద్ రూరల్ పోలీసుస్టేషన్‌కు తరలించి విచారించారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే నర్కుడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రాత్రి శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి, స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్‌ఓటీ), శంషాబాద్ రూరల్ పోలీసులు సుమారు 10 వాహనాల్లో భారీ భద్రత మధ్య ముగ్గురు నిందితులను సరూర్‌నగర్‌లోని ఏసీబీ కోర్టు జడ్జి రాజగోపాల్ నివాసంలో హాజరుపర్చారు.
సరైన ఆధారాలేవి?
పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో నిందితులను రిమాండ్‌కు పంపేందుకు తగిన ఆధారాలు లేవని న్యాయమూర్తి స్పష్టం చేశారు. నిందితులు పట్టుబడిన సమయంలో వారి నుంచి ఎలాంటి నగదు స్వాదీనం చేసుకోకపోవటంతో వారిపై నమోదు చేసిన కేసులు అవినీతి నిరోధక చట్టం సెక్షన్ల పరిధిలోకి రావని స్పష్టం చేశారు. ఈ మేరకు రిమాండ్ రిపోర్టును తిరస్కరిస్తూ.. ఆ ముగ్గురికి 41 సీఆర్పీసీ కింద నోటీసులిచ్చి విచారించాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకే నిందితులు ఫామ్‌హౌజ్‌కు వచ్చారని.. కొనుగోలు సంప్రదింపులు జరిపిన ఆడియో, వీడియో రికార్డులు ఉన్నాయని పోలీసులు వివరించినా పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం.
బీజేపీలో చేరితే రూ.100 కోట్లు ఇస్తామన్నారు
తనతోపాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించారని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి బుధవారం రాత్రి 11.30కు మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు నందకుమార్ సహా ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) ప్రతిని రాత్రి 12.30 గంటలకు కోర్టుకు పంపారు. ఉన్నతాధికారులు రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్‌కు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. ఆ ఎఫ్‌ఐఆర్ (నంబర్ 455/2022)లోని వివరాల మేరకు..
రూ.100కోట్లు, పదవులు, కాంట్రాక్టులు ఎర..
బీజేపీకి చెందిన ఢిల్లీలోని ఫరీదాబాద్ వాసి రాంచంద్రభారతి అలియాస్ సతీశ్‌శర్మ, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి నందకుమార్ ఇద్దరూ రోహిత్‌రెడ్డిని కలిసి బేరసారాలు చేశారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేయవద్దని, ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరాలని కోరారు. ఇందుకోసం రూ.100 కోట్లు ఇస్తామని, కేంద్ర ప్రభుత్వ ఆదీనంలోని సివిల్ కాంట్రాక్టులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు.
తమ మాట వినకుంటే క్రిమినల్ కేసులతో పాటు సీబీఐ, ఈడీ దాడులు తప్పవని బెదిరించారు. టీఆర్‌ఎస్ నేతృత్వంలో నడుస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొడతామని వ్యాఖ్యానించారు. ఈ ప్రతిపాదనలు అనైతికం, అక్రమం కావడం, అవినీతిని ప్రోత్సహించేలా ఉండటంతో.. వారిని ఏమాత్రం ప్రోత్సహించకూడదని రోహిత్‌రెడ్డి నిర్ణయించుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలంటూ..
ఈ క్రమంలో బుధవారం మరోసారి రోహిత్‌రెడ్డిని సంప్రదించిన నందకుమార్, రాంచంద్రభారతి.. ఆ రోజు మధ్యాహ్నం అజీజ్‌నగర్‌లోని ఫామ్‌హౌస్‌కు వస్తున్నామని, అక్కడే బేరసారాలు పూర్తి చేద్దామని చెప్పారు. ఇదే సమయంలో రూ.50 కోట్ల చొప్పున ఆశ చూపి మరికొందరు ఎమ్మెల్యేలను బీజేపీలో చేరేందుకు సిద్ధం చేయాలని కూడా కోరారు.
రోహిత్‌రెడ్డితోపాటు ఈ డీల్‌కు అంగీకరించిన ఎమ్మెల్యేలు తమ విధులను సక్రమంగా నిర్వహించకుండా, నిబద్ధతతో, నిజాయతీతో పని చేయకూడదని.. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని కోరారు. బుధవారం మధ్యాహ్నం తిరుపతికి చెందిన సింహయాజి స్వామితో కలిసి ఫామ్‌హౌస్‌కు వస్తున్నామని.. అక్కడే డీల్‌ను పూర్తి చేద్దామని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో బాధ్యులపై కేసు నమోదు చేసి, తగిన చర్యలు తీసుకోవాలని రోహిత్‌రెడ్డి తన ఫిర్యాదులో కోరారు.
Comments
Please login to add a commentAdd a comment