‘పాఠశాలల స్కామ్‌’ దర్యాప్తు పూర్తి | Investigation is completed in the Scams of Private schools | Sakshi
Sakshi News home page

‘పాఠశాలల స్కామ్‌’ దర్యాప్తు పూర్తి

Published Wed, Jan 23 2019 2:49 AM | Last Updated on Wed, Jan 23 2019 2:49 AM

Investigation is completed in the Scams of Private schools - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ ప్రైవేట్‌ స్కూళ్లకు అక్రమ అనుమతుల స్కామ్‌లో నగర నేర పరిశోధన విభాగం(సీసీఎస్‌) పోలీసులు దర్యాప్తు పూర్తిచేశారు. నిందితులపై దర్యాప్తు అధికారులు అవినీతి నిరోధక చట్టాన్ని ప్రయోగించారు. సీసీఎస్‌ పోలీసులు ఈ చట్టాన్ని ప్రయోగించడం ఇదే తొలిసారి. విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇచ్చిన ఫిర్యాదులోని అంశాల ఆధారంగానే కేసులో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లనూ చేర్చారు. ఇప్పటివరకు నిందితులుగా తేలిన 9 మందిలో అత్యధికులు ప్రభుత్వ ఉద్యోగులే. వీరిపై అభియోగపత్రాలు దాఖలు చేయడానికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే ప్రాసిక్యూషన్‌కు అనుమతించాలని సర్కారుకు లేఖ రాశారు.  

గోల్‌మాల్‌ ఇలా... 
ప్రైవేట్‌ స్కూళ్లు నిర్ణీత కాలానికి అనుమతుల్ని రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త పాఠశాలలు అనుమతులు తీసుకుంటూ ఉంటాయి. వీటి ఫైళ్లు డీఈవో కార్యాలయాలతోపాటు రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ఫర్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌(ఆర్‌జేడీఎస్‌ఈ) కార్యాలయానికి వెళ్తాయి. దరఖాస్తు చేసుకున్న స్కూళ్లు కొంత మొత్తం రుసుమును చలానా రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని దరఖాస్తుల్ని హైదరాబాద్‌ డీఈవో కార్యాలయంలోని జూనియర్‌ అసిస్టెంట్‌ మహ్మద్‌ మన్సూర్‌ అలీ గోల్‌మాల్‌ చేశాడు. ఆయా స్కూళ్ల యాజమాన్యాల నుంచి తీసుకున్న సొమ్మును చలానా రూపంలోకి మార్చకుండా స్వాహా చేశాడు. ఆర్‌జేడీఎస్‌ఈ పేరిట నకిలీ అనుమతిపత్రాలు సృష్టించాడు.

ఆర్‌జేడీఎస్‌ఈ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేసి ప్రస్తుతం మంచిర్యాల డీఈవో ఆఫీస్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్న మహ్మద్‌ అబ్దుల్‌ ఘనీ, ఆర్‌జేడీఎస్‌ఈ కార్యాలయం సూపరింటెండెంట్‌ మహ్మద్‌ హసన్‌ సయీద్, డీఈవో కార్యాలయంలోని జూనియర్‌ అసిస్టెంట్‌ జి.వేణు గోపాల్‌ సాయంతో వీటిని రూపొందించి పాఠశాలల యాజమాన్యాలకు అందించాడు. ఇవి సరైనవే అని నమ్మిన యాజమాన్యాలు 2017–18 విద్యాసంవత్సరానికి సంబంధించి పదోతరగతి విద్యార్థుల్ని ఎన్‌రోల్‌ చేసుకున్నాయి. టెన్త్‌ పరీక్షల సమయంలో జిల్లాలవారీగా పరీక్షలు రాసేందుకు అనుమతి ఉన్న పాఠశాలల జాబితాలను ప్రభుత్వ పరీక్షల విభాగానికి డీఈవోలు అందిస్తారు. ప్రతి పాఠశాల సైతం తన వద్ద ఉన్న టెన్త్‌ క్లాస్‌ విద్యార్థుల పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో అదే విభాగానికి అప్‌లోడ్‌ చేస్తుంది. గత ఏడాది అలా చేసిన సందర్భంలోనే ఈ స్కామ్‌ బయటపడింది. డీఈవోల నుంచి వచ్చిన జాబితాలను పరిశీలించిన పరీక్షల విభాగం అందులో లేని స్కూళ్లు సైతం తమ విద్యార్థుల వివరాలను అప్‌లోడ్‌ చేసినట్లు గుర్తించింది.

విచారణకు ఆర్‌జేడీ ఆదేశం
ప్రైవేట్‌ స్కూళ్లకు అక్రమ అనుమతుల వ్యవహారంపై విచారణ చేయాల్సిందిగా ప్రభుత్వపరీక్ష విభాగం హైదరాబాద్‌ రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ను ఆదేశించింది. ఈ విచారణ నేపథ్యంలోనే అసలు విషయం వెలుగులోకి రావడంతో విద్యాశాఖ అధికారులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన నిందితులపై ఐపీసీతోపాటు అవినీతి నిరోధక చట్టం(పీసీ యాక్ట్‌) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఆధారాలు లభించిన నేపథ్యంలో గత ఏడాది ఏప్రిల్‌లో మన్సూర్, ఘనీ, హసన్, వేణుగోపాల్‌లను పట్టుకుంది. మహమూద్‌ అలీ విచారణ నేపథ్యంలోనే 2017–18 విద్యాసంవత్సరానికి సంబంధించి 14 స్కూళ్లకు అక్రమంగా ఇచ్చిన ఈఆర్టీని గుంజా శామ్యూల్‌ జోసఫ్‌ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు వెల్లడైంది. దీంతో శామ్యూల్‌ను అరెస్టు చేశారు. మరికొందరు నిందితులు ముందస్తు బెయిల్‌ తీసుకున్నారు. ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే చార్జ్‌షీట్లు దాఖలు చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement