సెక్షన్ 19 రాజ్యాంగబద్ధమే!
పబ్లిక్‌సర్వెంట్లకు రక్షణ కల్పించడాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: అవినీతి కేసుల విచారణలో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులకు అవినీతి నిరోధక చట్టంలో కల్పించిన రక్షణ సదుపాయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రభుత్వ ముందస్తు అనుమతితో మాత్రమే వారిని విచారించాలని పేర్కొన్న అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 రాజ్యాంగ విరుద్ధమేమీ కాదని స్పష్టం చేసింది. తప్పుడు ఆరోపణల నుంచి ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించడం.. అవినీతికి పాల్పడినట్లు సరైన సాక్ష్యాధారాలుంటే విచారణ జరపడం.. ఈ రెండింటి మధ్య సరైన సమతౌల్యం పాటించాలని జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. తప్పుడు ఆరోపణల నుంచి నిజాయితీపరులను రక్షించేందుకు ‘ముందస్తు అనుమతి’ అనేది ఒక చట్టబద్ధమైన రక్షణ అని ధర్మాసనం వివరించింది.
అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19ని తొలగించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా బుధవారం ధర్మాసనం పై స్పష్టీకరణ ఇచ్చింది. సెక్షన్ 19 లోని ‘ముందస్తు అనుమతి’ నిబంధన వల్ల అవినీతిపరులైన రాజకీయ నేతలపై విచారణ సాధ్యం కావడం లేదంటూ యూపీ మాజీ సీఎం మాయావతి ఉదంతాన్ని ఉటంకిస్తూ న్యాయవాది మంజూర్ అలీ ఖాన్ ఆ పిల్ దాఖలు చేశారు. సెక్షన్ 19తో సంబంధం లేకుండా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అందరు రాజకీయ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులను విచారించేలా ఆదేశాలివ్వాలని ఆయన అందులో కోరారు.