నిందితులను కలవడం ముమ్మాటికీ తప్పే: సుప్రీం
సీబీఐ మాజీ చీఫ్ రంజిత్ సిన్హాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బొగ్గు స్కాంలో నిందితులను రక్షించే ప్రయత్నం చేసినందుకు ఆయనపై విచారణ జరగాల్సిందేనని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. ఈ స్కాంలో నిందితులను పలుమార్లు రంజిత్ సిన్హా కలవడం ఏమాత్రం సరికాదని, దర్యాప్తు కొనసాగుతున్నప్పుడు ఇలా చేయడం ముమ్మాటికీ తప్పేనని, దీనిపై విచారించాలని జస్టిస్ మదన్ బి. లోకూర్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. సీబీఐ మాజీ చీఫ్పై విచారణ ఎలా జరగాలో నిర్ణయించడంలో సహకరించాలని చీఫ్ విజిలెన్స్ కమిషనర్ను సుప్రీంకోర్టు కోరింది. జూలై ఆరోతేదీ లోగా ఈ విషయమై తన సమాధానం చెప్పాలని తెలిపింది.
రంజిత్ సిన్హాపై సిట్తో దర్యాప్తు చేయించాలంటూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషణ్ దాఖలుచేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం ఈ ఆదేశాలిచ్చింది. సిన్హా ఇంటివద్ద ఉన్న అతిథుల జాబితా డైరీని బట్టి చూస్తే.. కోల్గేట్ స్కాంలోని పలువురు నిందితులు ఆయనతో ప్రత్యక్షంగా టచ్లో ఉన్నట్లు తెలుస్తోందని, అంటే వాళ్లను రక్షించేందుకు ఆయన ప్రయత్నించినట్లే భావించాలని కూడా సుప్రీం వ్యాఖ్యానించింది.