రాతపూర్వక వివరణ ఇవ్వాలి
* 2జీ కేసులో సీబీఐ డెరైక్టర్ రంజిత్‌సిన్హాకు సుప్రీం ఆదేశం
* నిందితులతో భేటీ అయ్యారనేఆరోపణలు చాలా తీవ్రమైనవని వ్యాఖ్య
* వారంలో అఫిడవిట్ దాఖలు చేయాలి
* విచారణ 15కు వాయిదా
న్యూఢిల్లీ: 2జీ కుంభకోణంలో నిందితులుగా ఉన్న పలువురితో భేటీ అయినట్లుగా వచ్చిన ఆరోపణలపై రాతపూర్వకంగా స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిందేనని సీబీఐ డెరైక్టర్ రంజిత్‌సిన్హాను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ ఆరోపణలు చాలా తీవ్రమైనవని, దీనిపై మౌఖికంగానే వివరణ ఇస్తాననడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి వారం రోజుల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ... విచారణను 15వ తేదీకి వాయిదా వేసింది.
‘2జీ’ కేసులో నిందితులుగా ఉన్న పలు సంస్థలకు చెందిన ప్రముఖులు సీబీఐ డెరైక్టర్ రంజిత్‌ను కలిశారని, ఆ కేసు నుంచి వారిని తప్పించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఢిల్లీకి చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ సుప్రీంలో పిల్ దాఖలు చేయడం తెలిసిందే. ఈ మేరకు రంజిత్‌ను ఆయన నివాసంలో కలసిన సందర్శకుల జాబితాను కోర్టుకు సమర్పించారు. వెంటనే రంజిత్‌ను సీబీఐ చీఫ్ పదవి నుంచి తప్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కూడా కోర్టును కోరారు. సోమవారం జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం నిపై విచారణ కొనసాగించింది. పిటిషనర్ల ఆరోపణలపై మౌఖిక వివరణ ఇస్తానన్న రంజిత్ విజ్ఞప్తిని తోసిపుచ్చింది.
తాను అఫిడవిట్ దాఖలు చేస్తే.. అది 2జీ కేసుపై ప్రభావం చూపిస్తుందని, అసలు సీబీఐ రహస్య ఫైళ్లు పిటిషనర్లకు ఎలా లభించాయో తేలాల్సి ఉందని రంజిత్ పేర్కొనడాన్ని తప్పుబట్టింది. సీబీఐ చీఫ్‌పై ఉన్న ఆరోపణలు చాలా తీవ్రమైనవని, 2జీ కేసును సుప్రీంకోర్టే పర్యవేక్షిస్తోందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కోర్టు సూచించింది. తనపై ఆరోపణలకు వివరణ ఇస్తూ రంజిత్ వారం రోజుల్లో అఫిడవిట్ ఇవ్వాలని ఆదేశిస్తూ.. విచారణను 15కి వాయిదా వేసింది. కాగా.. రంజిత్ నివాసానికి వచ్చిన సందర్శకుల జాబితా పుస్తకాన్ని విచారణ సందర్భంగా పిటిషనర్ల న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టుకు అందజేశారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తన ఇంటికి వచ్చి ఆ డాక్యుమెంట్లను తనకిచ్చారన్నారు. మరోవైపు.. ఈ కేసు విచారణలో ఉండగా 2జీ కేసు దర్యాప్తునకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా రంజిత్‌సిన్హాను నిలువరించాలన్న ప్రశాంత్ భూషణ్ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది.
‘ఈడీ శాశ్వత డిప్యూటీ డెరైక్టర్‌గా రాజేశ్వర్’
ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసుల్లో మనీ లాండరింగ్‌పై దర్యాప్తు చేస్తున్న రాజేశ్వర్‌సింగ్‌ను మూడు రోజుల్లోగా ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్) శాశ్వత డిప్యూటీ డెరైక్టర్‌గా చేర్చుకోవాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. అసలు రాజేశ్వర్‌సింగ్ యూపీ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. డిప్యుటేషన్‌పై ఈడీలోకి వచ్చిన ఆయన 2జీ, ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసుల్లో మనీలాండరింగ్‌పై లోతుగా దర్యాప్తు జరిపి పలు కీలక అంశాలను వెలికితీశారు.
అయితే రాజేశ్వర్‌సింగ్‌ను తిరిగి యూపీ కేడర్‌కు బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఆయన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా.. ఈడీ శాశ్వత డిప్యూటీ డెరైక్టర్‌గా నియమించాలని దాదాపు ఎనిమిది నెలల కింద ఆదేశించింది. అయినా ప్రభుత్వం ఇప్పటికీ రాజేశ్వర్‌సింగ్‌ను నియమించకపోవడంతో.. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది.