అందలమెక్కించిన వారిపైనే తిరగబడే నైజం
నెరవేరని ఢిల్లీ ఆశలు గెలుపు కోసం ఆపసోపాలు
దళిత, క్రైస్తవ వ్యతిరేకిగా ముద్ర
ప్రజలకు అందుబాటులో ఉండరనే భావన
ఉండి టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజుకు ఎదురుగాలి
ఓటమి భయంతోనే కేడర్‌పై చిర్రుబుర్రులు
స్వస్థలం ఉండి నియోజకవర్గమైనా.. ఉండేది మాత్రం రాజధానుల్లోనే.. సంక్రాంతి కోడిపందాల సమయంలో హడావుడి తప్ప మిగిలిన రోజుల్లో నియోజకవర్గానికి వచ్చింది అరుదే.. రచ్చబండంటూ.. అందలమెక్కించిన వారిపై నోరుపారేసుకోవడం తప్ప ఎంపీగా తనను గెలిపించిన ప్రజల వైపు కన్నెత్తి చూసింది లేదు.. ఈ ప్రాంత అభివృద్ధికి చేసిందేమీ లేదు.. ఆయనే మాజీ ఎంపీ, టీడీపీ ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కనుమూరు రఘురామకృష్ణరాజు. ఢిల్లీలో తన బిల్డప్ పాచికలు పారకపోవడంతో ఉండిలో టీడీపీ అభ్యర్థిగా గెలుపు కోసం ఆపసోపాలు పడుతున్నారు.
సాక్షి, భీమవరం: బ్యాంకు అప్పులకు సంబంధించిన వ్యవహారాలు, సీబీఐ కేసుల నేపథ్యంలో ఢిల్లీలోనే ఉంటూ లాబీయింగ్ చేసుకునేందుకు ఎంపీ సీటుపై చాలానే ఆశలు పెట్టుకున్నారు రఘు రామకృష్ణరాజు. తానే నరసాపురం కూటమి అభ్యర్థినంటూ తాడేపల్లిగూడెం జెండా సభలో స్వయంగా ప్రకటించేసుకున్నారు. ఇంతకన్నా భారీ సభ ఏర్పాటు చేస్తానంటూ బిల్డప్‌లూ ఇచ్చారు. అంతలోనే సీన్ రివర్స్ అయ్యింది. కేంద్రంలో ఆయన పలుకుబడి ఏ పాటిదో సీట్ల కేటాయింపుల్లోనే తేలిపోయింది. బీజేపీ సీటు మరొకరికి ఇవ్వడంతో ఏం చేయాలో పాలుపోలేదు. మరికొద్ది రోజుల్లో మంచి మాట వింటారంటూ మీడియా ముందు బిల్డప్‌లు ఇస్తూ ఎన్ని పైరవీలు చేసినా, జిల్లాలోని కూటమి అసెంబ్లీ అభ్యర్థులందరితో సంప్రదింపులు చేయించినా బీజేపీ నిర్ణయాన్ని మార్చలేకపోయారు. ఏదో క చోట నుంచి పోటీ చేయకపోతే తన బిల్డప్‌లు పనిచేయవనుకున్నారేమో ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు సీటుకు ఎసరుపెట్టి ఉండి అసెంబ్లీ నుంచి పోటీలో నిలిచారు.
గెలుపు కోసం ఆపసోపాలు
గత ఎన్నికల ప్రచారంలో తప్ప స్వతహాగా రఘురామకృష్ణరాజు ప్రజల మధ్య తిరిగింది ఏమీలేదు. నియోజకవర్గానికి వచ్చినా సొంత సామాజికవర్గంలోని కొందరితో తప్ప మిగిలిన సామాజిక వర్గాల వారిని పట్టించుకున్నది లేదు. నిత్యం తన సొంత వ్య వహారాల్లో తలమునకలై ఉండే ఆయనకు, నియోజకవర్గంలోని వివిధ వర్గాల ప్రజలు, వారి కష్టాలు, మౌలిక పరమైన అవసరాల గురించి అవగాహన ఏ మేరకు ఉందనేది ప్రశ్నార్థకమే. ఇప్పుడు ఆయనకు అదే పెద్ద సమస్యగా తయారైందని స్థానికంగా చర్చ నడుస్తోంది. ఎల్లప్పుడూ స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి, నియోజకవర్గ అభివృద్ధికి అహరి్నశలు పాటుపడిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు, మరోపక్క రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కలిగి, ప్రస్తుతం టీడీపీ రెబల్‌గా బరిలో నిలిచిన వేటుకూరి వెంకట శివరామరాజు నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. మునుపెన్నడూ లేని విధంగా గత ఐదేళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం అధికారపక్ష అభ్యర్థి పీవీఎల్‌కు లాభించే అంశం కావడంతో పాటు ఇప్పటికే ఆయన ప్రచారంలో ముందంజలో ఉన్నారు.
దళితులు, క్రైస్తవులపై చిన్నచూపు
దళితులు, క్రైస్తవులు టీడీపీకి ఓట్లే వేయరన్న భావనలో రఘురామకృష్ణరాజు వారిని చిన్నచూపు చూస్తున్నారన్న ప్రచారం ఎక్కువగానే ఉంది. ఆయా ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారానికి ఆయన పెద్దగా ప్రాధాన్యమివ్వడం లేదంటున్నారు. ఎప్పు డూ ఢిల్లీ, హైదరాబాద్‌లో ఉంటూ నియోజకవర్గ ప్రజలకు ఆయన అందుబాటులో ఉండరని, సామాన్యులకు అపాయింట్‌మెంట్ దొరకడం కష్టమేనంటూ ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారం రఘురామను ఇరకాటంలో పడేస్తుందని స్థానికంగా చర్చించుకుంటున్నారు. తన ఎన్నికల ప్రచారానికి పెద్దగా స్పందన లేకపోవడం, రోజురోజుకూ విజయావకాశాలు సన్నగిల్లుతుండటంతో నిరాశకు లోనై చిన్నపాటి విషయాలకు కేడర్‌పై ఆయన చిర్రుబుర్రులాడుతున్నారని సమాచారం.
అసమ్మతి సెగలు
టీడీపీకి చెందిన కొందరు నేతలు పార్టీని వీడి రెబల్‌గా పోటీలో ఉన్న శివరామరాజు వెంట వెళ్లిపో గా మిగిలిన వారిలో అధిక శాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు వర్గమే. సీటు మార్చొద్దంటూ రామరాజుకు మద్దతుగా ఆందోళన చేసిన టీడీపీ నాయకులను బెట్టింగ్‌రాయుళ్లని రఘురామ అనుచిత వ్యాఖ్యలు చేయడం పార్టీలో అంతర్గతంగా అసమ్మతి జ్వాలలు రగిలిస్తూనే ఉంది. పైకి రామరాజుతో కలిసి చిరునవ్వులు చిందిస్తున్నా సిట్టింగ్ సీటును లాక్కోవడంపై ఆయన వర్గం ఎంత వరకు తనకు సహకరిస్తారనే అనుమానం రఘురామను వెంటాడుతోందంటున్నారు.
జనసేన కేడర్‌పైనే ఆయన నమ్మకం పెట్టుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కాపులను ఉద్దేశించి గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, కాపు యువకులపై కేసులు పెట్టి స్టేషన్‌లో పెట్టించిన సంఘటనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ‘మీరు కాపు కాసేవారు మీ పని మీరు చేసుకోండి.. నార తీసే వృత్తి వేరు, తాట తీసే వృత్తి వేరంటూ’ ఆయన చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన కేడర్ అన్నీ మర్చిపోయి ఆయనకు ఎంతవరకు కలిసివస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment