మన్మోహన్‌సింగ్ నిందితుడే!
‘బొగ్గు’ కేసులో మాజీ ప్రధానికి సమన్లు జారీ చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను ‘బొగ్గు’ భూతం వెంటాడుతోంది. యూపీఏ హయాం నాటి బొగ్గు క్షేత్రాల కేటాయింపు కుంభకోణం వల్ల 83 ఏళ్ల మన్మోహన్ కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ స్కామ్‌కు సంబంధించిన ఒక కేసులో మన్మోహన్‌ను నిందితుడిగా పేర్కొంటూ సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం ఆయనకు సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ 8న జరిగే విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఒడిశాలోని తలబిర-2 బొగ్గు క్షేత్రాన్ని కేటాయించడం ద్వారా కుమార మంగళం బిర్లాకు చెందిన హిందాల్కో కంపెనీకి భారీ స్థాయిలో అనుచిత లబ్ధి చేకూరేలా మన్మోహన్ వ్యవహరించారనడానికి ప్రాథమిక సాక్ష్యాధారాలున్నాయని కోర్టు స్పష్టం చేసింది.
ఈ మాజీ ప్రధానిపై భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ)లోని 120బీ(నేరపూరిత కుట్ర), 409(నేరపూరిత విశ్వాస ఘాతుకం) సెక్షన్లతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని పలు నిబంధనల కింద శిక్షకు అవకాశమున్న నేరారోపణలు నమోదు చేశారు. ఇవి రుజువైతే పదేళ్ల పాటు భారత ప్రధానిగా ఉన్న మన్మోహన్‌కు యావజ్జీవ శిక్ష కూడా పడే అవకాశముంది. ఒక క్రిమినల్ కేసులో కోర్టు సమన్లు అందుకున్న రెండో ప్రధానిగా మన్మోహన్ అప్రతిష్ట మూటగట్టుకున్నారు. అంతకుముందు, జేఎంఎం ఎంపీలకు ముడుపుల కేసు సహా మూడు వేర్వేరు కేసుల్లో మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కోర్టు సమన్లు అందుకున్నారు. సమన్లు జారీ కావడంపై ఆవేదన వ్యక్తం చేసిన మన్మోహన్.. విచారణకు పూర్తిగా సహకరిస్తానని, తన నిర్దోషిత్వం రుజువవుతుందన్న విశ్వాసముందని అన్నారు.
పరేఖ్, కేఎం బిర్లాలకు కూడా: 2005లో తలబిర-2ను హిందాల్కోకు అక్రమంగా కేటాయించడానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా సీబీఐ ప్రత్యేకకోర్టు న్యాయమూర్తి భరత్ పరాశర్ పై ఆదేశాలిచ్చారు. ఆ సమయంలో బొగ్గు శాఖ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్న మన్మోహన్‌తో పాటు హిందాల్కో, ఆ కంపెనీ యజమాని కుమారమంగళం బిర్లా, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్, ఆ కంపెనీలోని ఇద్దరు ఉన్నతాధికారులు శుభేందు అమితాబ్, డీ భట్టాచార్యలను కూడా కోర్టు నిందితులుగా పేర్కొంటూ సమన్లు జారీ చేసింది. వీరిపైనా ఐపీసీ 120బీ, 409, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ల కింద కేసులు పెట్టారు.
ఈ కేసును మూసేయాలన్న సీబీఐ..
మొదట, తన ఎఫ్‌ఐఆర్‌లో హిందాల్కో, పరేఖ్, కేఎం బిర్లా, మరి కొందరి పేర్లను చేర్చిన సీబీఐ.. అనంతరం పలు కారణాలు చూపుతూ ఈ కేసును మూసేయాలని క్లోజర్ రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పించింది. అయితే, ఆ అభ్యర్థనపై ఆగ్రహించిన కోర్టు ఈ కేసులో మన్మోహన్, అప్పటి పీఎంఓలోని ఉన్నతాధికారుల పాత్రపై కూడా దర్యాప్తు జరపాల్సిందిగా గత డిసెంబర్ 16న సీబీఐని ఆదేశించింది.
తప్పేం చేయలేదు: హిందాల్కో
కేఎం బిర్లా సహా తమ అధికారులెవరూ అక్రమంగా బొగ్గు క్షేత్రాన్ని పొందేందుకు ప్రయత్నించలేదని హిందాల్కో పేర్కొంది. సమన్లపై ఆశ్చర్యపోయానని పరేఖ్ అన్నారు. కోర్టు ఉత్తర్వులు న్యాయ ప్రక్రియలో భాగమేనని, మన్మోహన్ నిజాయితీ, నిష్పక్షపాతం, పారదర్శకతలతో కూడిన వ్యక్తిత్వాన్ని ఎవరూ ప్రశ్నించలేరని కాంగ్రెస్ పేర్కొంది. భూ సేకరణ బిల్లు నుంచి దృష్టిని మళ్లించేందుకు బీజేపీ చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించింది. కాంగ్రెస్ పాపాల మూల్యం మన్మోహన్ చెల్లిస్తున్నారని బీజేపీ పేర్కొంది.
కోర్టు ఏమంది..!
73 పేజీల ఉత్తర్వుల్లో కోర్టు ఏమందంటే..‘హిందాల్కో, కేఎం బిర్లా, శుభేందు అమితాబ్, భట్టాచార్యలు మొదట ప్రారంభించిన ఈ నేరపూరిత కుట్రలో తరువాత నాటి బొగ్గు శాఖ కార్యదర్శి పీసీ పరేఖ్, నాడు బొగ్గు శాఖను నిర్వహిస్తున్న నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ కూడా భాగస్వాములయ్యారనడానికి ప్రాథమిక సాక్ష్యాలున్నాయి. తలబిర 2ను హిందాల్కోకు కేటాయించేందుకు మన్మోహన్, పరేఖ్‌లు కలసికట్టుగా ప్రయత్నించారనడానికీ ఆధారాలున్నాయి.
తనకున్న రాజ కీయ, అధికార మార్గాలతో తలబిరను అక్రమంగా పొందేం దుకు బిర్లా ప్రయత్నించారనేందుకు సాక్ష్యాలున్నాయి. అందువల్ల నిందితులపై ఐపీసీలోని 120బీ, 409, అవినీతి నిరోధక చట్టం కింద నేరారోపణలకు అనుమతిస్తున్నాం. 2జీ స్కామ్ విచారణలో మన్మోహన్ పాత్రపై సుప్రీంకోర్టు అభిప్రాయాలను జాగ్రత్తగా పరిశీలించాం.
అయితే, ఈ కేసు విచారణలో వాటిని పరిగణనలోకి తీసుకోలేం.. తలబిరను హిందాల్కోకు కేటాయించేలా బొగ్గు శాఖకు పదేపదే లేఖలు రాస్తూ, ఫోన్లు చేస్తూ మన్మోహన్‌ఒత్తిడి తెచ్చారు. దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ‘అనవసర అదనపు ఆసక్తి’ చూపింది. ప్రభుత్వ రంగ సంస్థ నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్(ఎన్‌ఎల్‌సీ)కు తలబిర 2ను కేటాయించాలన్న స్క్రీనింగ్ కమిటీ సిఫారసుకు ఆమోదం తెలిపిన మన్మోహన్ ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని, నిబంధనలను ఉల్లంఘించి, కావాలనే హిందాల్కోను తెరపైకి తెచ్చారు. దీంతో ఎన్‌ఎల్‌సీ భారీగా నష్టపోయింది.
హిందాల్కో భారీ లాభాలార్జించింది. అప్పుడు బొగ్గు శాఖనూ ఆయనే నిర్వహిస్తున్నందున ప్రధానిగా ప్రతీదాన్నీ అధ్యయనం చేయలేను అనడానికి ఆయనకవకాశం లేదు. మన్మోహన్ ఇప్పుడు రాజ్యసభ ఎంపీ అయినా ఈ నేరం జరిగిన(2005) నాటికి ఆయన రాజ్యసభ సభ్యత్వం ముగియడంతో ఆయనపై విచారణకు ముందస్తు అనుమతి అక్కర్లేదు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ కేసులో ఆయన పాత్ర ఉందనడానికి అవకాశముందని నమ్ముతున్నాం. దీనివల్ల దేశ నైతిక స్థైర్యంపై పడే ప్రభావం గురించి పూర్తి అవగాహనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం.