
అధికారంలో ఉన్నప్పుడు కాపు జాతి గుర్తుకు రాలేదా?
ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
నెల్లూరు(బృందావనం): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై విమర్శలు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రులు దాసరి నారాయణరావు, చిరంజీవి, పళ్లంరాజు, రామచంద్రయ్యలకు అధికారంలో ఉన్నప్పుడువారి కాపుజాతి కోసం ఏం చేశారని ఎమ్మెల్సీ, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా పదవులు అనుభవించి, అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో కాపుల సంక్షేమం కోసం ఎన్నడూ మాట్లాడని నాయకులు నేడు కాపులపై ఒలకబోస్తున్న ప్రేమ చూస్తుంటే విడ్డూరంగా ఉందన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎందరో రాష్ట్రాన్ని పరిపాలించారని వారెవరూ కాపుల సంక్షేమం కోసం పాటుపడలేద న్నారు. అయితే కాపుల అభివృద్ధిని కాంక్షించి కమిషన్, కార్పొరేషన్ ఏర్పాటుచేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికే దక్కుతుందన్నారు.
బొగ్గు కుంభకోణంలో చిక్కుకున్న దాసరి నారాయణరావు, కేంద్ర మంత్రి పదవి కోసం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌కు తాకట్టుపెట్టిన చిరంజీవి, కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా వ్యవహరించిన పళ్లంరాజు, సి.రామచంద్రయ్య, బొత్ససత్యనారాయణ, కాపుల అభివృద్ధి కోసం అధికారంలో ఉన్న నాడు ఏమి చేశారని సోమిరెడ్డి ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం ముద్రగడ పద్మనాభం దీక్షను పావుగా వాడుకుంటూ ఆ నాయకులు కాపులపై కపట ప్రేమను చాటుతున్నారని ఆరోపించారు. తుని ఘటనలో 24 రైలు బోగీలను దహనం చేసిన వారిపై కేసులు పెడితే, వారిని విడిపించాలంటూ ముద్రగడ పద్మనాభం దీక్ష చేయడం సరికాదన్నారు.