న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో అధికారుల పాత్రపై విచారణ అంశం సీబీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య ఘర్షణకు దారి తీస్తోంది. కోర్టు స్వయంగా పర్యవేక్షిస్తున్న ఈ కేసులో అధికారులను విచారించేందుకు ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోనక్కర్లేదని సీబీఐ వాదిస్తుండగా.. అనుమతి తీసుకోవాల్సిందేనని సర్కారు పట్టుబడుతోంది. సీబీఐ తన వాదనకే కట్టుబడుతూ మంగళవారం సుప్రీంకోర్టుకు ఆరు పేజీల అఫిడవిట్‌ను సమర్పించింది. ఇందులో సుప్రీంకోర్టు గతంలో వెలువరించిన తీర్పులను ఉటంకించింది. కోర్టు పర్యవేక్షణలో ఉన్న లేదా కోర్టు ఆదేశాలతో జరుగుతున్న విచారణలో అధికారులను ప్రశ్నించేందుకు ప్రభుత్వ అనుమతి అక్కర్లేదని 2జీ కేసులో అత్యున్నత న్యాయస్థానం స్పష్టంచేసిన సంగతిని గుర్తుచేసింది.
అలాగే ఇతర కేసుల్లో కూడా అధికారుల విచారణకు అనుమతి ఇవ్వడంలో ప్రభుత్వానికి కోర్టు నిర్దేశిత గడువును విధించినట్లు వివరించింది. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టంలోని సెక్షన్ 6ఏ, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19కు కోర్టు భాష్యం చెబుతూ.. అధికారుల విచారణకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి కాదని పలుమార్లు పేర్కొన్నట్లు తన అఫిడవిట్‌లో సీబీఐ తెలిపింది. కోర్టు పర్యవేక్షిస్తున్న కేసులో కూడా అధికారులను విచారించాలంటే ముందుగా తమ అనుమతి తీసుకోవాల్సిందేనని ప్రభుత్వం ఇంతకుముందు న్యాయస్థానానికి స్పష్టంచేసింది. ఈ వాదనతో సీబీఐ పూర్తిగా విభేదించింది. అలా చేస్తే కోర్టులకు ఉన్న అధికారాన్ని హరించడమే అవుతుందని అఫిడవిట్‌లో వాదించింది.
బొగ్గు స్కాంలో సీబీఐ, కేంద్రం ఢీ
Published Wed, Aug 28 2013 3:32 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement