సంపాదకీయం: మొదలైన నాటి నుంచి రకరకాల మలుపులు తిరుగుతున్న బొగ్గు కుంభకోణంలో ఇప్పుడు మరో అంకానికి తెరలేచింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆదిత్య బిర్లా గ్రూపు అధినేత కుమార మంగళం బిర్లా, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్ తదితరులు అవినీతికీ, నేరపూరిత కుట్రకూ పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. ఆ మేరకు ఎఫ్‌ఐఆర్ దాఖలుచేయడంతోపాటు దేశవ్యాప్తంగా నాలుగు నగరాల్లోని ఆరుచోట్ల సోదాలు చేసింది. తమిళనాడుకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్‌కు కేటాయించాల్సిన ఒడిశాలోని తలబిరా బొగ్గు గనుల్ని బిర్లా గ్రూపునకు చెందిన హిండాల్కోకు కూడా పంచారని ఇందువల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టంవాటిల్లిందన్నది సీబీఐ ఆరోపణ. కుమార మంగళం బిర్లా దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్త గనుక ఈ చర్యపై పారిశ్రామికవర్గాల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది.
ఇది పరిశ్రమల విశ్వాసాన్ని, పెట్టుబడుల వాతావరణాన్ని దెబ్బతీస్తుందని ఆ వర్గాలు ప్రకటించాయి. చిత్రమేమంటే, వీరితో ఇద్దరు కేంద్రమంత్రులు...వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి సచిన్ పైలట్‌లు గొంతు కలిపారు. ‘గట్టి సాక్ష్యాధారాలు’ ఉంటే తప్ప ఈ తరహా చర్యలకు దిగకూడదని హితవు చెప్పారు. ఈ స్కాంలో ఇప్పటికే సీబీఐ 14 ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేసింది. కాంగ్రెస్‌కు చెందిన ఎంపీని, మరో కేంద్ర మాజీ మంత్రిని కూడా నిందితులుగా చేర్చింది. దేశంలో చట్టమనేది అందరికీ సమానంగా వర్తిస్తుంది. వర్తించాలి. అందులో రెండోమాట లేదు. ఒకరు ప్రముఖ పారిశ్రామికవేత్తగనుక వారి జోలికి వెళ్లరాదని, మరొకరు కాకలు తీరిన రాజకీయ యోధుడు గనుక వారిని అసలు తాకరాదని ఎవరూ అనరు. అలాంటి విచక్షణో, పక్షపాతమో నిజానికి సీబీఐకే ఉంది. అనేక కేసుల్లో ఆ సంగతి నిరూపణ అవుతూనే ఉంది.
బొగ్గు కుంభకోణం సామాన్యమైంది కాదు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 194 బొగ్గు క్షేత్రాలను వేలం విధానంలో కాక, నచ్చినవారికి కట్టబెట్టారన్నది ప్రధానమైన ఆరోపణ. ఇలా చేసినందువల్ల దేశ ఖజానాకు లక్షా 86వేల కోట్ల రూపాయల నష్టంవాటిల్లిందని కాగ్ సంస్థ ఆరోపించింది. ఆరోపణలొచ్చాయి గనుక తనంత తానే స్వచ్ఛందంగా సీబీఐ దర్యాప్తునకు సిద్ధపడదామని కేంద్ర ప్రభుత్వం అనుకోలేదు. ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చొరవ తీసుకుని సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాల్సివచ్చింది. అటు తర్వాతనైనా ఆ దర్యాప్తునకు అవసరమైన సహాయసహకారాలను అందించివుంటే కేంద్రం నిజాయితీ వెల్లడయ్యేది.
అలా చేయలేదు సరిగదా...దానికి అవసరమైన ఫైళ్లను అందుబాటులో ఉంచడంలో కూడా విఫలమైంది. సుప్రీంకోర్టు ఈ ఫైళ్ల గల్లంతు వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తంచేసి రెండువారాల్లో వాటిని పట్టి తేవాలని గత నెలలో ఆదేశించింది. అయినా, ఇప్పటికీ దాదాపు 18 ఫైళ్లు ఏమయ్యాయో తెలియడంలేదు. ఈ ప్రహసనానికి ముందు సుప్రీంకోర్టుకు సీబీఐ అంద జేయాల్సిన నివేదికను అప్పటి కేంద్ర న్యాయ శాఖ మంత్రి తెప్పించుకుని, దానికి సవరణలు చేయడం... ఆ ఉదంతంపై సుప్రీంకోర్టు ఆగ్రహించడం ఇవన్నీ అయ్యాయి. సరిగ్గా ఆ సమయంలోనే సీబీఐ ‘పంజరంలో చిలుక’ మాదిరిగా వ్యవహరిస్తున్నదని సుప్రీంకోర్టు పరుషంగా వ్యాఖ్యానించింది.
ఇన్ని జరిగాక ఇప్పుడు కుమార మంగళం బిర్లా, పీసీ పరేఖ్‌లపై కేసులు నమోదుచేయడంపై సహజంగానే అనుమానాలు తలెత్తుతాయి. నిజానికి తలబిరా బొగ్గు క్షేత్రాలు కావాలని అభ్యర్థన చేసింది హిండాల్కో సంస్థ కాదు. ఆ సంస్థకు మాతృక అయిన ఇండాల్ సంస్థ. ఆ సంస్థ 1996లో అలాంటి విజ్ఞప్తిచేసింది. అటు తర్వాత కాలంలో ఇండాల్‌ను బిర్లాలు కొనుగోలుచేయగా, 1996నాటి అభ్యర్థనపై 2005లో కేంద్రం నిర్ణయం తీసుకుని తలబిరా గనుల్ని కేటాయించింది. దర్యాప్తు ప్రారంభించి ఏడాదిన్నర అవుతుండగా, ఇన్నాళ్ల వరకూ బిర్లా జోలికి ఎందుకు వెళ్లలేదు? తొలుత అభ్యర్థన చేసిన ఇండాల్ సంస్థ నిర్వాహకుల్ని ఏమైనా ప్రశ్నించారా? అన్నవి సమాధానంలేని ప్రశ్నలు. అసలు ఈ కుంభకోణంలో సీబీఐ దర్యాప్తే లోపభూయిష్టంగా ఉంది. ప్రధాని మన్మోహన్‌సింగ్ బొగ్గు శాఖను పర్యవేక్షిస్తున్నప్పుడు ఈ కుంభకోణం ప్రారంభమైంది గనుక దర్యాప్తు ప్రధాని కార్యాలయం నుంచి మొదలుకావాలి. అటు తర్వాత వరసగా ఏ దశలో ఏం జరిగిందనేది క్రమేపీ బయటికొస్తుంది. కేటాయింపుల క్రమంలో లబ్ధిదారు లెవరైనా అధికారులతోగానీ, అధినేతలతోగానీ కుమ్మక్కయ్యారా అనేది స్పష్టం అవుతుంది. దర్యాప్తు క్రమం అలా ఉంటే ఎవరూ సీబీఐని వేలెత్తి చూపే అవకాశం ఉండదు. బొగ్గు క్షేత్రం పొందిన బిర్లా కుట్రదారు అయినప్పుడు, ఆయనకు అలా కేటాయించవచ్చని చెప్పిన తాను కుట్రదారు అయినప్పుడు, తుది నిర్ణయం తీసుకున్న ప్రధాని ఎందుకు కారని పరేఖ్ చేస్తున్న తర్కంలో హేతుబద్ధత ఉన్నది. చేసే పనిలో చిత్తశుద్ధి కొరవడితే, నిష్పాక్షికత ఆవిరైతే...దర్యాప్తు తలకిందులుగా సాగితే ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతాయి.
ఆ ప్రశ్నలకు సీబీఐ వద్ద జవాబు లుండవు. ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సహా అందరినీ నిందితులుగా చేరిస్తే తాను నిష్పాక్షికంగా ఉన్నట్టు చాటుకోవచ్చని సీబీఐ భావించినట్టుంది. ఇవన్నీ వదిలిపెట్టి స్వయంగా ప్రధానే జరిగిందేమిటో చెబితే, బొగ్గు క్షేత్రాల కేటాయింపు ఎలా సబబో చెబితే ఇంతమందిని నిందితులుగా చేయాల్సిన పనే ఉండదు. కానీ, ఆయన మాట్లాడరు. సీబీఐ సక్రమంగా దర్యాప్తు చేయదు. కేంద్ర మంత్రులు మాత్రం ప్రముఖ పారిశ్రామికవేత్తలను నిందితులుగా చేర్చడం అభ్యంతరకర మంటారు. ఇంతకూ ఇలాంటి కప్పదాటు వైఖరులతో, అయోమయ చర్యలతో కేంద్ర ప్రభుత్వంగానీ, సీబీఐగానీ ఏం సాధించదల్చుకున్నాయి? తమ చర్యలతో తాము నగుబాటుపాలవడమే కాదు... దేశ ప్రతిష్ట కూడా దెబ్బతింటున్నదని ఎప్పటికి గ్రహిస్తారు?
ఇదేనా దర్యాప్తు తీరు?!
Published Thu, Oct 17 2013 2:24 AM | Last Updated on Fri, Sep 1 2017 11:41 PM
Advertisement