ముంబై: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఎంతో ప్రత్యేకమైన స్థానంలో ఉందన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా. భారత్ ఎదుగుదలను ప్రపంచం కోరుకుంటున్నట్టు చెప్పారు. నూతన సంవత్సరం సందర్భంగా కుమార మంగళం బిర్లా తన సందేశాన్ని ఇచ్చారు. ‘‘భారత్ ఆర్థిక సౌభాగ్యం ప్రపంచానికి ఎంతో కీలకమైనది. భారత్ వృద్ధిని ప్రపంచం స్వాగతిస్తుండడం ఆశ్చర్యకరం. ఎందుకంటే భారత్ వృద్ధి స్థిరంగా ఉండడమే కాదు, ఇతరులకు విఘాతం కలిగించనిది.
వచ్చే రెండున్నర దశాబ్దాలు భారత్‌కు అమృత కాలం అనడంలో ఎలాంటి సందేహం లేదు’’అని కుమార మంగళం బిర్లా పేర్కొన్నారు. ఐదు ధోరణులు ప్రపంచంపై ఎన్నో ఏళ్లపాటు ప్రభావం చూపిస్తాయన్నారు. చైనా ప్లస్ 1 వ్యూహాత్మక విధానంలో భాగంగా అంతర్జాతీయ కంపెనీలకు భారత్ స్పష్టమైన ఎంపికగా పేర్కొన్నారు. దశాబ్దాలుగా ఏర్పడిన సరఫరా వ్యవస్థ రూపు రేఖలు మారుతున్నట్టు చెప్పారు. దీనికి కొంత సమయం పడుతుందన్నారు.
ప్రపంచం ఎంతో వేగంగా గ్రీన్ ఎనర్జీవైపు అడుగులు వేస్తుండడాన్ని రెండో అంశంగా పేర్కొన్నారు. ఈ విధమైన ఇంధన మార్పు దిశగా భారత్ ధైర్యంగా అడుగులు వేసినట్టు చెప్పారు. నూతన వ్యాపారాల నిర్మాణంలో భారత్ వినూత్నంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. ఇందులో సమతుల్యత అవసరమన్నారు. వ్యాపారాలు తమ ప్రాథమిక బలాలపై దృష్టి పెట్టాలన్నారు. ‘‘నేడు వ్యాపారాలు ఎదుర్కొంటున్న వినూత్నమైన సవాలు.. ఎంతో కాలంగా ఏర్పాటు చేసుకున్న విశ్వాసం, స్థిరత్వాన్ని కొనసాగిస్తూనే మనల్ని మనం తిరిగి ఆవిష్కరించుకోవాల్సి ఉంది’’అని బిర్లా పేర్కొన్నారు.
షార్ట్‌కట్‌లు ఉండవు..
వ్యాపారాల నిర్మాణానికి ఎలాంటి దగ్గరి దారులు లేవంటూ, కొత్తగా స్టార్టప్‌లు ఏర్పాటు చేసే వారిని బిర్లా పరోక్షంగా హెచ్చరించారు. మూడు దశాబ్దాల క్రితం నాటి ‘టాప్ గన్’ సినిమా సీక్వెల్‌ను 2022లో తీసుకురాగా బిలియన్ డాలర్లను ఒక నెలలోనే వసూలు చేసిన విషయాన్ని బిర్లా గుర్తు చేశారు. పునఃఆవిష్కరణలు, భవిష్యత్తు నిర్మాణానికి సంబంధించిన ప్రాధాన్యతలను ఈ సినిమా తెలియజేసిందన్నారు. నిధుల లభ్యత, యువ నైపుణ్యాల మద్దతుతో కొత్తగా పుట్టుకొస్తున్న స్టార్టప్‌లను ఆయన స్వాగతిస్తూనే కీలక సూచనలు చేశారు.
‘‘స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో చక్కటి బృందాలను నిర్మించాలి. ప్రతిభావంతులను తీసుకునేందుకు భయపడకూడదు. నినాదాల కంటే విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలి. నిర్వహణ లాభాలు, స్థూల మార్జిన్లు, నగదు ప్రవాహాలను దృష్టిలో పెట్టుకోవాలి‘‘అని బిర్లా సూచించారు. వృద్ధి కోసం ఇతర అంశాల విషయంలో రాజీపడిన ఇటీవలి కొన్ని కంపెనీలను ఉదాహరణగా పేర్కొన్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీలు గ్రీన్ ఎనర్జీపై పెట్టుబడులు పెడుతున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment