Global economy development
-
భారత్ అభివృద్ధిని ప్రపంచం కోరుకుంటోంది
ముంబై: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఎంతో ప్రత్యేకమైన స్థానంలో ఉందన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా. భారత్ ఎదుగుదలను ప్రపంచం కోరుకుంటున్నట్టు చెప్పారు. నూతన సంవత్సరం సందర్భంగా కుమార మంగళం బిర్లా తన సందేశాన్ని ఇచ్చారు. ‘‘భారత్ ఆర్థిక సౌభాగ్యం ప్రపంచానికి ఎంతో కీలకమైనది. భారత్ వృద్ధిని ప్రపంచం స్వాగతిస్తుండడం ఆశ్చర్యకరం. ఎందుకంటే భారత్ వృద్ధి స్థిరంగా ఉండడమే కాదు, ఇతరులకు విఘాతం కలిగించనిది. వచ్చే రెండున్నర దశాబ్దాలు భారత్‌కు అమృత కాలం అనడంలో ఎలాంటి సందేహం లేదు’’అని కుమార మంగళం బిర్లా పేర్కొన్నారు. ఐదు ధోరణులు ప్రపంచంపై ఎన్నో ఏళ్లపాటు ప్రభావం చూపిస్తాయన్నారు. చైనా ప్లస్ 1 వ్యూహాత్మక విధానంలో భాగంగా అంతర్జాతీయ కంపెనీలకు భారత్ స్పష్టమైన ఎంపికగా పేర్కొన్నారు. దశాబ్దాలుగా ఏర్పడిన సరఫరా వ్యవస్థ రూపు రేఖలు మారుతున్నట్టు చెప్పారు. దీనికి కొంత సమయం పడుతుందన్నారు. ప్రపంచం ఎంతో వేగంగా గ్రీన్ ఎనర్జీవైపు అడుగులు వేస్తుండడాన్ని రెండో అంశంగా పేర్కొన్నారు. ఈ విధమైన ఇంధన మార్పు దిశగా భారత్ ధైర్యంగా అడుగులు వేసినట్టు చెప్పారు. నూతన వ్యాపారాల నిర్మాణంలో భారత్ వినూత్నంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. ఇందులో సమతుల్యత అవసరమన్నారు. వ్యాపారాలు తమ ప్రాథమిక బలాలపై దృష్టి పెట్టాలన్నారు. ‘‘నేడు వ్యాపారాలు ఎదుర్కొంటున్న వినూత్నమైన సవాలు.. ఎంతో కాలంగా ఏర్పాటు చేసుకున్న విశ్వాసం, స్థిరత్వాన్ని కొనసాగిస్తూనే మనల్ని మనం తిరిగి ఆవిష్కరించుకోవాల్సి ఉంది’’అని బిర్లా పేర్కొన్నారు. షార్ట్కట్లు ఉండవు.. వ్యాపారాల నిర్మాణానికి ఎలాంటి దగ్గరి దారులు లేవంటూ, కొత్తగా స్టార్టప్‌లు ఏర్పాటు చేసే వారిని బిర్లా పరోక్షంగా హెచ్చరించారు. మూడు దశాబ్దాల క్రితం నాటి ‘టాప్ గన్’ సినిమా సీక్వెల్‌ను 2022లో తీసుకురాగా బిలియన్ డాలర్లను ఒక నెలలోనే వసూలు చేసిన విషయాన్ని బిర్లా గుర్తు చేశారు. పునఃఆవిష్కరణలు, భవిష్యత్తు నిర్మాణానికి సంబంధించిన ప్రాధాన్యతలను ఈ సినిమా తెలియజేసిందన్నారు. నిధుల లభ్యత, యువ నైపుణ్యాల మద్దతుతో కొత్తగా పుట్టుకొస్తున్న స్టార్టప్‌లను ఆయన స్వాగతిస్తూనే కీలక సూచనలు చేశారు. ‘‘స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో చక్కటి బృందాలను నిర్మించాలి. ప్రతిభావంతులను తీసుకునేందుకు భయపడకూడదు. నినాదాల కంటే విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలి. నిర్వహణ లాభాలు, స్థూల మార్జిన్లు, నగదు ప్రవాహాలను దృష్టిలో పెట్టుకోవాలి‘‘అని బిర్లా సూచించారు. వృద్ధి కోసం ఇతర అంశాల విషయంలో రాజీపడిన ఇటీవలి కొన్ని కంపెనీలను ఉదాహరణగా పేర్కొన్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీలు గ్రీన్ ఎనర్జీపై పెట్టుబడులు పెడుతున్నట్టు చెప్పారు. -
భయపెడుతున్న జోస్యం
అవును.. ఇది ప్రపంచాన్ని భయపెడుతున్న జోస్యం. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు సహా అనేక కారణాల వల్ల వచ్చే 2023లో ప్రపంచ ఆర్థికవ్యవస్థ వృద్ధి మునుపు ఆశించినంత ఉండదట. అంతర్జా తీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) జూలైలో వేసిన అంచనా కన్నా 0.2 శాతం తగ్గి, 2.7 శాతమే వృద్ధి సాధిస్తుందట. 2001 నుంచి ఎన్నడూ లేనంతటి అత్యంత బలహీనమైన వృద్ధి ఇది. అదీ కాక, వచ్చే ఏడాది ఆర్థికమాంద్యం లాంటి గడ్డు పరిస్థితి ప్రపంచంలో అత్యధిక జనాభాకు తప్పదని ఐఎంఎఫ్ హెచ్చరించింది. జూలై నాటి అంచనాలను సవరించి, తాజాగా ‘వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్’ను ప్రకటించింది. మంగళవారం ప్రకటించిన ఈ అంచనాలు, ముందున్నది ముసళ్ళ పండగ అనే హెచ్చరికలు సహజంగానే నిరాశాజనకం. అదే సమయంలో ఆర్థిక రథసారథులకు మేలుకొలుపు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడోవంతు ఈ ఏడాది, లేదంటే వచ్చే ఏడాది కుంచించుకు పోతుందట. ప్రపంచంలోని మూడు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, యూరోపియన్ యూనియన్, చైనాలు స్తంభిస్తాయట. ఉక్రెయిన్ యుద్ధంతో జర్మనీ, ఇటలీ లాంటి ఆధునిక ఆర్థిక వ్యవస్థలు సైతం మాంద్యంలో కూరుకుపోనున్నాయట. ఐరోపాలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ జర్మనీ పూర్తిగా రష్యా నుంచి వచ్చే ఇంధనం మీదే ఆధారపడడం ఇబ్బంది తెచ్చింది. పాశ్చాత్య దేశాల ఆంక్షలకు ప్రతిగా ఐరోపాకు చమురు సరఫరాలో రష్యా కోత జర్మనీకి తలనొప్పి అయింది. ఫలితంగా, ఐఎంఎఫ్ తాజా అంచనాల ప్రకారం వచ్చే 2023లో జర్మనీ ఆర్థిక వ్యవస్థ 0.3 శాతం మేర కుంచించుకుపోనుంది. చమురు దిగుమతులపై ఆధారపడ్డ ఇటలీ స్థూల జాతీయోత్పత్తి 0.2 శాతం మేర తగ్గనుంది. మొత్తానికి, ఈ ఏడాది ప్రపంచ ద్రవ్యోల్బణం 8.8 శాతం గరిష్ఠానికి చేరుతుందని ఐఎంఎఫ్ అంచనా. వచ్చే 2024కు అది 4.1 శాతానికి తగ్గవచ్చట. మిగిలిన ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే, భారత్ పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా చిక్కులూ చాలా ఉన్నాయి. భారత ఆర్థిక వృద్ధి 2022 –23లో తగ్గుతుందంటూ గత వారం రోజుల్లో అటు ప్రపంచ బ్యాంక్, ఇటు ఐఎంఎఫ్ – రెండూ అంచనా వేశాయి. ఉక్రెయిన్ యుద్ధం, తత్ఫలితంగా ఇంధన సరఫరా ఇక్కట్లు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ దోవలో వివిధ కేంద్ర బ్యాంకులు ద్రవ్య వినియోగాన్ని కట్టుదిట్టం చేయడం లాంటివన్నీ ఇందుకు కారణాలే. గత ఆర్థిక సంవత్సరం 8.7 శాతం ఉన్న భారత వృద్ధి ఈసారి 6.8 శాతమే ఉండవచ్చని ఐఎంఎఫ్ తాజా మాట. ఏప్రిల్ నాటి అంచనా కన్నా ఇది 1.4 శాతం తక్కువ. ఇక, ప్రపంచ బ్యాంకు అయితే తన తాజా ‘దక్షిణాసియా ఆర్థిక అప్డేట్’ (ఎస్‌ఏఈయూ)లో మన దేశ వృద్ధిరేటు 1 శాతం మేర తగ్గి, 6.5 శాతం దాకా ఉండవచ్చంటోంది. భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఒక్కటీ మాత్రం మిగిలినవాటికి భిన్నంగా, కాస్తంత మెరుగ్గా ఏడాది మొత్తం మీద 7 శాతం వృద్ధి ఉంటుందని అంచనా కట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం తాజాగా వాషింగ్టన్లో మాట్లాడుతూ ఈ ఏడాది మన వృద్ధి 7 శాతం ఉంటుందని బింకంగా చెప్పారు. కానీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రభావానికి మనం అతీతులం కామని ఒప్పుకున్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పేరు తెచ్చుకున్న భారత్ ఈ ఏడాది ఆ కిరీటాన్ని సౌదీ అరేబియాకు కోల్పోయే సూచనలున్నాయి. వచ్చే ఏడాది మళ్ళీ ఆ ఘనత సాధిస్తామని భావిస్తున్నా, ఆశ పెట్టుకోలేం. ప్రపంచ పరిణామాలు, పర్యవసానాలు భారత్ పైనా ప్రభావం చూపుతాయి. అలా వృద్ధి 5.2 శాతానికి జారిపోతుందనే అనుమానం ఉంది. మిగిలిన వారితో పోలిస్తే పైకి బాగున్నట్టు కనిపిస్తున్నా, 2020లో తగిలిన దెబ్బతో దేశంలో అత్యధికంగా 5.6 కోట్ల మంది నిరుద్యోగులయ్యారు. దారిద్య్రరేఖ దిగువకు పడిపోయారు. ప్రమాదాలూ పొంచి వున్నాయి. ఇప్పుడు పెరిగే ముడిచమురు, ఎరువుల ధరలతో దేశీయ ద్రవ్యోల్బణం హెచ్చు తుంది. ప్రపంచ మందగమనం ఎగుమతుల్ని దెబ్బతీసి, వృద్ధిని నీరసింపజేసి, వాణిజ్యలోటును పెంచు తుంది. డాలర్ దెబ్బతో రూపాయి మారకం రేటుపై ఒత్తిడి పెరిగి, విదేశీమారక నిల్వలు తగ్గుతాయి. ఇప్పుడున్న నిరాశావహ ప్రపంచ వాతావరణంలోనూ పరిస్థితులు మెరుగవ్వాలంటే ఎప్పటి లానే విధాన నిర్ణేతలు చేయాల్సినవి చాలా ఉన్నాయి. ముందుగా ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తేవాలి. అందుకు తగ్గ ఆర్థిక విధానాన్ని అనుసరిస్తూ, ద్రవ్య వినియోగంపై పట్టు బిగించి జీవన వ్యయాన్ని అదుపు చేయాలి. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి పగ్గాలు వేశామనీ, అదేమంత ఆందోళన చెందాల్సిన విషయం కాదనీ పాలకులు అంటున్నారు. కానీ, వాస్తవంలో జూలైలో కాస్తంత తెరిపి నిచ్చినా, ఆగస్ట్, సెప్టెంబర్లలో ధరలు పెరుగుతూనే పోయాయి. ద్రవ్యోల్బణం 7 శాతానికి పైనే ఉంటూ వచ్చింది. దేశంలో తలసరి ఆదాయం తక్కువ గనక, ధరలు ఆకాశాన్ని అంటుతుంటే ఇంటి ఖర్చులు చుక్కలు చూపిస్తాయి. అలాగే, ఆహార ధరలు రెక్కలు విప్పుకొన్న కొద్దీ ఆర్బీఐకి సవాలు పెరుగుతుంది. అందుకే, ఆహార ద్రవ్యోల్బణానికి కళ్ళెం వేయాలి. కేంద్రం, రాష్ట్రాలు తెలివైన ఆర్థిక చర్యలు చేపట్టాలి. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో ప్రైవేట్ రంగం పెట్టుబడులు పెట్టేందుకు సందేహిస్తుంది గనక, ప్రభుత్వాలు మూలధన వ్యయంలో కోతలు విధించకుండా ముందుకు సాగాలి. అది ఆర్థిక వృద్ధికి కారణమవుతుంది. ఏప్రిల్ – ఆగస్టు మధ్య భారత సర్కార్ 47 శాతం మేర మూలధన వ్యయాన్ని పెంచి, దోవ చూపడం ఆనందించాల్సిన విషయమే. కానీ, దేశ వృద్ధిగమనం నిదానిస్తున్న వేళ కళ్ళు తెరిచి, సత్వర కార్యాచరణకు దిగాలి. అదే మన తక్షణ కర్తవ్యం! -
రక్షణాత్మక విధానాలతో ప్రపంచ ఎకానమీకి నష్టం!
వాణిజ్యం విషయంలో దేశాలు అనుసరించే రక్షణాత్మక విధానాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎన్నటికీ మంచిది కాదని, దీనివల్ల సానుకూల ఫలితాలు ఎప్పుడూ కనబడలేదని ఐక్యరాజ్యసమితి ఆసియా పసిఫిక్ వ్యవహారాల ఎకనమిక్‌అండ్ సోషల్ కమిషన్ (ఈఎస్సీఏపీ)– ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) సంయుక్త నివేదిక ఒకటి తెలిపింది. స్వేచ్ఛా వాణిజ్య విధానాలతోనే ప్రపంచ ఆర్థిక అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేసింది. టారిఫ్ యేతర అవరోధాలుసహా వాణిజ్య ఆంక్షల విధింపు యోచనలకు, నిర్ణయాలకు దూరంగా ఉండాలని ఆసియా దేశాలకు నివేదిక విజ్ఞప్తి చేసింది. ‘ఆసియా– పసిఫిక్ ట్రేడ్ ఫెసిలిటేషన్ రిపోర్ట్ 2021’ శీర్షికన ఆవిష్కరించిన నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే... ♦కోవిడ్–19 సవాళ్ల నేపథ్యంలో సరఫరాల వ్యవస్థకు అంతర్జాతీయంగా తీవ్ర విఘాతం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆసియా దేశాలు తమ వ్యాపార లావాదేవీల వేగవంతం విషయంలో డిజిటల్, పేపర్‌లెస్ ట్రేడ్ విధానాలను అనుసరిస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయి. దీనివల్ల వాణిజ్య వ్యయాలు సగటున 13శాతానికిపైగా తగ్గే అవకాశం ఉంది. ♦ ఎగుమతి ఆంక్షలు, టారిఫ్ యేతర చర్యలను దేశాలు మానుకోవాలి. కోవిడ్–19 పర్యవసానాల నేపథ్యంలో తీసుకువచ్చిన వాణిజ్య ఆంక్షల విషయంలో మరింత పారదర్శకత ఉండాలి. సమీక్షలు, పరస్పర అవగాహనల ద్వారా ఆంక్షల సడలింపు, స్వేచ్ఛాయుత వాణిజ్య వాతావరణంలోకి అడుగులు వేయాలి. ♦ స్థిరమైన వాణిజ్య సదుపాయాలలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, భారత్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా లు అత్యుత్తమ పనితీరు కనబరిచాయి, ఆస్ట్రేలి యా, న్యూజిలాండ్ డిజిటల్ ట్రేడ్ ఫెసిలిటేషన్లో అత్యుత్తమ పనితీరును చూపుతున్నాయి. ఈ రెండు అంశాలల్లోనూ సింగపూర్ 90 శాతాని కి పైగా మంచి ఫలితాలను నమోదుచేసుకుంది. ♦ గతంలో వచ్చిన మహమ్మారుల విస్తరణ దేశాల మధ్య నెమ్మదిగా ఉంది. దాదాపు స్థానికంగా> కూడా ఇవి ఉండిపోయాయి. దీనివల్ల నష్టం కొంతమేరే పరిమితమయిన పరిస్థితి ఉంది. అయితే తాజా కోవిడ్–19 మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరించింది. ఆర్థికంగా దేశాలను దెబ్బతీసింది. ప్రపంచవ్యాప్తంగా దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాలు చూపే పరిస్థితిని సృష్టించింది. ♦ వైరెస్‌ను కట్టడి చేయడానికి పలు దేశాలు సరిహద్దులు మూసివేత, లాక్డౌన్లు, క్వారంటైన్ల వంటి పలు చర్యలను తీసుకున్నాయి. ఇది డిమాండ్‌ను, సరఫరాల వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్యం దెబ్బతింది. క్షీణతలోకి జారుకుంది. ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. ♦వ్యాక్సినేషన్ ఉత్పత్తిలో ఉన్న పలు దేశాలు స్థానిక అవసరాలు, డిమాండ్‌కు ప్రాధాన్యత ఇచ్చాయి. ఎగుమతుల విషయంలో పలు ఆంక్షలను విధించాయి. దీనితో వ్యాక్సినేషన్ సరఫరాల్లో తీవ్ర ఆటంకం ఏర్పడింది. భారత్‌కు సవాళ్లు.. దక్షిణ ఆసియాలో భారత్ పోర్టు రద్దీ నుంచి విడి భాగాల కొరత వరకూ పలు ఆటోమోటివ్ ఉత్పత్తి ఆటంకాలను ఎదుర్కొందని నివేదిక తెలిపింది. అదేవిధంగా ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సామర్థ్యం, టెలికాం ఉత్పత్తులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి హార్డ్‌వేర్, కన్సూ్యమర్ ఎలక్ట్రానిక్స్, మెడికల్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ వంటివి పలు విభాగాలు ముడి పదార్థాల కొరతసహా పలు సమస్యలను దేశం ఎదుర్కొన్నట్లు పేర్కొంది. -
ఎక్కువ భాగం ఇంటికే..
సంపాదనకు విదేశాలకు వెళ్లినా కుటుంబ బాధ్యతల్లో ముందే ఉంటున్న మహిళలు దుబాయ్: మహిళలు అన్నిరంగాల్లో పురుషులతో పోటాపోటీగా దూసుకుపోతున్నా కుటుంబ బాధ్యతలను ఏమాత్రం విస్మరించడం లేదు. కొత్త అవకాశాల కోసం దేశ సరిహద్దులను దాటి ప్రయాణించినా ఇంటి అవసరాలను తీర్చడంలో ప్రధానపాత్ర పోషిస్తున్నారు. ఏ దేశంలో పనిచేస్తున్నా తమ సంపాదనలో ఎక్కువ భాగాన్ని రెమిటెన్స్‌ల రూపంలో ఇంటికి పంపుతున్నారు. పురుషుల కంటే ఎక్కువగానే వారు పంపుతున్న విషయం ఇటీవల ఓ అధ్యయనంలో వెల్లడైంది. డబ్బును బదిలీ చేసే సర్వీస్ ప్రొవైడర్లలో ప్రధానమైన వెస్ట్రన్ యూనియన్ సంస్థ అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ‘ఇతర దేశాలకు వలస వెళ్లిన మహిళలు-ఆర్థిక ప్రభావం’ అనే అంశంపై అధ్యయనాన్ని నిర్వహించింది. ఇందులోని ప్రధానాంశాలు వెస్ట్రన్ యూనియన్ మధ్యప్రాచ్య, ఆఫ్రికా, ఆసియా పసిఫిక్, ఈస్ట్రన్ యూరప్ ప్రెసిడెంట్ జీన్ క్లాడ్ ఫరా మాటల్లో... * ప్రపంచవ్యాప్తంగా డబ్బును బదిలీ చేయడంలో మహిళల సంఖ్య పెరుగుతోంది. వీరు గ్లోబల్ ఎకనమీ అభివృద్ధిలో పాలుపంచుకుంటూనే కుటుంబ ఆర్థిక అవసరాలను తీరుస్తూ కీలకపాత్ర పోషిస్తున్నారు. * గల్ఫ్ దేశాలకు వలస వచ్చిన మహిళలతో చాలామంది తల్లులు గానీ లేదా తల్లిదండ్రులకు చేయూతనిచ్చేందుకు వచ్చినవారే. * ముఖ్యంగా పురుషులుగానీ, స్త్రీలు గానీ డబ్బు పంపుతున్నది ఎక్కువ భాగం మహిళలకే(డబ్బును అందుకుంటున్న వారిలో మూడింట రెండొంతులు వారే). దీన్ని బట్టి ఇంటి ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో మహిళలు ఎంత కీలకమో తెలుస్తోంది. * విదేశాలకు వలస వెళ్లిన 48 శాతం మంది మహిళలు ఉద్యోగాలు చేయడంగానీ, సొంత వ్యాపారాలు గానీ నిర్వహిస్తున్నారు. * విదేశాల నుంచి పురుషులు పంపుతున్న డబ్బుకు సమానంగా మహిళలు కూడా పంపుతున్నారు. మగవారి కన్నా తక్కువగా సంపాదిస్తున్నప్పటికీ సంపాదనలో ఎక్కువ భాగాన్ని కుటుంబానికి పంపుతున్నారు. * బ్యాంకు ఖాతాల్లో తక్కువగా ఉన్నప్పటికీ ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానంలో మహిళలు (13.4).. పురుషులకు (15.6 శాతం) ధీటుగా ఉన్నారు.