వాణిజ్యం విషయంలో దేశాలు అనుసరించే రక్షణాత్మక విధానాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎన్నటికీ మంచిది కాదని, దీనివల్ల సానుకూల ఫలితాలు ఎప్పుడూ కనబడలేదని ఐక్యరాజ్యసమితి ఆసియా పసిఫిక్ వ్యవహారాల ఎకనమిక్‌అండ్ సోషల్ కమిషన్ (ఈఎస్‌సీఏపీ)– ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) సంయుక్త నివేదిక ఒకటి తెలిపింది. స్వేచ్ఛా వాణిజ్య విధానాలతోనే ప్రపంచ ఆర్థిక అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేసింది. టారిఫ్ యేతర అవరోధాలుసహా వాణిజ్య ఆంక్షల విధింపు యోచనలకు, నిర్ణయాలకు దూరంగా ఉండాలని ఆసియా దేశాలకు నివేదిక విజ్ఞప్తి చేసింది. ‘ఆసియా– పసిఫిక్ ట్రేడ్ ఫెసిలిటేషన్ రిపోర్ట్ 2021’ శీర్షికన ఆవిష్కరించిన నివేదికలో
ముఖ్యాంశాలు చూస్తే...
♦కోవిడ్–19 సవాళ్ల నేపథ్యంలో సరఫరాల వ్యవస్థకు అంతర్జాతీయంగా తీవ్ర విఘాతం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆసియా దేశాలు తమ వ్యాపార లావాదేవీల వేగవంతం విషయంలో డిజిటల్, పేపర్‌లెస్ ట్రేడ్ విధానాలను అనుసరిస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయి. దీనివల్ల వాణిజ్య వ్యయాలు సగటున 13శాతానికిపైగా తగ్గే అవకాశం ఉంది.
♦ ఎగుమతి ఆంక్షలు, టారిఫ్ యేతర చర్యలను దేశాలు మానుకోవాలి. కోవిడ్–19 పర్యవసానాల నేపథ్యంలో తీసుకువచ్చిన వాణిజ్య ఆంక్షల విషయంలో మరింత పారదర్శకత ఉండాలి. సమీక్షలు, పరస్పర అవగాహనల ద్వారా ఆంక్షల సడలింపు, స్వేచ్ఛాయుత వాణిజ్య వాతావరణంలోకి అడుగులు వేయాలి.
♦ స్థిరమైన వాణిజ్య సదుపాయాలలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, భారత్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా లు అత్యుత్తమ పనితీరు కనబరిచాయి, ఆస్ట్రేలి యా, న్యూజిలాండ్ డిజిటల్ ట్రేడ్ ఫెసిలిటేషన్‌లో అత్యుత్తమ పనితీరును చూపుతున్నాయి. ఈ రెండు అంశాలల్లోనూ సింగపూర్ 90 శాతాని కి పైగా మంచి ఫలితాలను నమోదుచేసుకుంది.
♦ గతంలో వచ్చిన మహమ్మారుల విస్తరణ దేశాల మధ్య నెమ్మదిగా ఉంది. దాదాపు స్థానికంగా> కూడా ఇవి ఉండిపోయాయి. దీనివల్ల నష్టం కొంతమేరే పరిమితమయిన పరిస్థితి ఉంది. అయితే తాజా కోవిడ్–19 మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరించింది. ఆర్థికంగా దేశాలను దెబ్బతీసింది. ప్రపంచవ్యాప్తంగా దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాలు చూపే పరిస్థితిని సృష్టించింది.
♦ వైరెస్‌ను కట్టడి చేయడానికి పలు దేశాలు సరిహద్దులు మూసివేత, లాక్‌డౌన్లు, క్వారంటైన్ల వంటి పలు చర్యలను తీసుకున్నాయి. ఇది డిమాండ్‌ను, సరఫరాల వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్యం దెబ్బతింది. క్షీణతలోకి జారుకుంది. ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో ఈ ప్రభావం తీవ్రంగా ఉంది.
♦వ్యాక్సినేషన్ ఉత్పత్తిలో ఉన్న పలు దేశాలు స్థానిక అవసరాలు, డిమాండ్‌కు ప్రాధాన్యత ఇచ్చాయి. ఎగుమతుల విషయంలో పలు ఆంక్షలను విధించాయి. దీనితో వ్యాక్సినేషన్ సరఫరాల్లో తీవ్ర ఆటంకం ఏర్పడింది.
భారత్‌కు సవాళ్లు..
దక్షిణ ఆసియాలో భారత్ పోర్టు రద్దీ నుంచి విడి భాగాల కొరత వరకూ పలు ఆటోమోటివ్ ఉత్పత్తి ఆటంకాలను ఎదుర్కొందని నివేదిక తెలిపింది. అదేవిధంగా ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సామర్థ్యం, టెలికాం ఉత్పత్తులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి హార్డ్‌వేర్, కన్సూ్యమర్ ఎలక్ట్రానిక్స్, మెడికల్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ వంటివి పలు విభాగాలు ముడి పదార్థాల కొరతసహా పలు సమస్యలను దేశం ఎదుర్కొన్నట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment