YSRCP MP Vijaya Sai Reddy Analysis On Restrictions Laptops, Computers, And Their Components - Sakshi
Sakshi News home page

ల్యాప్‌ట్యాప్‌లు, టాబ్లెట్లు, పీసీల దిగుమతిపై తాజా ఆంక్షలు, భారత ఐటీ హార్డ్‌ వేర్‌ రంగం అభివృద్ధికి దారితీస్తే మంచిదే!

Published Wed, Aug 9 2023 12:19 PM | Last Updated on Wed, Aug 9 2023 1:14 PM

 Ysrcp Mp Vijaya Sai Reddy Analysis On Restrictions Laptops, Computers, And Their Components - Sakshi

ఆధునిక భారతంలో నేడు ప్రతి చోటా అవసరమైన ల్యాప్‌ట్యాప్‌లు,ట్యాబ్లెట్‌ పీసీలు, కొన్ని రకాల కంప్యూటర్ల దిగుమతులపై ప్రభుత్వం ఇటీవల హఠాత్తుగా ఆంక్షలు విధించడం చాలా మందికి దిగ్భ్రాంతి కలిగించింది. అంతేకాదు, ఇంటర్నెట్‌ ఆధారిత లోకంలో ఇలాంటి కొత్త ‘నిత్యావసరాల’ దిగుమతులు సాఫీగా జరిగేలా చూడకుండా వాటి నిరంతర సరఫరాను ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా అడ్డుకోవడం ఎంత వరకు సబబు? 

ఇలాంటి ఆంక్షలు దేశంలో ల్యాప్‌ట్యాప్లు, ట్యాబ్లెట్‌ పీసీలు , పీసీల ఉత్పత్తి అవసరమైనంతగా పెరిగి, నాణ్యత గల కంప్యూటర్లు సరసమైన ధరలకు అందుబాటులోకి వస్తాయా? లేక ఈ దిగుమతుల పరోక్ష ‘నిషేధం ఉత్తర్వులు’ అనుకున్న లక్ష్యాలు సాధించకపోతే చివరికి పాత మార్గంలోనే పయనించాల్సి వస్తుందా? ఇలాంటి కీలక వినియోగ వస్తువుల దిగుమతిపై ఆంక్షలు పెట్టడానికి దేశ భద్రత ప్రధాన కారణమని ప్రకటించారు. దీంతో ఈ విషయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. స్మార్ట్‌ ఫోన్లు, టెలివిజన్‌ సెట్లను స్థానికంగా తయారుచేసుకోవడంలో ఇండియా చెప్పుకోదగ్గ ప్రగతి సాధించింది. 

కాని, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ హార్డ్‌ వేర్‌ రంగంలో (ల్యాప్‌ట్యాప్‌లు, పీసీలు,ట్యాబ్లెట్లు) ఆశించినంత అభివృద్ధి ఇంకా సాధించలేదు. భారతదేశంలో వినియోగించే దాదాపు 65 శాతం ల్యాప్ ట్యాప్‌లు, పీసీలను దిగుమతి చేసుకుంటున్నాం. దిగుమతులపై ఆంక్షలతో దేశీయంగా ఈ ఐటీ హార్డ్‌ వేర్‌ ఉత్పత్తుల తయారీ గణనీయంగా పెంచాలనుకునే ఆశయం మంచిదే. మరి ఈ పని ఎప్పుడో చేసి ఉంటే ల్యాప్‌ట్యాప్‌లు, పీసీల తయారీ రంగం ఎంతో ముందుకు సాగేదని కొందరు నిపుణులు భావిస్తున్నారు. దిగుమతులకు తగినంతగా అడ్డుకట్ట వేయడంలో జరిగిన విపరీత జాప్యం వల్ల సింగపూర్, హాంకాంగ్, వియత్నాం వంటి తోటి ఆసియా దేశాలు ఈ రంగంలో తిరుగులేని అభివృద్ధి సాధించాయి. మరోపక్క కంప్యూటర్‌ సాధనాల తయారీ, ఎగుమతిలో చైనా ఎదురులేని అగ్రశేణి దేశంగా తన ఆధిపత్యం కొనసాగిస్తోంది. 

చైనా విషయంలో జాగరూకతే ఆంక్షలకు కారణమా?
పైన చెప్పిన కంప్యూటర్‌ సాధనాల విషయంలో చైనాపై ఎక్కువగా ఆధారపడడం మంచిది కాదని, అందుకే వాటి దిగుమతిపై ఆంక్షలు విధించడం తప్పనిసరి అని కొందరు గట్టిగా వాదిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజా చర్యను వారు సమర్ధిస్తూ ఆహ్వానిస్తున్నారు. ఈ హఠాత్‌ నిర్ణయం వల్ల కంపెనీలు ఇబ్బంది పడకుండా మరి కొన్ని నెలలపాటు అవి లాప్టాప్‌ లు, పీసీలను దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం కొత్త దిగుమతి లైసెన్సింగ్‌ విధానం ద్వారా వాటికి మార్గం చూపిస్తోంది. 

దీని వల్ల ఇప్పటికిప్పుడు ఈ కంప్యూటర్‌ సాధనాలకు కొరత ఏర్పడి, వాటి ధరలు పెరిగే ప్రమాదం ఉండకపోవచ్చని కూడా ఐటీ రంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈలోగా ఈ కీలక వినియోగ వస్తువుల ఉత్పత్తి దేశీయంగా తగినంతగా పెరిగే పరిస్థితులను సృష్టించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పీసీలు, లాప్టాప్‌ లు వంటి ఐటీ హార్డ్‌ వేర్‌ రంగం కోసం ఈ ఏడాది మొదట్లోనే ఉత్పత్తితో ముడిపడిన ప్రోత్సాహక పథకాన్ని కేంద్ర కేబినెట్‌ ఆమోదించింది. దీని కోసం బడ్జెట్‌లో రూ.17,000 కోట్లు కేటాయించింది. ఈ రంగంలోకి భారీ పెట్టుబడులను, బడా కంపెనీలను ఆకర్షించడానికి వీలుగా ఈ కొత్త పథకం కోసం దరఖాస్తు చేసుకునే గడువును కూడా పొడిగించింది. 

విద్య, వ్యాపారం, వినోద రంగాల్లో రోజురోజుకూ వినియోగం పెరుగుతున్న లాప్టాప్‌ లు, టాబ్లెట్లు, పీసీలు తయారీ దేశంలో శరవేగంతో పెరిగితేనే ఇండియా అవసరాలు తీరతాయి. ఈ రంగంలో అమలులోకి వచ్చే దిగుమతి ఆంక్షలకు తోడు కంప్యూటర్‌ సాధనాల అరకొర ఉత్పత్తి వల్ల దేశం ఐటీ హార్డ్‌ వేర్‌ రంగంలో ఇబ్బందులు ఎదుర్కోనే పరిస్థితి రాకుండా భారత ప్రభుత్వం అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

అవసరమైన సంఖ్యలో కంప్యూటర్లు, లాప్టాప్‌ ల తయారీతోపాటు ఈ ఐటీ ఉత్పత్తుల నాణ్యత, ధరలు అత్యంత కీలకమౌతాయి. ఈ రెండు అంశాలే దేశంలో ఐటీ హార్డ్‌ వేర్‌ ఉత్పత్తుల రంగం అభివృద్ధిని నిర్ణయిస్తాయి. అంతా అనుకున్నట్టు జరిగితే ప్రపంచస్థాయి ఐటీ కంప్యూటింగ్‌ సాధనాలకు ఇండియాయే ఓ పెద్ద సరఫరాదారు అవుతుంది. ఈ క్రమంలో ఇప్పటి చైనా మాదిరిగానే ల్యాప్‌ట్యాప్‌లు, పర్సనల్‌ కంప్యూటర్ల ఎగుమతి కేంద్రంగా అవతరిస్తుంది.


-విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement