న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా బుధవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి పద్మభూషణ్ అవార్డును స్వీకరించారు. దీనితో బిర్లా కుటుంబంలో దేశ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న నాల్గవ వ్యక్తిగా నిలిచారు. ఆయన ముత్తాత జీడీ బిర్లా 1957లో పద్మవిభూషణ్ గ్రహీత. తల్లి రాజశ్రీ బిర్లా 2011లో పద్మభూషణ్ పురస్కారం పొందారు. కుమార మంగళం బిర్లా తాత బీకే బిర్లా బంధువు జీపీ బిర్లా 2006లో పద్మభూషణ్‌ను అందుకున్నారు.
ఆయన 28 ఏళ్ల సుదీర్ఘ వాణిజ్య అనుభవంలో గ్రూప్ టర్నోవర్ 30 రెట్లు పెరిగి 60 బిలియన్ డాలర్లకు చేరింది. ‘‘ఉన్నత లక్ష్యానికి వ్యాపారం దోహదపడుతూ, జీవితాలను సుసంపన్నం చేయాలన్న ఆదిత్య బిర్లా గ్రూప్ సంకల్పానికి ఈ అవార్డు ఒక గుర్తింపు’’ అని కుమార మంగళం బిర్లా పేర్కొన్నారు. ఈ ఏడాది మరణానంతర పద్మశ్రీ అవార్డులు లభించిన వారిలో ప్రముఖ శీతల పానీయాల బ్రాండ్ రస్నా వ్యవస్థాపకుడు, దివంగత అరీజ్ ఖంబట్టా, దిగ్గజ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment