సీబీఐ విచారణకు సిద్ధం: ప్రధాని | I'm ready to face CBI probe:manmohan singh | Sakshi
Sakshi News home page

సీబీఐ విచారణకు సిద్ధం: ప్రధాని

Published Fri, Oct 25 2013 1:29 AM | Last Updated on Fri, Sep 1 2017 11:56 PM

సీబీఐ విచారణకు సిద్ధం: ప్రధాని

సీబీఐ విచారణకు సిద్ధం: ప్రధాని

ప్రధాని ప్రత్యేక విమానం నుంచి:నీడలా తనను వెన్నాడుతున్న బొగ్గు కుంభకోణంపై సీబీఐ సహా మరే ఇతర విచారణకైనా సిద్ధమని ప్రధాని మన్మో హన్‌సింగ్ ప్రకటించారు. ఈ విషయంలో దాచేందుకు తన వద్ద ఏమీ లేదని వ్యాఖ్యానించారు. ఈ కేసులో 10 రోజుల క్రితం ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా, కేంద్ర బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పి.సి.పరేఖ్‌లపై ఎఫ్‌ఐఆర్ దాఖలయ్యాక ఈ ఉదంతంపై ఆయన తొలిసారిగా స్పందించారు. ఐదు రోజుల రష్యా, చైనా పర్యటన ముగించుకుని గురువారం భారత్ తిరిగి వస్తూ తన ప్రత్యేక విమానంలో విలేకరులతో మాట్లాడారు.
 
 

బొగ్గు కుంభకోణం విషయంలో తనపై విమర్శల దాడిని విపక్షాలు తీవ్రతరం చేసిన నేపథ్యంలో ఆయన తీవ్రంగా బదులిచ్చారు. ‘‘నేనేమీ దేశ చట్టాలకు అతీతుడ్ని కాను. ఈ కుంభకోణానికి సంబంధించిన సీబీఐ గానీ, మరెవరైనా గానీ నన్నేమైనా అడగదలిస్తే దాయడానికి నా దగ్గరేమీ లేదు’’ అన్నారు. సీబీఐ కేసులు, కుంభకోణాలు ప్రధానిగా మీ వారసత్వానికి మచ్చలుగా మిగిలిపోనున్నాయా అని ప్రశ్నించగా, దాన్ని నిర్ణయించాల్సింది చరిత్రేనన్నారు. ‘నేను నా బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. ఇకపైనా నిర్వర్తిస్తూ సాగుతాను.
 
 ప్రధానిగా నా పదేళ్ల పాలన తాలూకు ప్రభావం ఏమిటన్న దానిపై తీర్పు చెప్పాల్సింది చరిత్రకారులే’ అన్నారు. బిర్లా నేతృత్వంలోని హిందాల్కోకు ఒడిశాలో బొగ్గు క్షేత్రం కేటాయింపు సరైందేనంటూ ఇటీవల ప్రధాని కార్యాలయం ఇచ్చిన వివరణ తదితరాలపై విలేకరులు మన్మోహన్‌ను ప్రశ్నించారు. ఇన్‌స్పెక్టర్ స్థాయి సీబీఐ అధికారి కూడా నేరుగా ప్రధానిని ప్రశ్నించేంతగా ఆ సంస్థకు స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వవచ్చా అన్న ప్రశ్నకు, ‘కోర్టు పరిధిలో ఉన్న ఈ అంశంపై నేనేమీ వ్యాఖ్యానించదలచలేదు’ అంటూ ఆయన సరిపెట్టారు. బొగ్గుతో సహా పలు కుంభకోణాలపై దర్యాప్తును సుప్రీంకోర్టు నేరుగా పర్యవేక్షిస్తున్న వైనం ప్రభుత్వ విధాన నిర్ణయ ప్రక్రియను ప్రభావితం చేయడం లేదా అన్న ప్రశ్నకు కూడా అదే సమాధానమిచ్చారు. అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, ఏం చేయదన్న దానిపై తానేమీ వ్యాఖ్యానించదలచలేదన్నారు. ఈ సందర్భంగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ, పాక్‌తో సంబంధాలు, రష్యా-చైనా పర్యటన తదితరాలపై మన్మోహన్ వెల్లడించిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...
 
 

షరీఫ్ తీరు నిరాశాకరం: కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ తూట్లు పొడుస్తున్న వైనం బాధాకరం. ఈ విషయంలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తీరుతో నేనెంతో అసంతృప్తి చెందాను. ఎందుకంటే ఇరుదేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొనాలంటూ ఇటీవల న్యూయార్క్‌లో మేము అంగీకారానికి వచ్చాం. నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరుగుతున్న కాల్పులు ఇద్దరికీ మంచివి కావు. ఇప్పటికైనా షరీఫ్ అక్కడి పరిస్థితిని చక్కదిద్దాలి.
 రాహుల్‌కు ఏ హానీ జరగనీయం: ‘‘రాహుల్‌గాంధీ ప్రాణాలకు ఎలాంటి ముప్పూ వాటిల్లకుండావీలైనన్ని అన్ని జాగ్రత్తలనూ కేంద్రం తీసుకుంటుంది (తన నానమ్మ ఇందిర, నాన్న రాజీవ్ ఇద్దరూ హత్యకు గురయ్యారని, తననూ అలాగే అంతమొందిస్తారేమోనని రాహుల్ చేసిన వ్యాఖ్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లగా ఇలా స్పందించారు). కానీ దేశంలో పెచ్చరిల్లుతున్న విద్వేష రాజకీయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అందరూ ఆందోళన చెందాల్సిన పరిణామమిది’’
 
 

మోడీది ఆరంభశూరత్వమే: ‘‘నరేంద్ర మోడీ, ఆయన సారథ్యంలోని బీజేపీ 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని మాకంటే ముందు మొదలు పెట్టి ఉండొచ్చు గాక. కానీ వారిది ఆరంభ శూరత్వం మాత్రమే. ఎన్నికలు సమీపించేకొద్దీ వారు చతికిలపడతారు. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఆ ఫలితాలను చూసి దేశమంతా ఆశ్చర్యపోవడం ఖాయం. నాకు ఆ నమ్మకముంది. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం చురుగ్గా సాగడం లేదనడం సరికాదు. నిదానమే ప్రధానమన్నది కొన్నిసార్లు ప్రజా జీవితానికి కూడా వర్తిస్తుంది. మీరు (విలేకరులు) ప్రస్తావిస్తున్న కుంభకోణాలన్నీ యూపీఏ-2లో కాకుండా యూపీఏ-1 హయాంలో జరిగాయి. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికలు రావడం, వాటిలో కాంగ్రెస్ గెలవడం జరిగిపోయాయి. 2014లోనూ అదే పునరావృతం కానుంది’’
 
 చైనాతో సంబంధాలపై...
 
 చైనా, భారత్ మధ్య సంబంధాల్లో సరిహద్దు ఉద్రిక్తతలు, అంతర్జాతీయ నదీ వివాదాలు అడ్డంకిగా పరిణమించవచ్చని ప్రధాని హెచ్చరించారు. ఇప్పటిదాకా ఇరు దేశాల సంబంధాల్లో సాధించిన ప్రగతి కూడా సరిహద్దులను ప్రశాంతంగా ఉంచుకోవడం వల్లే సాధ్యమైందని చైనా కమ్యూనిస్ట్ పార్టీ తాలూకు సెంట్రల్ పార్టీ స్కూల్‌లో చేసిన ప్రసంగంలో వ్యాఖ్యానించారు.
 
 ‘టీ’ సమస్యకు జీవోఎంపరిష్కారం చూపుతుంది
 
 సంక్లిష్టమైన ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యకు.. తెలంగాణ అంశంపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) పరిష్కారం సూచిస్తుందని ప్రధాని మన్మోహన్ ఆశాభావం వ్యక్తంచేశారు. ‘హైదరాబాద్ వంటి క్లిష్టమైన సమస్యలను పరిష్కరించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు 2014కు ముందే సాధ్యమవుతుందని మీరు విశ్వసిస్తున్నారా?’ అని విలేకరులు ప్రశ్నించగా ఆయన నేరుగా సమాధానం ఇవ్వకుండా ఈ విధంగా స్పందించారు. ‘‘ఈ అంశం మంత్రుల బృందం ఎదుట ఉంది. సమస్య అన్ని కోణాలనూ వారు పరిశీలిస్తున్నారు. సంక్లిష్టమైన ఈ సమస్యకు వారు ఆచరణీయమైన పరిష్కారం చూపుతారని నాకు నమ్మకముంది’’ అని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement