'మన్మోహన్ సింగ్ను ఎందుకు ప్రశ్నించలేదు?'
న్యూఢిల్లీ : బొగ్గు కుంభకోణంపై ప్రత్యేక కోర్టులో మంగళవారం విచారణ ప్రారంభమైంది. అప్పటి ప్రధానితో పాటు, బొగ్గుశాఖ మంత్రిని, ఎందుకు ప్రశ్నించలేదని ప్రత్యేక కోర్టు సీబీఐని సూటిగా ప్రశ్నించింది. కేసు వివరాలను సమర్పించాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. అప్పటి బొగ్గు శాఖ మంత్రి వాంగ్మూలం ఎందుకు రికార్డు చేయలేదని ప్రశ్నించింది.
కోర్టు ప్రశ్నలపై స్పందించిన సీబీఐ పీఎంఓ అధికారులను ప్రశ్నించామని తెలిపింది. అయితే అప్పటి బొగ్గు శాఖ మంత్రిని ప్రశ్నించేందుకు అనుమతి రాలేదని వెల్లడించింది. దీనిపై స్పందించిన కోర్టు విచారణ డైరీని సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. కాగా యూపీఏ హయాంలో బొగ్గు శాఖ మొదట్లో మన్మోహన్‌సింగ్ వద్ద ఉండేది. ఆ సమయంలోనే కుంభకోణం జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి.