మన్మోహన్‌ను విచారించండి | Coal scam: CBI directed to record statement of former PM Manmohan Singh | Sakshi
Sakshi News home page

మన్మోహన్‌ను విచారించండి

Published Wed, Dec 17 2014 2:44 AM | Last Updated on Sat, Sep 2 2017 6:16 PM

మన్మోహన్‌ను విచారించండి

మన్మోహన్‌ను విచారించండి

కోల్‌గేట్‌లో సీబీఐకి ప్రత్యేక కోర్టు ఆదేశం

హిండాల్కోకు తలాబిరా-2 కేటాయింపుపై విచారణ  
మరింత దర్యాప్తు అవసరమని వెల్లడి


న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణానికి సంబంధించి ప్రత్యేక కోర్టు మంగళవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. హిండాల్కోకు ఒడిశాలోని తలాబిరా-2 బొగ్గు గని కేటాయింపు కేసులో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌నూ విచారించాలని సీబీఐని ఆదేశించింది. 2005లో అప్పటి ప్రధాని మన్మోహన్ బొగ్గు శాఖను సైతం పర్యవేక్షిస్తున్నప్పుడు ఈ కేటాయింపు జరిగింది. దీనిపై దర్యాప్తు కొనసాగించిన సీబీఐ 4 నెలల క్రితం కేసు ముగింపు నివేదిక దాఖలు చేసింది. ఈ గని కేటాయింపుతో సంబంధమున్న వారెవరూ నేరానికీ పాల్పడలేదని పేర్కొంది. సుప్రీంకోర్టు నియమిత స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్.ఎస్.చీమా సీబీఐ చర్యను వ్యతిరేకించారు.

తాజాగా మంగళవారం కేసును విచారించిన ప్రత్యేక కోర్టు జడ్జి భరత్ పరాశర్ మరింత దర్యాప్తుకు సీబీఐని ఆదేశించారు. ‘ఈ కేసులో వివిధ అంశాలకు సంబంధించి తొలుత అప్పటి బొగ్గు శాఖ మంత్రిని విచారించడం సముచితమే అవుతుంది. ఏదైనా నేరం జరిగిందా? ఎవరు నేరానికి పాల్పడ్డారు? తదితర అంశాల్లో మరింత దర్యాప్తు జరిపేముందు అప్పటి బొగ్గు మంత్రి (మన్మోహన్)ని విచారించడం సముచితమని గట్టిగా అభిప్రాయపడుతున్నా’ అని చెప్పారు. మన్మోహన్‌నే కాకుండా.. అప్పట్లో బొగ్గు శాఖలో పనిచేసిన, హిండాల్కోకు బొగ్గు గని కేటాయింపుతో సంబంధం ఉన్న ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)లోని పలువురు ఉన్నతాధికారులనూ దర్యాప్తు సంస్థ అసలు విచారించలేదని లేదా సరిగ్గా విచారించలేదని అన్నారు.

‘ప్రధాని వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న బీవీఆర్ సుబ్రమణ్యంను విచారించలేదు. పీఎంఓలో ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన టీకేఏ నాయర్‌ను కొన్ని ప్రశ్నలతో విచారించినప్పటికీ.. తన అశక్తతను వ్యక్తం చేస్తూ కొన్ని ప్రశ్నలకు జవాబిచ్చేందుకు నాయర్ నిరాకరించారు. సుబ్రమణ్యంను విచారించడంతో పాటు నాయర్‌ను పునర్విచారించడం మంచిది..’ అని  తన 50 పేజీల ఉత్తర్వులో స్పష్టం చేశారు.  విచారణలో స్వాధీనం చేసుకున్న పత్రాలు.. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమారమంగళం బిర్లా అప్పట్లో మన్మోహన్‌తో, ఆ తర్వా త బొగ్గుశాఖ మా జీ కార్యదర్శి పీసీ పరఖ్ లేదా దాసరి నారాయణరావు(అప్పటి బొగ్గు సహాయమంత్రి)తో పాటు ఇతరులను కలుసుకున్నట్టు నిర్ధారిస్తున్నాయన్నారు.

బిర్లా ప్రధానికి రెండు లేఖలు (2005 మే 7, 2005 జూన్ 17) కూడా రాయడాన్ని బట్టి హిండాల్కో ప్రయోజనాల కోసం మొత్తం ప్రభు త్వ యంత్రాంగాన్ని తమ చెప్పుచేతల్లో ఉంచుకునేందుకు ప్రయత్నాలు జరిగాయని స్పష్టమవుతోందన్నారు. ఓ ప్రముఖ పారిశ్రామిక సంస్థ అధిపతి ప్రధానితో లేదా ఉన్నతాధికారులతో భేటీ కావడంపై అభ్యంతరం లేనప్పటికీ.. పైన పేర్కొన్న వాస్తవాలు, తదనంతర పరిణామాల కోణంలో ఈ కోణంలో చూసినప్పుడు కచ్చితంగా సందేహాలు తలెత్తుతున్నాయని చెప్పారు. ప్రధానికి బిర్లా లేఖలు రాసిన తర్వాత బొగ్గు శాఖ నుంచి ఆ మేరకు నివేదికను కోరిన పీఎంఓ అధికారులు.. ఆ తర్వాత పదేపదే (రిమైండర్లు, ఫోన్ విజ్ఞప్తులు) త్వరగా స్పందించాలంటూ ఆ శాఖ వెంటపడటం సందేహాలకు తావిస్తోందన్నారు.

దీంతో.. మరింత దర్యాప్తు కోసం తిరిగి సీబీఐకి పంపుతున్నట్లు తెలిపారు. స్క్రీనింగ్ కమిటీకి లేదా బొగ్గు శాఖను పర్యవేక్షిస్తున్న ప్రధానికి ఉన్న విచక్షణాధికారాన్ని ప్రశ్నించడం లేదని, కానీ ప్రాథమికంగా ఆ అధికారాన్ని వినియోగించిన తీరుపైనే న్యాయ సమీక్ష అవసరమన్నారు. గని కేటాయింపు  చట్టప్రకారం జరిగిందా? లేదా? అన్నదే ప్రశ్న అన్నారు. ప్రధానికి బిర్లా లేఖలు రాసిన నేపథ్యంలో కేసును తిరగదోడాల్సి వస్తోందని చెప్పారు.

తలాబిరా-2 కేటాయింపునకు సంబంధించి హిండాల్కో విజ్ఞప్తిని ఆమోదించడం సాధ్యం కాదని అప్పటి బొగ్గు శాఖ సెక్షన్ ఆఫీసర్ ప్రేమ్‌రాజ్ కౌర్ చెప్పినప్పటికీ.. ఉన్నతస్థాయిలో దాన్నంతగా పట్టించుకోలేదని తెలిపారు. హిండాల్కోకు అనుకూలంగా పరఖ్ తాజాగా ప్రతిపాదనలు సిద్ధం చేశారని, కానీ.. స్క్రీనింగ్ కమిటీ సిఫారసులకు విరుద్ధంగా వ్యవహరించడం సమంజసం కాబోదని దాసరి నారాయణరావు హెచ్చరించారన్నారు. మరింత దర్యాప్తుపై సీబీఐ ప్రగతి నివేదికను దాఖలు చేసేందుకు వీలుగా కేసును జనవరి 27వ తేదీకి వాయిదా వేశారు. కాగా, మన్మోహన్ సీబీఐ విచారించాలన్న కోర్టు ఆదేశం సబబేనని బీజేపీ అభిప్రాయపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement