ప్రత్యేక కోర్టులో సవాల్ చేసిన కవిత
రెగ్యులర్ కోర్టుకు వెళ్లాలన్న న్యాయమూర్తి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే ఆమెను అరెస్టు చేయగా జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా తాము కవితను అరెస్టు చేసినట్లు గురువారం మధ్యాహ్నం ఆమె కుటుంబ సభ్యులకు సీబీఐ అధికారులు తెలిపారు. దీంతో కవిత అరెస్టును సవాల్ చేస్తూ ఆమె తరఫు న్యాయవాది నితీష్ రాణా.. రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. గురువారం రంజాన్ సెలవు నేపథ్యంలో ప్రత్యేక న్యాయమూర్తి మనోజ్‌కుమార్ ముందు ఈ అంశాన్ని ప్రస్తావించారు.
ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అరెస్టు చేయడం సరికాదన్నారు. ముందుగా చెప్పాలంటూ కోర్టు ఆదేశాలు ఉన్నాయని గుర్తు చేశారు. దీంతో మద్యం కుంభకోణం కేసును తాను గతంలో విచారించలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. అత్యవసర కేసులు మాత్రమే ప్రస్తుతం పరిశీలిస్తామని చెప్పారు. దీనిని శుక్రవారం రెగ్యులర్ కోర్టు ముందు ప్రస్తావించాలని సూచించారు. అనంతరం రాణా మీడియాతో మాట్లాడుతూ.. కవిత అరెస్టు అన్యాయమని, ఎలాంటి నోటీసు లేకుండా అరెస్టు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఇదే విషయం శుక్రవారం రెగ్యులర్ కోర్టు ముందు ప్రస్తావిస్తామని చెప్పారు.
కస్టడీ కోరనున్న సీబీఐ!
రౌస్ అవెన్యూ కోర్టు అనుమతితో సీబీఐ శనివారం కవితను తీహార్ జైలులో ప్రశ్నించిన విషయం విదితమే. మాజీ ఆడిటర్ బుచ్చిబాబుతో వాట్సాప్ చాట్‌లు, భూ ఒప్పందానికి సంబంధించిన అంశాలపై కవితను ప్రశ్నించినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. తాజాగా ఆమెను అరెస్టు చేసిన నేపథ్యంలో విచారణ నిమిత్తం కస్టడీకి ఇవ్వాల్సిందిగా సీబీఐ శుక్రవారం ప్రత్యేక కోర్టును కోరనున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment