తీహార్ జైలులో రక్తపోటుతో బాధపడుతున్న ఎమ్మెల్సీ
సాక్షి, న్యూఢిల్లీ: మద్యం విధానం కేసులో ఆరోపణ లను ఎదుర్కొంటూ తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత హైబీపీతో సతమతం అవుతున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల కిందట ఎ యిమ్స్ ఆసుపత్రిలో ఆమె కు జైలు అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. గైనిక్ టెస్టులతో పాటు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ టెస్టులను చేశారు. బీపీ పరీక్షించగా, 186/103 ఉన్నట్లు తెలిసింది. జైలులోకి వెళ్లిన రెండు రోజులకే కవిత హైబీపీకి గురి అయినట్లు సమాచారం.
జైలు అధికారులు రెండు పూటలా బీపీ ట్యాబ్లెట్లు ఇస్తున్నా రక్తపోటు నియంత్రణలోకి రాకపోవడంపై ఆమె కుటుంబీకుల్లో ఆందోళన నెలకొంది. మరోపక్క జ్వరం కూడా తగ్గకపోవడం, ఒకేసారి పది కేజీల బరువు తగ్గడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జైలులోకి వెళ్లే ముందు కవిత 70 కేజీల బరువు ఉండగా, ఎయిమ్స్ వైద్యులు నిర్వహించిన పరీక్షల సందర్భంలో ఆమె బరువు 59.5 కేజీలు ఉన్నట్లు సమాచారం. వీటికి తోడు దీర్ఘకాలికంగా ఆమెకు ఉన్న గైనిక్ సమస్యలు రోజు రోజుకూ ఎక్కువ అవడం వలన మరింత అనారోగ్యానికి గురవుతున్నట్లు చెబుతున్నారు.
హరీశ్‌రావు పరామర్శ: తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితను రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో కలిసి మాజీ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం పరామర్శించారు. ఆ కేసులో దర్యాప్తు సంస్థలు కావాలనే కవితను ఇబ్బంది పెడుతున్నాయని హరీశ్ ఆరోపించారు. బెయిల్ విషయంలో దర్యాప్తు సంస్థలు వ్యవహరిస్తున్న తీరును దేశ ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. తమకు న్యాయస్థానాలపై నమ్మకం ఉందని, వచ్చే మంగళవారం కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉందని హరీశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment