సాక్షి, హైదరాబాద్: ముందే నిర్ణయించిన కార్యక్రమాల దృష్ట్యా ఈనెల 26న ఢిల్లీలో విచార ణకు హాజరుకావడం సాధ్యం కాదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐకి స్పష్టం చేశారు. సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ కింద తనకు జారీ చేసిన నోటీ సుల రద్దు లేదా ఉపసంహరించుకోవాలని సీబీఐని కోరారు. ఈ మేరకు ఆదివారం కవిత సీబీఐకి లేఖ రాశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ కవితకు సీబీఐ ఇటీవల సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు ప్రతిస్పందనగా రాసిన లేఖలో కవిత కీలకాంశాలను ప్రస్తావించారు.
తనకు సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదని, 2022 డిసెంబరులో అప్పటి విచారణ అధికారి ఇదే తరహా నోటీసు సెక్షన్ 160 కింద ఇచ్చారని, గతంలో జారీ చేసిన సెక్షన్ 160 నోటీసుకు ప్రస్తుత సెక్షన్ 41ఏ నోటీసు పూర్తి విరుద్ధంగా ఉందని చెప్పారు. సెక్షన్ 41ఏ కింద ఎందుకు, ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదని, సీబీఐకి ఏవైనా ప్రశ్నలకు సమాధానం లేదా సమాచారం కావాలంటే వర్చువల్ పద్ధతిలో హాజరయ్యేందుకు అందుబాటులో ఉంటానన్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తనకు నోటీసులు జారీ చేయడం అనేక ప్రశ్నలకు తావిస్తోందని పేర్కొన్నారు. తనకు ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్నందున ఢిల్లీకి పిలవడం వల్ల తాను ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అవరోధం కలిగిస్తుందని అభ్యంతరం వ్యక్తం చేశారు.
సీబీఐ చేస్తున్న ఆరోపణల్లో నా పాత్ర లేదు
సీబీఐ చేస్తున్న ఆరోపణల్లో తన పాత్ర లేదని, పైగా ఆ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉందని కవిత చెప్పారు. గతంలో ఈడీ నోటీసులు జారీ చేస్తే, తాను సుప్రీం కోర్టును ఆశ్రయించానని, అది పెండింగ్‌లో ఉందన్నారు. తనను విచార ణకు పిలవబోమని అదనపు సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారని, సుప్రీంకోర్టులో ఇచ్చిన హామీ సీబీఐకి కూడా కూడా వర్తిస్తుందని స్పష్టం చేశారు. గతంలో సీబీఐ బృందం హైదరాబాద్‌లోని తన నివాసానికి వచ్చినప్పు డు విచారణకు సహకరించానని, సీబీఐ దర్యా ప్తునకు ఎప్పుడైనా తప్పకుండా సహకరిస్తానని తెలిపారు.
కానీ 15 నెలల విరామం తర్వాత ఇప్పుడు మళ్లీ ఢిల్లీకి పిలవడం, సెక్షన్ల మార్పు అనేక అనుమానాలకు తావిస్తుందని చెప్పారు. ‘ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మా పార్టీ (బీఆర్‌ఎస్) కొన్ని బాధ్యతలు అప్పగించింది. రానున్న ఆరు వారాల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం, సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రానున్న 6 వారాల పాటు పార్టీ సమావేశాల్లో పాల్గొంటాను. ఈ రీత్యా ఫిబ్రవరి 26వ తేదీన విచారణకు హాజరుకాలేను. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జారీ చేసిన నోటీసుల నిలిపివేత విషయాన్ని పరిశీలించండి’ అని కవిత సీబీఐకి సమాధానమిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment