బొగ్గు స్కామ్‌లో కోడాపై చార్జిషీట్
మరో ఇద్దరు మాజీ ఐఏఎస్ అధికారులపైనా..
న్యూఢిల్లీ: బోగ్గు కుంభకోణంలో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడాపై ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానంలో సీబీఐ అధికారులు శుక్రవారం చార్జిషీట్ దాఖలు చేశారు. కోల్‌కతాకు చెందిన సంస్థకు బొగ్గు బ్లాకుల కేటాయింపునకు సంబంధించి ఈ చార్జిషీట్ దాఖలైంది. కోడాతో పాటు మాజీ ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ బసు, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తా, మరో ఐదుగురిపైనా అధికారులు చార్జిషీట్ దాఖలు చేశారు.
వీరందరిపైనా నేరపూరిత కుట్ర, మోసం అలాగే అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు నమోదు చేశారు. డిసెంబర్ 22న ఈ చార్జిషీట్‌ను పరిశీలనలోకి తీసుకుంటామని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి భరత్ పరాసర్ స్పష్టం చేశారు. కాగా, బొగ్గు కుంభకోణానికి సంబంధించి చార్జిషీట్లు, ముగింపు నివేదికలను సీబీఐ దాఖలు చేసేందుకు ఈ నెల 8న సుప్రీంకోర్టు అనుమతించిన నేపథ్యంలో సీబీఐ తాజా చార్జిషీట్‌ను దాఖలు చేసింది. సీబీఐ మాజీ చీఫ్ రంజిత్ సిన్హాపై ఆరోపణల నేపథ్యంలో గతంలో చార్జిషీట్లు, ముగింపు నివేదికలు దాఖలు చేయడాన్ని సుప్రీంకోర్టు నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే.