న్యూఢిల్లీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంలో తనకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని మధుకోడా సుప్రీం తలుపు తట్టారు. స్టే ఇస్తే తాను ప్రస్తుతం జరుగుతున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హున్నవుతానని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
కోడా పిటిషన్‌ను శుక్రవారం(అక్టోబర్ 25) విచారించిన జస్టిస్ సంజీవ్‌కన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ శిక్షపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఈ సందర్భంగా బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. కోడాకు శిక్ష విధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది. గతంలో తాము బీఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీ విషయంలో ఇచ్చిన ఊరట మధుకోడాకు ఇవ్వలేమని తెలిపింది.
అన్సారీ సిట్టింగ్ ఎంపీ అయినందువల్లే ఆయనకు పడిన శిక్షపై స్టే ఇచ్చామని పేర్కొంది. ఇవే తరహా స్టేలు రొటీన్‌గా ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో మధుకోడాకు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే ఛాన్స్ లేకుండాపోయింది. కాగా, ప్రజా ప్రాతినిథ్య చట్టం ప్రకారం రెండు అంతకంటే ఎక్కువ ఏళ్లు శిక్ష పడిన ప్రజాప్రతినిధుల చట్టసభ సభ్యత్వాలు రద్దవడంతో పాటు జైలు నుంచి విడుదలైన తర్వాత ఆరేళ్ల దాకా మళ్లీ ఎన్నికల్లో పోటీచేసే అర్హత కోల్పోతారు.
ఇదీ చదవండి: వయనాడ్‌లో ఖర్గేకు అవమానం నిజమేనా..
Comments
Please login to add a commentAdd a comment