దాసరి నారాయణ రావు
న్యూఢిల్లీ: కేంద్ర మాజీమంత్రి, ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావుకు సంబంధించిన రూ. రెండు కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. యూపీఏ హయాంలో 2004 నుంచి 2008 దాకా బొగ్గుశాఖ సహాయ మంత్రిగా పనిచేసిన దాసరి బొగ్గుగనుల కేటాయింపులో జిందాల్ గ్రూపునకు అనుచిత లబ్ధి చేకూర్చారని సీబీఐ కేసు పెట్టడం తెలిసిందే.
ఈ సాయానికి ప్రతిగా ఆయనకు చెందిన సౌభాగ్య మీడియాలోకి జిందాల్ సంస్థ రూ. 2.25 కోట్లను మళ్లించిందనేది అభియోగం. అయితే సౌభాగ్య లో 2008-11 మధ్య మాత్రమే డెరైక్టర్‌గా ఉన్నానని, జిందాల్ నుంచి సొమ్ము 2011 తర్వాత వచ్చింది కాబట్టి అది అవినీతి కాదని దాసరి వాదన. ఈడీ అటాచ్ చేసిన వాటిలో రెండు వాహనాలు, 50 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లు, దాసరి ఇల్లు ఉన్నాయి.
అటాచ్ చేసినప్పటికీ ఇవన్నీ దాసరి స్వాధీనంలోనే ఉంటాయి... అయితే వీటిపై ఎలాంటి క్రయవిక్రయాలకు అవకాశం ఉండదు. ఈడీ అటాచ్‌మెంట్ ఆర్డర్‌ను 180 రోజుల్లోగా పీఎంఎల్‌ఏ ప్రాధికార సంస్థ ముందు ఆయన సవాల్ చేయవచ్చు.