న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన బొగ్గు గనుల ఈ-వేలానికి కంపెనీలు పోటాపోటీగా బిడ్‌లు జారీచేస్తున్నాయి. తొలివిడతలో 23 గనులకు జరుగుతున్న వేలంలో మంగళవారం 176 ప్రాథమిక(టెక్నికల్) బిడ్‌లు దాఖలయ్యాయి. జిందాల్ స్టీల్ అండ్ పవర్(జేఎస్‌పీఎల్) మోనెట్ ఇస్పాత్ వంటి పలు సంస్థలు బిడ్‌లు వేసిన వాటిలో ఉన్నట్లు సమాచారం. షెడ్యూల్-2 కింద ప్రైవేటు రంగానికి కేటాయించిన ఈ బ్లాక్‌ల వేలంలో స్పందన తమ అంచనాలకు అనుగుణంగానే ఉందని... చాలావరకూ ప్రధాన కంపెనీలు పాల్గొంటున్నాయని బొగ్గు శాఖ కార్యదర్శి అనిల్ స్వరూప్ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. అయితే, బిడ్‌ల విలువ ఎంతనేది వెల్లడికాలేదు. బొగ్గు స్కామ్‌లో సుప్రీం కోర్టు మొత్తం 204 గనులను రద్దు చేయడం.. వీటిని వేలం ద్వారా తిరిగి కేటాయించేందుకు మోదీ సర్కారు ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
జీవీకే పిటీషన్‌పై కేంద్రానికి నోటీసులు: కోల్ ఆర్డినెన్స్ 2014లో ‘పరిహారం’ నిబంధనల రూపకల్పన విధానాన్ని సవాలుచేస్తూ, జీవీకే పవర్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 23వ తేదీలోపు ఈ పిటిషన్‌పై వైఖరి తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. జీవీకే దాఖలు చేసిన పిటిషన్‌పై తుది తీర్పునకు లోబడి తోకిసూడ్ నార్త్ కోల్ బ్లాక్ వేలం ఉంటుందని కూడా ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
బొగ్గు గనుల వేలంలో 176 బిడ్‌లు
Published Wed, Feb 4 2015 1:08 AM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM
Advertisement
Advertisement