‘బొగ్గు’లో దాసరిని ప్రశ్నించిన ఈడీ
మనీల్యాండరింగ్ కేసులో 6గంటలకుపైగా ప్రశ్నల వర్షం
తనపై ఆరోపణలు నిరాధారమన్న దాసరి
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో ప్రముఖ సినీ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావును ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) సోమవారం ఢిల్లీలో ప్రశ్నించింది. బొగ్గు స్కామ్ మనీలాండరింగ్ కేసులో ఆరు గంటలకుపైగా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ కేసులో దాసరిని ఈడీ ప్రశ్నించడం ఇదే తొలిసారి. మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఆయన వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేశారు. ఈడీ విచారణ అనంతరం దాసరి విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్థిక అవకతవకలకు సంబంధించి తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమని, తన పాత్రపై అధికారులకు వివరించానని చెప్పారు. అన్ని ప్రశ్నలకు జవాబులు ఇచ్చానన్నారు. వాస్తవాలు చెప్పానని, విచారణలో అన్ని విధాలా సహకరిస్తానన్నారు. కాగా ఈడీ దర్యాప్తు సందర్భంగా దాసరి బొగ్గు శాఖ సహాయ మంత్రిగా ఉన్న సమయంలో బొగ్గు కేటాయింపులు, జిందాల్ గ్రూప్‌నకు బ్లాకుల కేటాయింపుపై ప్రశ్నించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. నిబంధనల ప్రకారమే తన శాఖ కేటాయింపులు జరిపిందని, దీనికి సంబంధించిన అన్ని ఫైళ్లను ప్రధాని కార్యాలయాని(పీఎంవో)కి పంపగా సంబంధిత అధికారులు ఆమోదం తెలిపారని దాసరి చెప్పారన్నాయి. కాగా, దాసరి వాంగ్మూలంపై మరింత స్పష్టత కోసం ఆయనను ఈ నెల 18న మరోసారి ప్రశ్నించనున్నట్టు ఈడీ పేర్కొంది.
దాసరి ఆర్థిక వ్యవహారాలపై అదనపు పత్రాలు, ఆయన హయాంనాటి కీలక నిర్ణయాల పత్రాలతో హాజరు కావాలని ఈడీ ఆయనను ఆదేశించింది.దాసరి 2004-2006లో తొలిసారి, 2006-2008 వరకూ రెండోసారి బొగ్గు సహాయ మంత్రిగా ఉన్నారు. అయితే జిందాల్ గ్రూప్‌కు చెందిన ఎన్‌డీ ఎగ్జిమ్ నుంచి దాసరికి చెందిన సౌభాగ్య మీడియాలోకి రూ.2.25 కోట్లు వచ్చాయి. ఈ నిధులు మనీ లాండరింగ్ ద్వారా ప్రవేశించినట్టు ఈడీ భావిస్తోంది. ఈ ఏడాది మేలో దాసరితో పాటు కాంగ్రెస్ మాజీ ఎంపీ, వ్యాపారవేత్త నవీన్ జిందాల్‌పై ఈడీ పీఎంఎల్‌ఏ కేసు నమోదు చేసింది. అయితే సదరు సంస్థకు తాను 2008-11 వరకూ డెరైక్టర్‌గా ఉన్నానని, ఆ తర్వాతే ఆ సంస్థలోకి నిధులు వచ్చాయని దాసరి ఈడీకి చెప్పినట్టు తెలిసింది.
తీర్పుపై పునఃపరిశీలనకు సుప్రీం నిరాకరణ
సుప్రీంకోర్టు 214 బ్లాకులను రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని, తమను కక్షిదారులుగా చేరాలని కోరుతూ టాటా స్టీల్ తదితర సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది.