జిందాల్ పాస్ పోర్టు ఎందుకు స్వాధీనం చేసుకోలేదు
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ తీరుపట్ల స్పెషల్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అభియోగాలు ఎదుర్కొంటున్న నవీన్ జిందాల్ పాస్ పోర్ట్ను ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించింది. బొగ్గు కుంభకోణంపై గురువారం విచారణ సందర్భంగా ఈ విధంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, విచారణ జరుగుతున్నందున పాస్ పోర్టును సీజ్ చేయకూడదని నిర్ణయించుకున్నామని కోర్టుకు సీబీఐ తెలిపింది.
దీంతో పాస్ పోర్టులను స్వాధీనం చేసుకొనే విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో విధానం అనుసరించకూడదని సీబీఐకి కోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో అందరికీ ఒకే సూత్రం వర్తించేలా విధానాన్ని రూపొందించాలని సీబీఐ డైరెక్టర్కు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. బొగ్గు కుంభకోణంపై మే 6న అభియోగ పత్రాన్ని పరిగణనలోకి తీసుకుంటామని ప్రత్యేక కోర్టు ఈ సందర్భంగా తెలియజేసింది. దీంతో జిందాల్తో సహా 14మందిపై దాఖలైన ఛార్జ్షీటుపై మే 6న కోర్టు వాదనలు విననుంది.