సాక్షి, హైదరాబాద్: నాగ్‌పూర్‌లో వెలుగుచూసిన బొగ్గు కుంభకోణానికి సంబంధించి సికింద్రాబాద్‌లో సీబీఐ దాడులు నిర్వహించింది. ఎస్డీ రోడ్‌లోని సూర్యలక్ష్మి కాటన్ మిల్స్ ప్రధాన కార్యాలయంలో, నాగ్‌పూర్‌లోని రాంతెక్ శాఖ కార్యాలయంలో సీబీఐ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. సూర్యలక్ష్మి కాటన్ మిల్స్ (ఎస్‌సీఎమ్‌ఎల్)యార్న్, డెనిమ్ వస్త్రాలను ఉత్పత్తి చేస్తుంది. ఎస్‌సీఎమ్‌ఎల్ నాగ్‌పూర్‌లోని రాంతెక్ కాటన్ మిల్లు కోసం 2008లో వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకుంది. 2014 వరకు 4,968 టన్నుల బొగ్గును సరఫరా చేసేందుకు ఒప్పందం చేసుకుంది.
ఆ ఒప్పందం ముగియగానే 2014 సెప్టెంబర్‌లో మరోసారి వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్‌తో 1,13,000 మెట్రిక్ టన్నుల బొగ్గు సరఫరా కోసం ఒప్పందం చేసుకుంది. సూర్యలక్ష్మి కంపెనీకి ఈ సమయంలో తాము సరఫరా చేసిన బొగ్గును బహిరంగ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకున్నారని వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ అంతర్గత విచారణలో తేలింది. ఈ మేరకు ఎస్‌సీఎమ్‌ఎల్ కంపెనీ, చైర్మన్ ఎల్.ఎన్ అగర్వాల్, ఎండీ పరితోష్ అగర్వాల్, గుర్తు తెలియని వెస్ట్రన్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ ఉద్యోగులపై సీబీఐ చీటింగ్ కేసు నమోదు చేసింది. ఈ కంపెనీలో తెలంగాణకు చెందిన ఓ మాజీ ఎంపీ, ఆంధ్రాకు చెందిన ఓ మాజీ ఎంపీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా ఉండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment