నేను తప్పు చేస్తే ప్రధాని విసిరికొట్టేవారు: దాసరి
న్యూఢిల్లీ: తాను తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ప్రధాని మన్మోహన్ సింగ్ తనపై కఠిన చర్య తీసుకునే వారని మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణరావు వ్యాఖ్యానించారు. ఒడిశాలోని తలబిరా-II కోల్ బ్లాక్ కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై దర్యాప్తు జరుపుతున్న సీబీఐ.. ఇటీవల దాసరిని ప్రశ్నించింది.
బొగ్గుశాఖకు సంబంధించిన అన్ని వ్యవహారాల్లో కేబినెట్ మంత్రి శిబు సోరెన్, ప్రధాని మన్మోహన్ సింగ్ లదే తుది నిర్ణయం అని ఆయన అన్నారు. బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్ చేసిన ఆరోపణల్ని దాసరి ఖండించారు. ఆయన ప్రతిపాదించిన బిడ్డింగ్ ను తాను తిరస్కరించాను అని దాసరి అన్నారు.
పరేఖ్ ప్రతిపాదనలకు తాను సహకరించలేదని ఆయన తెలిపారు. బొగ్గుశాఖకు సంబంధించిన ప్రధాని, కేబినెట్ మంత్రి ఉండగా ఆయనకు సహకరించడానికి తానెవ్వరిని అని ఘాటుగా స్పందించారు. తాను తప్పు చేసిఉంటే ప్రధాని తనను అక్కడి నుంచి విసిరికొట్టేవారని దాసరి తీవ్రంగా స్పందించారు.