
బొగ్గు కుంభకోణం వెనుక ఉన్న అధికారులను శిక్షించాలి
ఎస్‌సీఈయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి
గోదావరిఖని : మేడిపల్లి ఓసీపీ నుంచి సీఎస్పీ-1కు తరలించే బొగ్గు దారిమళ్లించిన కుంభకోణం వెనుక ఉన్న అధికారులను శిక్షించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. సీఐటీయూ బృందం సభ్యులు సీఎస్పీ-1ను ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఓసీపీలో వేమెంట్ అయిన తర్వాత సీఎస్పీ-1లో వేమెంట్ కాకుండానే అన్‌లోడింగ్‌కు పంపించారని తెలిపారు. సింగరేణిలో ఉన్న అవినీతి, అలసత్వం ఉపయోగించుకుని కొందరు అక్రమార్కులు కుంభకోణానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. విజిలెన్స్ అధికారులు కిందిస్థాయి కార్మికుల్ని బాధ్యుల్ని చేయకుండా కుంభకోణానికి కారణమైన అధికారులపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఓసీపీ నుంచి హైవే మార్గంలో గంగానగర్ వద్ద చెక్‌పోస్ట్ ఏర్పాటు చేయాలని, ఎన్ని డంప్‌యార్డ్‌లు ఉంటే అంత మంది లారీ మొకద్దామ్‌లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డ్ వద్ద వేసే స్టాంపులను ఎవరు తయారు చేశారనే విషయాన్ని అధికారులు తెలుపాలన్నారు. యూనియన్ గేట్‌మీటింగ్ పెడితే సెకన్లలో సమాచారం ఇచ్చే వారు ఈ కుంభకోణాన్ని ఎందుకు అరికట్టలేదో తెలుపాలని డిమాండ్ చేశారు.
గతంలో జరిగిన బొగ్గు కుంభకోణాలపై తీసుకున్న చర్యలను వివరించాలని, ఇకపై ఇలాంటి ఘటనలు జరుగకుండా చూడాలని సీఎండీని కోరారు. కార్యక్రమంలో ఆర్జీ-1 అధ్యక్ష, కార్యదర్శులు టి.నరహరిరావు, మెండె శ్రీనివాస్, యు.కనకయ్య, పానుగంటి కష్ణ, సురేందర్, జి.మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.