న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై సీబీఐ దర్యాప్తును నీరుగార్చడానికే బొగ్గు గనుల కేటాయింపునకు సంబంధించిన కీలక ఫైళ్లను మాయం చేశారని సీపీఐ ఎంపీ గురుదాస్ దాస్‌గుప్తా ఆరోపించారు. ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ వెంటనే ఈ అంశంపై నిష్పక్షపాత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రధానికి దాస్‌గుప్తా లేఖ రాశారు. ‘‘బొగ్గు కుంభకోణంపై సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు జరుగుతున్న తరుణంలో కొన్ని కీలక ఫైళ్లు కనిపించకుండా పోవడం అనేది చిన్న విషయం కాదు.
ఈ కుంభకోణంలో అత్యున్నత స్థాయి వ్యక్తులు, ప్రధాని కార్యాలయ(పీఎంఓ) పాత్ర లేదని చెప్పేందుకు ఉద్దేశపూర్వకంగానే వాటిని మాయం చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు, కేసు నుంచి కాపాడుకునేందుకు చేసిన చర్యగా కనిపిస్తోంది’’ అని దాస్‌గుప్తా దుయ్యబట్టారు.