తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో కల్తీ నెయ్యి వాడారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపణ మీద దేశవ్యాప్తంగా సీబీఐ విచారణ జరగాలని కోరుతుంటే, ఆయన మాత్రం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను నియమించడం చర్చనీయాంశమైంది. చేసిన తప్పు నుంచి బయటపడడానికి చంద్రబాబు ఈ ప్లాన్ వేశారన్న ఆరోపణలూ సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సిట్‌లను సాధారణంగా ముఖ్యమంత్రితో ముడిపడని అంశాల మీదే ఏర్పాటు చేస్తుంటారు. కానీ శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణను స్వయంగా ముఖ్యమంత్రే చేశారు. విచారణ జరిగితే ముందుగా ఆయన వద్ద నుంచే సమాచారం సేకరించాల్సి ఉంటుంది.
అందువల్ల సిట్ దర్యాప్తుతో పెద్దగా ప్రయోజనం ఉండదనేది ఎక్కువమంది భావన. పైగా వివాదస్పద, పక్షపాతంతో వ్యవహరించారనే విమర్శలు ఎదుర్కొన్న గుంటూరు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని పనిగట్టుకొని సిట్ సారథిగా నియమించడం కచ్చితంగా దురుద్దేశంతో చేస్తున్న ప్రక్రియగానే అనిపిస్తోంది. గతంలో టీటీడీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ పనిచేసిన గోపీనాధ్ జెట్టీని సిట్ సభ్యునిగా నియమించారు. ఇందులో హేతుబద్దత ఏమిటో తెలియదు. చంద్రబాబు చేసిన ఆరోపణల్లో నిజం ఉండి ఉంటే విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ పని చేసిన వ్యక్తిగా కూడా ఆ తప్పుతో సంబంధం ఉండే అవకాశముంది.సిట్ విధి విధానాలు ఇంకా వెల్లడి కాలేదు గానీ అందులో కీలకమైన అంశాలకు ఎంతమేరకు తావు ఉంటుందనే సందేహమే. ఉదాహరణకు లడ్డూలో కల్తీ నెయ్యిని వాడలేదని ఈవో శ్యామలరావు, మంత్రి లోకేష్ ప్రకటించారు. కానీ చంద్రబాబేమో లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందని చెబుతున్నారు.
ఇందులో ఎవరిది సత్యమన్నదన్న విషయాన్నిన్ని ఈ సిట్ నిర్ధారిస్తుందా? జంతువుల కొవ్వు కలిపిన నెయ్యితో తయారు చేసే లడ్డూలుగానీ ,ఇతర ఆహార పదార్థాలుగానీ విపరీతమైన దుర్వాసన వస్తాయని రుచి శ్రీవాస్తవ లాంటి ఆహార పరిశోధకులు చెబుతున్నారు. ఆవు నెయ్యి కంటే ఫిష్ ఆయిల్, పిగ్ ఆయిల్ ఖరీదు ఎక్కువేనని అందువల్ల వాటిని కలిపే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి నిపుణులను సిట్ అన్ని కోణాల్లో విచారణ చేస్తుందా? లేకపోతే చంద్రబాబు ఏం చెబితే అదే చేస్తారా? వేచి చూడాలి. ఇప్పటికే చంద్రబాబు తన తీర్పు ఇచ్చేసినందున, దానికి విరుద్దంగా నివేదిక వస్తుందా? టీటీడీ ఈవో మొదట ఒక రకంగా, తరువాత చంద్రబాబు చెప్పినట్లుగాను మాట మార్చడమే ఒక నిదర్శనం. జున్, జులై నెలల్లో కొత్త ప్రభుత్వం ఆధీనంలోనే టీటీడీ పని చేసింది. ఏఆర్ కంపెనీ నుంచి పది ట్యాంకర్ల నెయ్యి వస్తే నాలుగు ట్యాంకర్లను తిరస్కరించారు.
తిరస్కరించిన నెయ్యిని లడ్డూల్లో వాడే అవకాశమే లేదు. అటువంటపప్పుడు అనుమతించిన నెయ్యిలో కల్తీ ఉందని చంద్రబాబు భావిస్తున్నారా? ఒక వేళ కల్తీ నెయ్యిని అనుమతించి ఉంటే చంద్రబాబు నియమించిన ఈవో శ్యామలరావే బాధ్యుడు అవుతారు కదా? ఆయన్ను విచారిస్తారా? గతంలో తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లకు మరోసారి పరీక్షలు నిర్వహించిన సందర్భం లేదు. కానీ ఈ సారి ఏఆర్ కంపెనీ నెయ్యి శాంపిల్స్ నే ఎందుకు ఎన్‌డీడీబీకి పంపించారు.
ఇందులో ఏమైనా కుట్ర ఉందా? చంద్రబాబు హయాంలో 14 సార్లు, జగన్ సమయంలో 18 సార్లు టీటీడీ నెయ్యి ట్యాంకర్లను తిరస్కరించినప్పుడు ఎందుకు ఇలా శాంపిల్స్ వేర్వేరు ప్రయోగశాలలకు పంపలేదు? కేవలం ఏదో విధంగా జగన్ ప్రభుత్వానికి, వైఎస్సార్ సీపీకి అంటగట్టడానికే ఈ సిట్ ను వేశారనే అభియోగం వస్తోంది. పోనీ సిట్ ఉన్నతాధికారి త్రిపాఠి ట్రాక్ రికార్డ్ ఏమైనా బాగా ఉందా? అని చూస్తే.. ఎన్నికల సమయంలో పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశానికి పూర్తిగా సహకరించారన్న విమర్శలు ఉన్నాయి. వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, నేతలపై టీడీపీ విధ్వసకాండ జరిపినా చూసీ చూడనట్టు వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని ఒక అక్రమ కేసులో ఇరికించడం తదితర ఆరోపణలు కూడా అప్పట్లో వచ్చాయి.
చంద్రబాబు నియమించిన సిట్ చీఫ్ త్రిపాఠి ఆయనకు వ్యతిరేకంగా తన రిపోర్ట్ లో ఏమైనా రాసే పరిస్థితి ఉంటుందా? ఇంత సున్నితమైన అంశాన్ని చంద్రబాబు ఎందుకు ఇంత ఘోరంగా ప్రచారం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు? ఆయన టైమ్‌లో జరిగిన కల్తీని వైఎస్సార్సీపీకి అంటగట్టడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయా సందర్భాల్లో కొన్ని కమిటీలు, కమిషన్లు వేసినా అవి తూతూ మంత్రంగానే సాగాయి. ఉదాహరణకు రాజమండ్రిలో పుష్కరాల తొక్కిసలాటలో 29 మంది చనిపోయారు.
అది కూడా చంద్రబాబు కుటుంబం స్నానాల ఘట్టం షూటింగ్ తీసే సందర్భంలో అయితే ,ఆయన నియమించిన విచారణ కమిషన్ మాత్రం క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చేసింది. తప్పు భక్తులది, మీడియాది ఫలానా టైమ్ మంచి ముహూర్తమని ప్రచారం చేయడంవల్లే తొక్కిసలాట జరిగిందని ఆ కమిషన్ చెప్పిందే తప్ప, చంద్రబాబు ఆ స్నానాల ఘట్టానికి వెళ్లడం తప్పని చెప్పలేకపోయింది. అంత పెద్ద ఘటనలో ఒక్క పోలీస్ కానిస్టేబుల మీద కూడా చర్య తీసుకోలేదు. పైగా సీసీ టీవీ పుటేజిని మాయం చేసినా ఎవరికీ ఇబ్బంది రాలేదు. అలాగే కాపుల రిజర్వేషన్ అంశంపై మంజునాథ్ కమిషన్ ఏర్పాటు చేశారు. తీరా మంజునాథ్ తన ఆలోచనలకు భిన్నంగా నివేదిక ఇస్తారని తెలిసిన చంద్రబాబు ఆ కమిటీ సభ్యులతో వేరే నివేదిక తెప్పించి శాసన సభలో పెట్టారు.
ఇలా పలు విషయాల్లో చంద్రబాబు టైమ్ లో వేసిన కమిటీలు ఉత్తుత్తి కమిటీలుగానే మిగిలిపోయాయి. శ్రీవారి ప్రసాదం మీద వచ్చిన ఆరోపణలపై సిబిఐ విచారణకు, సుప్రీంకోర్ట్ జడ్జితో విచారణ జరపాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా వస్తుంటే చంద్రబాబు మాత్రం సింపుల్ గా సిట్ వేసి చేతులు దులుపుకున్నారు. మొదట తాను చేసిన రభస వల్ల తనకే నష్టం జరిగిందని, తన ప్రభుత్వమే ఆత్మరక్షణలో పడిందన్న భయంతోటి ఇలా చేస్తుండవచ్చు. లేదంటే అందరూ కోరుకున్న విధంగా సిబిఐ లేదా ఒక జడ్జి నేతృత్వంలో విచారణకు అంగీకరించేవారు. అలా చేయకపోవడంతో అందరి వేళ్లు ఆయనవైపే చూపెడుతున్నాయి.
-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్,
రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
ఇదీ చదవండి: Tirupati Laddu Controversy: బాబూ మీరు కొన్నది రూ. 276కే
Comments
Please login to add a commentAdd a comment