Gurudas Dasgupta
-
కార్మిక గళం మూగబోయింది
కోల్‌కతా: భారత కార్మికోద్యమ నేత, సీపీఐ జాతీయ నాయకుడు, పార్లమెంటు మాజీ సభ్యుడు గురుదాస్ దాస్‌గుప్తా(83) కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఆయన కోల్‌కతాలోని స్వగృహంలో గురువారం ఉదయం 6 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, గురుదాస్ మృతిపట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. గురుదాస్ ఐదుసార్లు పార్లమెంటుసభ్యుడిగా ఉన్నారు. మూడుసార్లు రాజ్యసభకు, రెండుసార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. పార్లమెంటులో ఆయన ఆవేశపూరిత ఉపన్యాసాలు కొన్నిసార్లు పార్టీ సైద్ధాంతిక సరిహద్దులను చెరిపేసేవి. యాంగ్రీ యంగ్ మాన్ ‘యాంగ్రీ యంగ్ మాన్’గా పేరున్న గురుదాస్ దాస్ గుప్తా 1936 నవంబర్ 3న అవిభాజ్య బెంగాల్‌లోని బరిషాల్ (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది)లో పుట్టారు. విభజన అనంతరం ఈయన కుటుంబం పశ్చిమబెంగాల్‌కి మారింది. 50వ దశకం చివరల్లో వామపక్ష సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైన ఆయన విద్యార్థి ఉద్యమం ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అవిభాజ్య బెంగాల్ విద్యార్థి ఫెడరేషన్‌కి అ«ధ్యక్షుడిగానూ, కార్యదర్శిగా పనిచేశారు. కొన్ని సందర్భాల్లో రహస్య జీవితంలోకి వెళ్లారు. 1964 కమ్యూనిస్టు పార్టీ చీలికతో మార్క్సిస్టు పార్టీ ఆవిర్భవించాక సీపీఐలో గురుదాస్ ఉండిపోయారు. 70వ దశకంలో కమ్యూనిస్టు పార్టీ అవసరాలరీత్యా కార్మికరంగ బాధ్యతలు చేపట్టారు. 2001లో సీపీఐ అనుబంధ కార్మిక సంఘం ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) ప్రధాన కార్యదర్శి బాధ్యతలను చేపట్టినప్పటినుంచి గురుదాస్ సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేశారు. కార్మికవర్గ సమస్యల పరిష్కారానికై జీవితమంతా పోరాడి మాస్ లీడర్‌గా గుర్తింపు పొందారు. రాజకీయ వైరాన్ని పక్కనబెట్టి మాజీ ప్రధాని వాజ్‌పేయితోనూ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతోనూ, పలువురు కాంగ్రెస్ నాయకులతోనూ సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. ఇటు పార్లమెంటులోనూ, అటు కార్మికవర్గంలోనూ మంచి పేరు సంపాదించుకున్నారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి గురుదాస్ గుప్తా లేని లోటు కార్మికలోకానికి తీరని నష్టమన్నారు. తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. గురుదాస్ దాస్‌గుప్తా∙మృతి పట్ల సంతాపం వ్యక్తంచేశారు. సీఎం జగన్ సంతాపం సాక్షి, అమరావతి: సీపీఐ సీనియర్ నేత గురుదాస్ దాస్ గుప్తా మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రజలు, కార్మికుల సంక్షేమానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవని, రాజకీయాల్లో ఆయన విలువలకు ప్రతీకగా నిలిచారని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. -
సీపీఐ సీనియర్ నేత కన్నుమూత
-
సీపీఐ నేత గురుదాస్ గుప్తా కన్నుమూత
కోల్కత్తా: సీపీఐ సీనియర్ నాయకుడు గురుదాస్ దాస్‌గుప్తా (83) కన్నుమూశారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం కోల్‌కత్తాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 2004-2014 మధ్య కాలంలో ఆయన లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. రాజ్యసభకూ పలుమార్లు ఎన్నికయ్యారు. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ (ఏఐటీయుసీ) ప్రధాన కార్యదర్శిగా గురుదాస్ దాస్‌గుప్తా సేవలు అందించారు. దాస్‌గుప్తా మరణంపై సీపీఐ జాతీయ కమిటీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. గురుదాస్ దాస్‌గుప్తా మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ప్రజలు, కార్మికుల సంక్షేమానికి గురుదాస్ దాస్‌గుప్తా చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. రాజకీయాల్లో విలువలకు ప్రతీకగా ఆయన నిలిచారని ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. -
కార్మిక చట్టాల మార్పులను ఉపసంహరించుకోవాలి:దాస్‌గుప్తా
ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి గురుదాస్ దాస్‌గుప్తా సాక్షి, హైదరాబాద్: కార్మిక చట్టాల్లో మార్పులు చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి గురుదాస్ దాస్‌గుప్తా అన్నారు. ఏఐటీయూసీ 95వ వార్షికోత్సవ కార్మిక బహిరంగ సభ శుక్రవారం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో జరిగింది. ఈ సందర్భంగా హాజరైన గుప్తా మాట్లాడుతూ.. కేంద్రం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమాలను తీవ్రతరం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం రక్షణ, ఎల్లైసీ, బ్యాంకు, రైల్వే వంటి రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 26 శాతం నుంచి 46 శాతానికి పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ తెలంగాణ అధ్యక్షులు నరసింహన్, ప్రధాన కార్యదర్శి రత్నాకర్, నేతలు ఓబులేషు, పీజే చంద్రశేఖర్‌రావు, మహాదేవన్, డాక్టర్ బీవీ విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. వేలాది మంది కార్మికులు సుందరయ్య పార్కు నుంచి ఇందిరాపార్కు వరకూ ఎర్రచొక్కాలు ధరించి కవాతు నిర్వహించారు. -
ఆ ఆరోపణల్లో నిజం లేదు: ఆర్ఐఎల్
న్యూఢిల్లీ: భవిష్యత్తులో ధర పెరుగుతుందని, అప్పుడు మరిన్ని లాభాలు దండుకోవచ్చని ఆశతో కేజీ బేసిన్లో గ్యాస్ ఉత్పత్తులను ఉద్దేశపూర్వకంగా తగ్గించి చూపుతున్నామని వస్తున్న విమర్శలను రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) తోసిపుచ్చింది. ఈ మేరకు ఆరోపణలు చేస్తూ, సీపీఐ పార్లమెంటు సభ్యుడు గురుదాస్ దాస్‌గుప్తా దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల (పీఐఎల్) పిటిషన్ నిరాధారమని సుప్రీంకోర్టుకు విన్నవించింది. ఈ పిటిషన్‌పై 51 పేజీల అఫిడవిట్‌ను ఆర్ఐఎల్ దాఖలు చేసింది. కేంద్రంతో ఉన్న అన్ని వివాదాలను పరిష్కరించుకోవడానికి ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్‌కు తాను అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు అఫిడవిట్ తెలిపింది. -
దర్యాప్తు నీరుగార్చేందుకే బొగ్గు ఫైళ్లు మాయం చేశారు: దాస్‌గుప్తా
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై సీబీఐ దర్యాప్తును నీరుగార్చడానికే బొగ్గు గనుల కేటాయింపునకు సంబంధించిన కీలక ఫైళ్లను మాయం చేశారని సీపీఐ ఎంపీ గురుదాస్ దాస్‌గుప్తా ఆరోపించారు. ప్రధాన మంత్రి మన్మోహన్సింగ్ వెంటనే ఈ అంశంపై నిష్పక్షపాత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రధానికి దాస్‌గుప్తా లేఖ రాశారు. ‘‘బొగ్గు కుంభకోణంపై సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు జరుగుతున్న తరుణంలో కొన్ని కీలక ఫైళ్లు కనిపించకుండా పోవడం అనేది చిన్న విషయం కాదు. ఈ కుంభకోణంలో అత్యున్నత స్థాయి వ్యక్తులు, ప్రధాని కార్యాలయ(పీఎంఓ) పాత్ర లేదని చెప్పేందుకు ఉద్దేశపూర్వకంగానే వాటిని మాయం చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు, కేసు నుంచి కాపాడుకునేందుకు చేసిన చర్యగా కనిపిస్తోంది’’ అని దాస్‌గుప్తా దుయ్యబట్టారు.