దేశవ్యాప్తంగా వైద్యవర్గాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు రగిల్చిన కోల్‌కతా వైద్య కళాశాల అనుబంధ ఆస్పత్రి ఉదంతంపై సీబీఐ దర్యాప్తునకు కోల్‌కతా హైకోర్టు మంగళవారం ఆదేశాలివ్వటం అన్ని విధాలా సబబైనది. జూనియర్ డాక్టర్‌గా పనిచేస్తున్న పీజీ విద్యార్థిని మొన్న శుక్రవారం వేకువ జామున ఒక దుండగుడి అఘాయిత్యానికి బలైంది. ఈ కేసు విషయంలో గత అయిదురోజులుగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ప్రజల్లో సందేహాలు తీర్చకపోగా... మరిన్ని అనుమానాలకు తావిచ్చింది.
దుండగుడిని అరెస్టు చేశామంటున్న పోలీసుల ప్రకటనపై అటు మెడికో కుటుంబ సభ్యులు, ఇటు వైద్య విద్యార్థులు, సిబ్బంది సంతృప్తి చెందలేదు. హత్య, అత్యాచారం ఉదంతంలో కచ్చితంగా ఇతరుల ప్రమేయం ఉందని మొత్తుకున్నారు. కానీ పోలీసులు పట్టనట్టే ఉన్నారు. అసలు ఆస్పత్రి పాలకవర్గం, లేదా ప్రిన్సిపాల్ ఇంతవరకూ ఈ ఉదంతంలో ఫిర్యాదు దాఖలు చేయలేదు.
కనీసం వారిని పిలిచి ప్రశ్నించినవారూ లేరు. ఆరు రోజుల్లో... అంటే వచ్చే ఆదివారంలోగా నిగ్గు తేల్చకపోతే కేసును సీబీఐకి అప్పగిస్తానని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చ రించారు. కానీ హైకోర్టు భిన్నంగా ఆలోచించింది. ఇందులో జాప్యం జరిగినకొద్దీ సాక్ష్యాధారాలు మాయమవుతాయని, దోషులు తప్పించుకునే అవకాశం ఉన్నదని భావించింది.
కొన్ని నేరాలు సమాజాన్ని తీవ్రంగా కలచివేస్తాయి. మనుషులుగా అసలు మన ఉనికిపైనే సందేహం రేకెత్తిస్తాయి. సరిగ్గా పన్నెండేళ్ల క్రితం దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న నిర్భయ ఉదంతం అటువంటిదే! ప్రజలంతా ఉద్యమించిన పర్యవసానంగా ఆ విషయంలో నాటి కేంద్ర ప్రభుత్వం చురుగ్గా కదిలి కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చింది. నేరగాళ్లకు ఉరితో సహా కఠినశిక్షలు అమలుచేసింది.
కానీ ఆ తర్వాత కూడా నేరాలు తగ్గలేదు. దీనికి కారణం కేవలం ప్రభుత్వాల అలసత్వం మాత్రమే! నేరగాళ్లను వెనువెంటనే శిక్షించేలా పకడ్బందీ దర్యాప్తు జరగకపోవటం అన్ని చోట్లా కనబడుతోంది. కేవలం చట్టాలు మాత్రమే సరిపోవనీ, వాటిపై అవగాహన కల్పించి, ఆపత్కాలంలో మహిళలు తక్షణం ఆశ్రయించే సదుపాయం అమల్లోకి తేవాలని ప్రభుత్వాలు అను కోలేదు.
తెలంగాణలో షీ టీమ్స్ అయినా, ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన దిశ యాప్, దిశ చట్టమైనా మహిళలకు ఎంతో తోడ్పాటుగా నిలిచాయి. ముఖ్యంగా ఏపీలో దిశ యాప్ వల్ల నేరాలను నివారించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కోల్‌కతా ఆస్పత్రిలో ఉన్న అస్తవ్యస్త పరిస్థితి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకపక్క దేశవ్యాప్తంగా లైంగిక నేరాలు పెరిగాయని తెలుస్తూనే ఉన్నా మహిళా సిబ్బంది భద్రతకూ, రక్షణకూ ఆస్పత్రి ఎలాంటి చర్యలూ తీసుకోలేదని అక్కడి పరిస్థితులు చూస్తే అర్థమవుతోంది.
నేరగాడు సంజయ్ రాయ్ పోలీస్ వలంటీర్‌గా ఉంటూ ఆస్పత్రిలో ఎక్కడికైనా యథేచ్ఛగా వెళ్తాడని అందరూ చెబుతున్న మాట. ఆఖరికి మహిళా వైద్య సిబ్బంది విశ్రాంతి తీసుకునే ప్రాంతానికి కూడా నిశిరాత్రి అతగాడు వెళ్లగలిగాడంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ జూనియర్ డాక్టర్ 36 గంటలు అవిశ్రాంతంగా రోగులకు సేవలందించి అలసి నిదిరిస్తున్న వేళ నేరగాడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని తోటి సిబ్బంది అంటున్నారు.
ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు జరిగినప్పుడు సేవలందించటానికి నమోదు చేసుకున్న నేరగాడికి ఆస్పత్రిలో సంచరించే స్వేచ్ఛ ఎవరిచ్చారో తేలాల్సివుంది. గర్భిణి అయిన భార్యను హింసించిన ఉదంతంలో వచ్చిన ఫిర్యాదుపై రెండేళ్లుగా పోలీసులు పట్టించుకోలేదంటే అతగాడి పలుకుబడిని అంచనావేయొచ్చు.
అప్పుడే చర్య తీసుకుంటే ఈ ఘోరం జరిగేదా? తమ కుటుంబాల్లో వైద్య అవస రాలున్నప్పుడల్లా ఆస్పత్రిలో అన్నీ అందేలా చూస్తున్నాడన్న ఏకైక కారణంతో పోలీసులు అతడిని చూసీచూడనట్టు వదిలేశారని చాలామంది చెబుతున్న మాట.
తాము తీసుకున్న వలంటీర్ల నడవడి ఎలావుంటున్నదో, వారిని కొనసాగించాలో లేదో సమీక్షించుకునే సంస్కృతి లేకపోవటం ఎటువంటి ఘోరాలకూ, నేరాలకూ దారితీస్తుందో అంచనా వేయలేనంత స్థితిలో పోలీసులుండటం ఆశ్చర్య కరం. నిజానికి లోతైన దర్యాప్తు జరిగితే తమ లోపాలు కూడా బయటపడతాయన్న ఏకైక కారణంతోనే గత అయిదురోజులుగా కోల్‌కతా పోలీసులు దర్యాప్తు డ్రామా కొనసాగిస్తున్నారనుకోవాలి.
చదువు పూర్తయ్యాక ఇతర రంగాల్లో వెనువెంటనే స్థిరపడే అవకాశం ఉన్నా దాన్ని కాదనుకుని పలువురు విద్యార్థులు ఎన్నో సవాళ్లతో కూడిన, దీర్ఘకాలం పట్టే వైద్యవిద్యకు మొగ్గుచూపుతారు. సమాజం పట్లా, మనుషుల పట్లా ఎంతో సేవాభావం, ప్రేమ ఉంటే తప్ప ఇది సాధ్యంకాదు. కానీ అలాంటివారికి ఆ రంగంలో సరైన గౌరవ మర్యాదలు లభిస్తున్నాయా? వారి భద్రతకు సక్రమమైన చర్యలు తీసుకుంటున్నారా? ఈ విషయంలో జూనియర్ డాక్టర్లు తరచు చెప్పే అంశాలు అంత సంతృప్తికరంగా లేవు. వారి శ్రమకు తగ్గ వేతనాలు అందవు.
అవి కూడా నిర్దిష్ట సమయానికి రాని దుఃస్థితి చాలాచోట్ల ఉంటున్నది. వేళకాని వేళల్లో సైతం అవిశ్రాంతంగా పనిచేసేవారికి కనీసం కాసే పయినా భద్రంగా నిద్రపోయే సౌకర్యం ఆస్పత్రి పాలకవర్గం కల్పించలేకపోయిందంటే, ఆ విష యంలో సీనియర్లు శ్రద్ధ పెట్టలేదంటే ఏమనుకోవాలి? పెత్తనం చలాయించటానికి ఉబలాటపడే వారు తాము కూడా ఒకప్పుడు జూనియర్లమనీ, వారిని కంటికి రెప్పలా చూసుకోవాలనీ భావించక పోవటం విషాదం.
సహ సిబ్బంది పట్లా, వారి దురవస్థలపట్లా సహానుభూతి లేనివారి వల్లే ఇలాంటి దురంతాలు చోటు చేసుకుంటున్నాయి. కోల్‌కతా ఆస్పత్రి ఉదంతమైనా అటువంటి వారి కళ్లు తెరిపించాలి. వైద్యసిబ్బంది రక్షణకూ, భద్రతకూ దేశవ్యాప్తంగా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలి.
సీబీఐ దర్యాప్తే సరైంది!
Published Wed, Aug 14 2024 5:15 AM | Last Updated on Wed, Aug 14 2024 5:15 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment