సాక్షి, హైదరాబాద్: బొగ్గు కుంభకోణంలో సీబీఐ దూకుడు పెంచింది. తెలంగాణ కేంద్రంగా ఉన్న సూర్యలక్ష్మీ కాటన్ మిల్స్ (ఎస్‌సీఎమ్‌ఎల్) నాగ్‌పూర్‌లో పాల్పడ్డ బొగ్గు కుంభకోణంపై సీబీఐ ఆధారాల సేకరణలో దూసుకుపోతోంది. తమ కాటన్ మిల్లుకు ఇంధన సరఫరా అన్న కారణంతో ప్రభుత్వం నుంచి పొందిన బొగ్గును బయట మార్కెట్లో విక్రయించారన్న ఆరోపణలపై సీబీఐ ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ మేరకు గత గురువారం సికింద్రాబాద్‌లోని సూర్యలక్ష్మీ కాటన్‌మిల్స్ ప్రధాన కార్యాలయం, నాగ్‌పూర్ రాంతెక్‌లోని శాఖ ఆఫీస్‌పై ఏకకాలంలో దాడులు చేసిన సంగతి తెలి సిందే. సూర్యలక్ష్మీ కాటన్‌మిల్స్ చైర్మన్ ఎల్.ఎన్ అగర్వాల్, ఎండీ పరితోశ్ అగర్వాల్‌పై చీటింగ్ కేసు నమోదు చేసింది. ఇదే సమయంలో ఇందులో డైరెక్టర్లుగా ఉన్న ఇద్దరు మాజీ ఎంపీల సమాచారం సేకరించిందని తెలిసింది.
బహిరంగ మార్కెట్‌కు..: విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తన కాటన్‌మిల్లు, మరో పవర్ ప్లాంటుకు బొగ్గు కోసమని సూర్యలక్ష్మీ కాటన్ మిల్స్.. వెస్ట్రన్ కోల్ ఫీల్డ్‌తో ఒప్పందం చేసుకుంది. 2008లో 4,968 టన్నులకు ఒప్పందం కుదిరింది. అప్పుడెలాంటి అవకతవకలు లేవు. కానీ, 2014లో 1,30,000 టన్నులకు మరో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో 1,13,000 టన్నుల సరఫరాలో అక్రమలు జరిగాయని వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్ అంతర్గత విచారణలో తేలింది. 2014–15లో 21,598.77, 2015–16లో 50,321.77 టన్నులు, 2016–17లో 58194.73 టన్నుల బొగ్గు వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్ నుంచి సరఫరా అయింది.
ఈ మొత్తం బొగ్గులో అధిక శాతాన్ని సూర్యలక్ష్మి కాటన్ మిల్స్ తన అవసరాలకు కాకుండా బయట మార్కెట్లో అక్రమంగా విక్రయించారన్నది వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్ అంతర్గత విచారణతోపాటు, దానిపై నియమించిన ప్రత్యేక కమిటీ కూడా తేల్చింది. దీంతో వందల కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించారని నివేదిక తేల్చినట్లు సమాచారం. ఆ సమయంలో వీరికి రాజకీయంగా పలువురు సహకరించారని సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ సంస్థలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఇద్దరు తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులు ఉండటమే ఇందుకు కారణం.
ఇద్దరూ ఉత్తర తెలంగాణ ఎంపీలే..!
బొగ్గు కుంభకోణంలో వందల కోట్ల రూపాయలు కేంద్రానికి నష్టం వాటిల్లిందని సమాచారం. ఈ కుంభకోణంలో రాజకీయ జోక్యంపైనా సీబీఐ నజర్ పెట్టిందని తెలిసింది. సూర్యలక్ష్మి కాటన్ మిల్స్‌లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో చైర్మన్, ఎండీతో కలిపి మొత్తం 9 మంది ఉన్నారు. వీరిలో ఇద్దరు మాజీ ఎంపీలు కావడం గమనార్హం. అందులో ఒకరు ఉమ్మడి కరీంనగర్, మరొకరు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పార్లమెంట్ సభ్యులుగా ప్రాతినిధ్యం వహించారు. వీరిద్దరూ ఢిల్లీ నుంచి గల్లీ దాకా పారిశ్రామికంగా, రాజకీయంగా బాగా పలుకుబడి ఉన్నవారు. వీరిలో ఒకరికి పలు పరిశ్రమలతోపాటు మీడియా సంస్థలు కూడా ఉన్నాయి. మరొకరు రాజధానిలోని ఒక రేస్‌క్లబ్‌తోపాటు, ఓ బ్యాంకుకు చైర్మన్‌గా వ్యవహరించారు.
వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్ ఉద్యోగులపైనా..!
వేల టన్నుల బొగ్గును సూర్యలక్ష్మీ కాటన్ మిల్స్‌కు తరలించడంలో వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్‌లో ఉన్నత స్థాయి నుంచి కిందిస్థాయి దాకా పలువురు ఉద్యోగులు సహకరించారని సీబీఐ గుర్తించింది. ఈ జాబితా చాంతాడంత ఉండటంతో ప్రస్తుతానికి గుర్తు తెలియని వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్ ఉద్యోగులు అని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ప్రస్తుతం సీబీఐ అధికారులు 2014 నుంచి 2017 వరకు పలువురు ఉద్యోగుల బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలు, కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు సేకరిస్తున్నారని తెలిసింది. ఇందుకు సంబంధించి సీబీఐ అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు సమాచారం. ఎవరి ఆదేశాలు, ప్రలోభాలతో వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్ ఉద్యోగులు ఇలా చేసారన్నది సీబీఐ ఆరా తీస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment