Telangana Political Leaders
-
బొగ్గు స్కాంలో సీబీఐ దూకుడు
సాక్షి, హైదరాబాద్: బొగ్గు కుంభకోణంలో సీబీఐ దూకుడు పెంచింది. తెలంగాణ కేంద్రంగా ఉన్న సూర్యలక్ష్మీ కాటన్ మిల్స్ (ఎస్‌సీఎమ్‌ఎల్) నాగ్‌పూర్‌లో పాల్పడ్డ బొగ్గు కుంభకోణంపై సీబీఐ ఆధారాల సేకరణలో దూసుకుపోతోంది. తమ కాటన్ మిల్లుకు ఇంధన సరఫరా అన్న కారణంతో ప్రభుత్వం నుంచి పొందిన బొగ్గును బయట మార్కెట్లో విక్రయించారన్న ఆరోపణలపై సీబీఐ ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ మేరకు గత గురువారం సికింద్రాబాద్‌లోని సూర్యలక్ష్మీ కాటన్‌మిల్స్ ప్రధాన కార్యాలయం, నాగ్‌పూర్ రాంతెక్‌లోని శాఖ ఆఫీస్‌పై ఏకకాలంలో దాడులు చేసిన సంగతి తెలి సిందే. సూర్యలక్ష్మీ కాటన్‌మిల్స్ చైర్మన్ ఎల్.ఎన్ అగర్వాల్, ఎండీ పరితోశ్ అగర్వాల్‌పై చీటింగ్ కేసు నమోదు చేసింది. ఇదే సమయంలో ఇందులో డైరెక్టర్లుగా ఉన్న ఇద్దరు మాజీ ఎంపీల సమాచారం సేకరించిందని తెలిసింది. బహిరంగ మార్కెట్‌కు..: విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తన కాటన్‌మిల్లు, మరో పవర్ ప్లాంటుకు బొగ్గు కోసమని సూర్యలక్ష్మీ కాటన్ మిల్స్.. వెస్ట్రన్ కోల్ ఫీల్డ్‌తో ఒప్పందం చేసుకుంది. 2008లో 4,968 టన్నులకు ఒప్పందం కుదిరింది. అప్పుడెలాంటి అవకతవకలు లేవు. కానీ, 2014లో 1,30,000 టన్నులకు మరో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో 1,13,000 టన్నుల సరఫరాలో అక్రమలు జరిగాయని వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్ అంతర్గత విచారణలో తేలింది. 2014–15లో 21,598.77, 2015–16లో 50,321.77 టన్నులు, 2016–17లో 58194.73 టన్నుల బొగ్గు వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్ నుంచి సరఫరా అయింది. ఈ మొత్తం బొగ్గులో అధిక శాతాన్ని సూర్యలక్ష్మి కాటన్ మిల్స్ తన అవసరాలకు కాకుండా బయట మార్కెట్లో అక్రమంగా విక్రయించారన్నది వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్ అంతర్గత విచారణతోపాటు, దానిపై నియమించిన ప్రత్యేక కమిటీ కూడా తేల్చింది. దీంతో వందల కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించారని నివేదిక తేల్చినట్లు సమాచారం. ఆ సమయంలో వీరికి రాజకీయంగా పలువురు సహకరించారని సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ సంస్థలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఇద్దరు తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులు ఉండటమే ఇందుకు కారణం. ఇద్దరూ ఉత్తర తెలంగాణ ఎంపీలే..! బొగ్గు కుంభకోణంలో వందల కోట్ల రూపాయలు కేంద్రానికి నష్టం వాటిల్లిందని సమాచారం. ఈ కుంభకోణంలో రాజకీయ జోక్యంపైనా సీబీఐ నజర్ పెట్టిందని తెలిసింది. సూర్యలక్ష్మి కాటన్ మిల్స్‌లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో చైర్మన్, ఎండీతో కలిపి మొత్తం 9 మంది ఉన్నారు. వీరిలో ఇద్దరు మాజీ ఎంపీలు కావడం గమనార్హం. అందులో ఒకరు ఉమ్మడి కరీంనగర్, మరొకరు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పార్లమెంట్ సభ్యులుగా ప్రాతినిధ్యం వహించారు. వీరిద్దరూ ఢిల్లీ నుంచి గల్లీ దాకా పారిశ్రామికంగా, రాజకీయంగా బాగా పలుకుబడి ఉన్నవారు. వీరిలో ఒకరికి పలు పరిశ్రమలతోపాటు మీడియా సంస్థలు కూడా ఉన్నాయి. మరొకరు రాజధానిలోని ఒక రేస్‌క్లబ్‌తోపాటు, ఓ బ్యాంకుకు చైర్మన్‌గా వ్యవహరించారు. వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్ ఉద్యోగులపైనా..! వేల టన్నుల బొగ్గును సూర్యలక్ష్మీ కాటన్ మిల్స్‌కు తరలించడంలో వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్‌లో ఉన్నత స్థాయి నుంచి కిందిస్థాయి దాకా పలువురు ఉద్యోగులు సహకరించారని సీబీఐ గుర్తించింది. ఈ జాబితా చాంతాడంత ఉండటంతో ప్రస్తుతానికి గుర్తు తెలియని వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్ ఉద్యోగులు అని ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ప్రస్తుతం సీబీఐ అధికారులు 2014 నుంచి 2017 వరకు పలువురు ఉద్యోగుల బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలు, కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు సేకరిస్తున్నారని తెలిసింది. ఇందుకు సంబంధించి సీబీఐ అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు సమాచారం. ఎవరి ఆదేశాలు, ప్రలోభాలతో వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్ ఉద్యోగులు ఇలా చేసారన్నది సీబీఐ ఆరా తీస్తోంది. -
‘సవరణ’లకు ఒప్పుకోం
ఓటింగ్ పెడితే అడ్డుకుంటాం స్పీకర్‌కు తెలంగాణ నేతల స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లులోని అంశాలపై శాసనసభ్యులు ఈ నెల 10 లోపు సవరణలను ప్రతిపాదించాలంటూ శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ చేసిన ప్రకటనపై తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయంపై శాసనసభలో ఏకాభిప్రాయమే లేనప్పుడు సవరణలను ప్రతిపాదించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిం చారు. సవరణల పేరుతో ఓటింగ్ నిర్వహించడం ద్వారా శాసనసభలో మెజారిటీ సభ్యులు విభజనకు వ్యతిరేకంగా ఉన్నారనే సంకేతాలను కేంద్రానికి పంపేందుకు సీమాంధ్ర నేతలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అందుకే తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సవరణ ప్రతిపాదన ను అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అయినప్పటికీ తమ ప్రతిపాదనను పక్కనపెట్టి ఓటింగ్‌కు వెళితే సభను అడ్డుకుని తీరుతామన్నారు. ‘ఓటింగ్’పై టీ-నేతల చర్చోపచర్చలు: టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన తెలంగాణ శాసనసభ్యులు మంగళవారం అసెంబ్లీ లాబీల్లోని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డిల చాంబర్లలో సమావేశమై స్పీకర్ పంపిన సవరణల ఫార్మాట్‌పై చర్చించారు. తొలుత జానారెడ్డి చాంబర్లో టీడీపీ సభ్యులు మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీఆర్ఎస్ సభ్యులు ఈటెల రాజేందర్, టి.హరీష్‌రావు సమావేశమయ్యారు. ఆ తరువాత ఈటెల, హరీష్‌లతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల సమన్వయకర్త దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో చర్చించారు. బీజేపీ సభ్యులు నాగం, యెన్నం శ్రీనివాసరెడ్డి కూడా అక్కడికి వచ్చి సవరణ ప్రతిపాదనపై చర్చించారు. అక్కడి నుంచి అందరూ కలిసి దామోదర రాజనర్సింహ చాంబర్‌కు వెళ్లారు. ‘విభజన’పై తీవ్ర ప్రభావమనే ఆందోళన: విభజన బిల్లులోని అంశాలపై అభ్యంతరాలు తెలుపుతూ సవరణలు కోరితే జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్న దానిపై టీ-నేతలు ఈ భేటీల్లో చర్చించారు. కేంద్రం తీసుకుంటున్న విభజన నిర్ణయంపై శాసనసభలో భిన్నాభిప్రాయాలు ఉన్నందున ఓటింగ్ నిర్వహిస్తే మెజారిటీ అభిప్రాయాలు విభజనకు వ్యతిరేకంగా వెల్లడయ్యే అవకాశముందని అభిప్రాయానికి వచ్చారు. వాటిని కేంద్రానికి పంపితే విభజన ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే ప్రమాదముందని ఈ భేటీలో ఆందోళన వ్యక్తమైంది. రాష్ట్ర అసెంబ్లీ అనుకూల అభిప్రాయాల్లేకుండా ఇప్పటి వరకు ఏ రాష్ట్రమూ ఏర్పడలేదని, శాసనసభ అభిప్రాయాలు భిన్నంగా ఉంటే రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ బిల్లును పార్లమెంటుకు పంపే విషయంలో ఆచితూచి వ్యవహరించే అవకాశముందని కొందరు నేతలు సందేహం వ్యక్తంచేశారు. అసెంబ్లీ అభిప్రాయం తెలుసుకోకుండా విభజన ప్రక్రియలో జోక్యం చేసుకోలేమంటూ సుప్రీంకోర్టు తాజాగా పేర్కొన్న నేపథ్యంలో, విభజన విషయంలో అసెంబ్లీ అభిప్రాయం కీలకం కానుందని వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు సవరణల పేరుతో ఓటింగ్‌కు అంగీకరిస్తే విభజనపై ప్రభావం చూపుతుందన్నారు. అభిప్రాయాలకే పరిమితం కావాలి: ఇదంతా ముందుగా ఊహించిన సీమాంధ్ర నేతలు వ్యూహాత్మకంగా సవరణల పేరుతో ఓటింగ్ అంశాన్ని తెరపైకి తెచ్చారనే అభిప్రాయం పలువురు నేతలు వ్యక్తం చేశారు. వారి వ్యూహాన్ని తిప్పికొట్టాలంటే సవరణ ప్రతిపాదన పేరుతో ఓటింగ్ నిర్వహించడానికి అవకాశం లేకుండా చేయడమొక్కటే మార్గమని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో విభజన బిల్లుపై తక్షణమే చర్చను కొనసాగించడంతో పాటు బిల్లులోని అంశాలపై శాసన సభ్యులంతా తమ అభిప్రాయాలు చెప్పడానికి మాత్రమే పరిమితం చేయాలని శాసనసభ స్పీకర్‌పై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. దీంతో వెంటనే నేతలంతా స్పీకర్‌ను కలసి ఇదే విషయాన్ని చెప్పారు. ఇదే అంశంపై స్పీకర్‌కు రాతపూర్వకంగా లేఖ ఇచ్చేందుకు తెలంగాణ ప్రజాప్రతినిధులు సిద్ధమయ్యారు. ఉదయానికల్లా టీ-నేతల వైఖరిలో మార్పు: సోమవారం జరిగిన బీఏసీ సమావేశంలోనే స్పీకర్ నాదెండ్ల మనోహర్ సవరణల ప్రతిపాదన అంశాన్ని ప్రస్తావించడంతో పాటు సంబంధిత ఫార్మాట్‌ను కూడా పంపిణీ చేశారు. సమావేశంలో పాల్గొన్న నేతలంతా స్పీకర్ ప్రతిపాదనకు మద్దతు తెలిపారు. బీఏసీలో తీసుకున్న నిర్ణయం మేరకు స్పీకర్ ఆ తరువాత సభలోనే ఈ విషయాన్ని ప్రకటించారు. అనంతరం శాసనసభ్యులందరికీ ఆయా ఫార్మాట్ పత్రాలను పంపిణీ చేశారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య సహా తెలంగాణ మంత్రులంతా నిన్నటి వరకు సభలో చర్చ జరగడమే తమకు ముఖ్యమని, అందులో భాగంగా ఎవరు ఎన్ని సవరణలైనా ప్రతిపాదించుకోవచ్చని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా దాదాపు అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అయితే మంగళవారం ఉదయానికల్లా ఆయా నేతల అభిప్రాయాల్లో ఒక్కసారిగా మార్పు వచ్చింది. సవరణల పేరుతో ఓటింగ్ నిర్వహిస్తే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని జానారెడ్డి దృష్టికి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీ-నేతలంతా సమావేశమై చర్చించి స్పీకర్‌ను కలిశారు. మంగళవారం సాయంత్రం తెలంగాణ ప్రజాప్రతినిధులంతా.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. సీపీఐ నుంచి తెలంగాణకు అనుకూలమైన పార్టీల ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అసెంబ్లీలో బిల్లుకు సవరణల పేరుతో ఓటింగ్ నిర్వహించటంవల్ల విభజన ప్రక్రియపై ఏ మేరకు ప్రభావం చూపుతుందని, భవిష్యత్తులో న్యాయపరంగా ఏ విధమైన అడ్డంకులు ఏర్పడే అవకాశాలున్నాయనే విషయంపై చర్చించారు.