‘సవరణ’లకు ఒప్పుకోం
-
ఓటింగ్ పెడితే అడ్డుకుంటాం
-
స్పీకర్‌కు తెలంగాణ నేతల స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లులోని అంశాలపై శాసనసభ్యులు ఈ నెల 10 లోపు సవరణలను ప్రతిపాదించాలంటూ శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ చేసిన ప్రకటనపై తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయంపై శాసనసభలో ఏకాభిప్రాయమే లేనప్పుడు సవరణలను ప్రతిపాదించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిం చారు. సవరణల పేరుతో ఓటింగ్ నిర్వహించడం ద్వారా శాసనసభలో మెజారిటీ సభ్యులు విభజనకు వ్యతిరేకంగా ఉన్నారనే సంకేతాలను కేంద్రానికి పంపేందుకు సీమాంధ్ర నేతలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అందుకే తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సవరణ ప్రతిపాదన ను అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అయినప్పటికీ తమ ప్రతిపాదనను పక్కనపెట్టి ఓటింగ్‌కు వెళితే సభను అడ్డుకుని తీరుతామన్నారు.
‘ఓటింగ్’పై టీ-నేతల చర్చోపచర్చలు: టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన తెలంగాణ శాసనసభ్యులు మంగళవారం అసెంబ్లీ లాబీల్లోని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డిల చాంబర్లలో సమావేశమై స్పీకర్ పంపిన సవరణల ఫార్మాట్‌పై చర్చించారు. తొలుత జానారెడ్డి చాంబర్లో టీడీపీ సభ్యులు మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీఆర్‌ఎస్ సభ్యులు ఈటెల రాజేందర్, టి.హరీష్‌రావు సమావేశమయ్యారు. ఆ తరువాత ఈటెల, హరీష్‌లతో పాటు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలందరూ తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల సమన్వయకర్త దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో చర్చించారు. బీజేపీ సభ్యులు నాగం, యెన్నం శ్రీనివాసరెడ్డి కూడా అక్కడికి వచ్చి సవరణ ప్రతిపాదనపై చర్చించారు. అక్కడి నుంచి అందరూ కలిసి దామోదర రాజనర్సింహ చాంబర్‌కు వెళ్లారు.
‘విభజన’పై తీవ్ర ప్రభావమనే ఆందోళన: విభజన బిల్లులోని అంశాలపై అభ్యంతరాలు తెలుపుతూ సవరణలు కోరితే జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్న దానిపై టీ-నేతలు ఈ భేటీల్లో చర్చించారు. కేంద్రం తీసుకుంటున్న విభజన నిర్ణయంపై శాసనసభలో భిన్నాభిప్రాయాలు ఉన్నందున ఓటింగ్ నిర్వహిస్తే మెజారిటీ అభిప్రాయాలు విభజనకు వ్యతిరేకంగా వెల్లడయ్యే అవకాశముందని అభిప్రాయానికి వచ్చారు. వాటిని కేంద్రానికి పంపితే విభజన ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే ప్రమాదముందని ఈ భేటీలో ఆందోళన వ్యక్తమైంది. రాష్ట్ర అసెంబ్లీ అనుకూల అభిప్రాయాల్లేకుండా ఇప్పటి వరకు ఏ రాష్ట్రమూ ఏర్పడలేదని, శాసనసభ అభిప్రాయాలు భిన్నంగా ఉంటే రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ బిల్లును పార్లమెంటుకు పంపే విషయంలో ఆచితూచి వ్యవహరించే అవకాశముందని కొందరు నేతలు సందేహం వ్యక్తంచేశారు. అసెంబ్లీ అభిప్రాయం తెలుసుకోకుండా విభజన ప్రక్రియలో జోక్యం చేసుకోలేమంటూ సుప్రీంకోర్టు తాజాగా పేర్కొన్న నేపథ్యంలో, విభజన విషయంలో అసెంబ్లీ అభిప్రాయం కీలకం కానుందని వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు సవరణల పేరుతో ఓటింగ్‌కు అంగీకరిస్తే విభజనపై ప్రభావం చూపుతుందన్నారు.
అభిప్రాయాలకే పరిమితం కావాలి: ఇదంతా ముందుగా ఊహించిన సీమాంధ్ర నేతలు వ్యూహాత్మకంగా సవరణల పేరుతో ఓటింగ్ అంశాన్ని తెరపైకి తెచ్చారనే అభిప్రాయం పలువురు నేతలు వ్యక్తం చేశారు. వారి వ్యూహాన్ని తిప్పికొట్టాలంటే సవరణ ప్రతిపాదన పేరుతో ఓటింగ్ నిర్వహించడానికి అవకాశం లేకుండా చేయడమొక్కటే మార్గమని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో విభజన బిల్లుపై తక్షణమే చర్చను కొనసాగించడంతో పాటు బిల్లులోని అంశాలపై శాసన సభ్యులంతా తమ అభిప్రాయాలు చెప్పడానికి మాత్రమే పరిమితం చేయాలని శాసనసభ స్పీకర్‌పై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. దీంతో వెంటనే నేతలంతా స్పీకర్‌ను కలసి ఇదే విషయాన్ని చెప్పారు. ఇదే అంశంపై స్పీకర్‌కు రాతపూర్వకంగా లేఖ ఇచ్చేందుకు తెలంగాణ ప్రజాప్రతినిధులు సిద్ధమయ్యారు.
ఉదయానికల్లా టీ-నేతల వైఖరిలో మార్పు: సోమవారం జరిగిన బీఏసీ సమావేశంలోనే స్పీకర్ నాదెండ్ల మనోహర్ సవరణల ప్రతిపాదన అంశాన్ని ప్రస్తావించడంతో పాటు సంబంధిత ఫార్మాట్‌ను కూడా పంపిణీ చేశారు. సమావేశంలో పాల్గొన్న నేతలంతా స్పీకర్ ప్రతిపాదనకు మద్దతు తెలిపారు. బీఏసీలో తీసుకున్న నిర్ణయం మేరకు స్పీకర్ ఆ తరువాత సభలోనే ఈ విషయాన్ని ప్రకటించారు. అనంతరం శాసనసభ్యులందరికీ ఆయా ఫార్మాట్ పత్రాలను పంపిణీ చేశారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య సహా తెలంగాణ మంత్రులంతా నిన్నటి వరకు సభలో చర్చ జరగడమే తమకు ముఖ్యమని, అందులో భాగంగా ఎవరు ఎన్ని సవరణలైనా ప్రతిపాదించుకోవచ్చని చెప్పుకొచ్చారు. టీఆర్‌ఎస్, బీజేపీ నేతలు కూడా దాదాపు అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అయితే మంగళవారం ఉదయానికల్లా ఆయా నేతల అభిప్రాయాల్లో ఒక్కసారిగా మార్పు వచ్చింది. సవరణల పేరుతో ఓటింగ్ నిర్వహిస్తే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని జానారెడ్డి దృష్టికి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీ-నేతలంతా సమావేశమై చర్చించి స్పీకర్‌ను కలిశారు. మంగళవారం సాయంత్రం తెలంగాణ ప్రజాప్రతినిధులంతా.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. సీపీఐ నుంచి తెలంగాణకు అనుకూలమైన పార్టీల ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అసెంబ్లీలో బిల్లుకు సవరణల పేరుతో ఓటింగ్ నిర్వహించటంవల్ల విభజన ప్రక్రియపై ఏ మేరకు ప్రభావం చూపుతుందని, భవిష్యత్తులో న్యాయపరంగా ఏ విధమైన అడ్డంకులు ఏర్పడే అవకాశాలున్నాయనే విషయంపై చర్చించారు.