న్యూఢిల్లీ: బొగ్గు ఫైళ్ల అదృశ్యంపై పార్లమెంటు మళ్లీ దద్దరిల్లింది. లోక్‌సభ, రాజ్యసభలో ప్రతిపక్షాలు సర్కారు తీరుపై మండిపడ్డాయి. బొగ్గు స్కాంలో ప్రధాని మన్మోహన్‌సింగ్ తనంతట తానుగా సీబీఐ ముందు హాజరుకావాలని బీజేపీ డిమాండ్ చేసింది. రూ.1.86 లక్షల కోట్ల భారీ కుంభకోణానికి సంబంధించిన ఫైళ్లు మాయమవడం తీవ్రమైన అంశమని, దీనిపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని స్పష్టంచేసింది. విపక్షాల డిమాండ్ మేరకు.. కోల్‌స్కాంలో ఫైళ్ల అదృశ్యంపై బుధవారం లోక్‌సభ, రాజ్యసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. లోక్‌సభలో బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ.. ప్రధాని ప్రకటన, ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. ‘ఫైళ్లు అదృశ్యమయ్యాయంటే నేను నమ్మను.
ఇది చోరీకి సంబంధించిన కేసు. అందుకని దీనిపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి. ఎఫ్‌ఐఆర్ ఎప్పుడు నమోదు చేస్తారో ప్రభుత్వం చెప్పాలి. ఒకవేళ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుంటే ప్రభుత్వం చాలా అంశాలు దాస్తున్నట్టే లెక్క’ అని వ్యాఖ్యానించారు. బొగ్గు స్కాం జరిగిన 2006-09 మధ్య సంబంధిత శాఖ ప్రధాని మన్మోహన్‌సింగ్ పరిధిలో ఉందని, అందువల్లే ఆయనపై అనుమానాలున్నాయని పేర్కొన్నారు. సచ్ఛీలుడినని ప్రధాని నిరూపించుకోవాలంటే తనకుతానుగా సీబీఐ ముందు హాజరుకావాలని డిమాండ్ చేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్న బీజేపీ డిమాండ్‌కు ఎస్పీ, సీపీఎం, సీపీఐ, తృణమూల్, డీఎంకే, టీడీపీ సభ్యులు మద్దతుపలికారు. ఉభయ సభల్లో చర్చకు ముందు.. ప్రభుత్వం తరఫున కేంద్రమంత్రులు చిదంబరం, కమల్‌నాథ్‌లు బీజేపీ నేతలు అద్వానీ, సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీలను కలిసి పార్లమెంటు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. అయితే బొగ్గు స్కాంపై చర్చకు అనుమతిస్తేనే సహకరిస్తామని వారు స్పష్టంచేశారు. అందుకు ప్రభుత్వం అంగీకరించడంతో ఉభయసభల్లో స్వల్పకాలిక చర్చ జరిగింది.
ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి
Published Thu, Sep 5 2013 6:23 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement