దేశమంతా ఎన్నికల రణరంగంలో హడావిడిగా ఉంటే తలపండిన కొందరూ రాజకీయ నాయకులు మాత్రం ఎన్నికలకు దూరంగా ఉన్నారు. దశాబ్దాల కాలంపాటు జాతీయ రాజకీయాల్లో చక్రంతిప్పిన సీనియర్ నేతలు ఈ ఎన్నికల్లో పోటీనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి ఆశ్చర్యానికి గురిచేశారు. గతంలో ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా కీలకమైన పదవులు అధిరోహించిన వారుసైతం ఈసారి ఎన్నికల్లో పోటీ చెయ్యడం లేదు.
సుష్మా స్వరాజ్
ముక్కుసూటి తనానికి మారుపేరైన బీజేపీ సీనియర్ నాయకురాలు, ప్రస్తుత కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని గతేడాది ప్రకటించారు. తాను రాజకీయాల నుంచి పదవీ విరమణ తీసుకోవట్లేదని ఈ ఎన్నికలకు దూరంగా ఉంటున్నానని ఆమె ప్రకటించానని స్పష్టం చేశారు. బీజేపీ తరఫున ప్రచారంలో మాత్రం పాల్గొంటానని చెప్పారు. 1970ల్లోనే ఆమె రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. బీజేపీలో అనేక కీలక పదవులను అధిరోహించిన సుష్మా.. రెండేళ్ల కిందట ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే.. దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుష్మా.. ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం బీజేపీ నాయకత్వానికి కొంచె లొటే.
మన్మోహన్ సింగ్
భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ కురువృద్ధుడు మన్మోహన్ సింగ్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి విముకత వ్యక్తం చేశారు. పంజాబ్‌లోని అమృత్‌సర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేయాలని కాంగ్రెస్ అధిష్టానం సూచించిన పోటీ చేసేదిలేదని తేల్చిచెప్పారు. వరుసగా పదేళ్ల పాటు ప్రధాని హోదాలో ఉన్న అతి కొద్ది మంది ప్రధాన మంత్రుల్లో మన్మోహన్ ఒకరు. 1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఈయన ఆర్థిక శాఖ మంత్రిగా పదవి చేపట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆర్థిక మంత్రిగా ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో అనూహ్యంగా మన్మోహన్ తొలిసారిగా ప్రధాని పదవిని చేపట్టారు. అస్సోం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014 వరకు ఆయన ప్రధానిగా ఉన్నారు. దాదాపు 28 ఏళ్ల పాటు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారు. తాజాగా ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ ప్రకటించారు. అయితే కాంగ్రెస్‌కు కీలకమైన ఈ ఎన్నికల్లో తెర వెనుక నుంచి ఆయన సేవలను ఉపయోగించుకోనుంది.
శరద్ పవార్
కొత్త తరానికి అవకాశం ఇవ్వడానికి తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ ఇటీవల ప్రకటించారు. 1967లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన పవార్.. మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త చరిత్రను సృష్టించారు. అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో కీలక పదవులను అధిరోహించారు. బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దాదాపు 11 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా కొనసాగారు. 1978లో తొలిసారిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా సేవలందించారు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. మాదా నియోజక వర్గం నుంచి ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. అనారోగ్యం కారణంగా, వయసుపైబడిన రిత్యా పోటీకి దూరంగా ఉంటున్నారు. మహారాష్ట్రకి చెందిన మరో సీనియర్ నేత, మాజీ సీఎం పృథ్వీరాజ్ చౌహన్ కూడా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
హెచ్.డీ దేవెగౌడ
దక్షిణ భారతదేశ రాజకీయాల్లో దేవెగౌడది చెరగడి ముద్ర. రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న గౌడ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తన హసన్ లోక్‌సభ స్థానాన్ని మనవడు ప్రజ్వల్‌కు ఇస్తున్నట్లు తెలిపారు. జేడీఎస్‌కు గట్టిపట్టున్న మాండ్యాం నుంచి పోటీచేయలని ఆయన యోచించినా అక్కడ సీఎం కుమార స్వామి కుమారుడు నిఖిల్ బరిలో నిలవడంతో పోటీ నుంచి తప్పుకోక తప్పలేదు. 1953లో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ అరంగేట్రం చేసిన దేవెగౌడ సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. రెండేళ్ల పాటు 1996-97 వరకు దేశ 11వ భారత ప్రధానిగా ఈయన సేవలందించారు. కర్ణాటకలోని హోళెనరసిపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1962లో తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. అప్పటి నుంచి 1989వరకు ఆరు సార్లు అదే స్థానం నుంచి గెలుపొందారు. అదే సమయంలో ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో అధికార పక్షానికి సవాలుగా మారారు. 1994-96వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా కొనసాగారు. 1996-97వరకు ప్రధానిగా పనిచేశారు. 1991నుంచి ఇప్పటివరకు ఆరుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.
జైపాల్ రెడ్డి
కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి ఈ ఎన్నికల్లో పోటీపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయ్యలేదు. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ సమయంలో మహబూబ్ నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేయాలని కాంగ్రెస్ పార్టీ కోరినా.. ఆయన పోటీకి ఆసక్తి చూపనట్లు తెలిసిందే. కేంద్ర మాజీమంత్రిగా, సీనియర్ నేతగా జాతీయ రాజకీయాలపై జైపాల్‌కు మంచి అవగహన ఉంది. ఎంపీగనే కాకుండా గతంలో నాలుగు సార్లు ఆంధ్రప్రదేశ్ చట్టసభకు కూడా జైపాల్ ఎన్నికయ్యారు. ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో ఇక ఆయన పోటీకి దూరమైనట్లేనని తెలుస్తోంది.
ఉమాభారతి
గ్వాలియర్ రాజమాత విజయ రాజే సింధియా ప్రోత్సాహంతో ఉమాభారతి బీజేపీకి అడుగు పెట్టారు. 1984లో తొలిసారిగా ఆమె లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. ఎల్‌కే అడ్వాణీతో పాటు రామ్ జన్మభూమి పోరాటంలో కీలక పాత్ర పోషించడంతో సంఘ్‌పరివార్‌లో ముఖ్య నేతగా ఎదిగారు. అనంతరం 2003లో మధ్యప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతి బీజేపీ 173 సీట్లు సంపాదించడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 2014లో ఉత్తర్ ప్రదేశ్‌లోని ఝాన్సీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఎన్డీయే ప్రభుత్వంలో ఈమెకు జలవనరుల శాఖ మంత్రి పదవి దక్కింది. ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని భారతి ఇటీవల వెల్లడించారు.
రజినీ కాంత్..
తమిళనాట సూపర్ స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్న రజినీ కాంత్ ప్రజా సేవ చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చినట్లు గత ఏడాదే ప్రకటించారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలతో పాటు, తమిళనాడులో జరుగుతున్న అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడా పోటీ చెయ్యట్లేదని వెల్లడించారు. రాజకీయానుభవం లేకపోయినప్పటికీ తమిళ రాజకీయాలను శాసించే సత్తా, బలం, ఉన్న వ్యక్తిగా రజినీ గుర్తింపు పొందారు. ఈయన ఇప్పటివరకు తన రాజకీయ పార్టీ పేరును ప్రకటించలేదు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రజినీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారనే వార్తలు ఊపందుకున్నాయి. ఈ ఊహాగానాలకు తెరదించుతూ ఈ ఎన్నికల్లో పోటీ చేయనని తేల్చిచెప్పారు. అయితే తమిళనాడుకు చెందిన మరోనటుడు కమల్‌హసన్ రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. కమల్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న నేపథ్యంలో రజనీ మద్దతును కోరే అవకాశం ఉంది.
ఎల్‌కే అద్వానీ
బీజేపీ కురవృద్ధుడు, సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ పోటీపై సందిగ్థత కొనసాగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలో వద్దో నిర్ణయించుకోవాలని ఎల్‌కే అడ్వాణీ (91)కి బీజేపీ సూచించింది. 75 ఏళ్లు దాటిన వారికి పదవి దక్కదని చెబుతూనే.. పోటీ చేయాలా వద్దా అనేది వారి ఇష్టమని బీజేపీ పేర్కొన్నట్లు సమాచారం. ఒకవేళ అద్వానీ పోటీచేయకపోతే గాంధీనగర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో పోటీ చేయించాలని కొందరు నేతలు భావిస్తున్నారు. అద్వానీతో పాటు మరో సీనియర్‌నేత మురళీ మనోహర్ జోషీ కూడా ఇక పోటీచేయ్యకపోవచ్చని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment