సుష్మా స్వరాజ్‌ రోజుకో రంగు చీర | poetic encounters between Sushma, Manmohan Singh enlivened Lok Sabha | Sakshi
Sakshi News home page

మన్మోహన్‌తో కవిత్వ యుద్ధం

Published Thu, Aug 8 2019 4:11 AM | Last Updated on Thu, Aug 8 2019 10:19 AM

poetic encounters between Sushma, Manmohan Singh enlivened Lok Sabha - Sakshi

2009–14 మధ్య (15వ లోక్‌సభ) కాలంలో కేంద్రంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ అధికారంలో ఉండగా, బీజేపీ ప్రతిపక్షంలో ఉంది. అప్పుడు ప్రధానిగా మన్మోహన్, లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా సుష్మా స్వరాజ్‌ ఉన్న సమయంలో వారిరువురి మధ్య పలు కవితా యుద్ధాలు చోటుచేసుకున్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధాలతో 15వ లోక్‌సభ సమావేశాల్లో అనేకసార్లు అసహ్యకర పరిస్థితులు తలెత్తాయి. అయితే కొన్నిసార్లు మన్మోహన్, సుష్మలు.. ఒకరిపై ఒకరు కవితాత్మకంగా చేసుకున్న విమర్శలు సభ్యులను ఉల్లాసపరిచాయి.

వారిద్దరి హాస్య చతురత అందరికీ గుర్తుండేలా చేశాయి. ఓ సారి మన్మోహన్‌ మాట్లాడుతూ, మీర్జా ఘాలిబ్‌ రాసిన ప్రఖ్యాత కవితను చదివారు. ‘హమ్‌ కో ఉన్‌ సే వఫా కీ హై ఉమ్మీద్, జో నహీన్‌ జాన్‌తే వఫా క్యా హై’ (విశ్వాసం అనే పదానికి అర్థం కూడా తెలియని మనుషుల దగ్గరి నుంచి మేం విశ్వాసాన్ని ఆశిస్తున్నాం) అని మన్మోహన్‌ అనగా, సుష్మ దీనికి స్పందిస్తూ, బషీర్‌ బద్ర్‌ కవితతో సమాధానం ఇచ్చారు. ‘కుచ్‌ తో మజ్‌బూరియా రహీ హోంగీ, యూం హీ కోయీ బేవఫా నహీ హోతా’ (కొన్ని తప్పనిసరి పరిస్థితులు ఉండుండాలి.

ఏ కారణమూ లేకుండా ఊరికే ఎవ్వరూ నమ్మిన వారిని మోసం చేయరు) అని సుష్మ బదులిచ్చారు. ఆ వెంటనే మన్మోహన్‌ను ఉద్దేశించి సుష్మ మరో కవిత చదువుతూ ‘తుమ్హే వఫా యాద్‌ నహీ, హమే జఫా యాద్‌ నహీ; జిందగీ ఔర్‌ మౌత్‌ కే తో దో హీ తరణే హై, ఏక్‌ తుమ్హే యాద్‌ నహీ, ఏక్‌ హమే యాద్‌ నహీ’ (నా విశ్వాసాన్ని మీరు గుర్తుంచుకోరు. మీకు విశ్వాసం లేకపోవడాన్ని నేను గుర్తుంచుకోను. జీవితంలో రెండే పాటలు ఉన్నాయి. ఒకటి మీరు గుర్తుంచుకోరు. ఇంకోటి నాకు గుర్తుండదు) అని చెప్పడంతో సభ్యులంతా ప్రశంసించారు. ఇలాంటి సందర్భాలు 15వ లోక్‌సభలో ఎన్నో ఉన్నాయి.

వచ్చి మీ రూపాయి తీసుకోండి
సుష్మా స్వరాజ్‌ మంగళవారం రాత్రి తనకు చేసిన ఫోన్‌ కాల్‌ను, మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకొని సాల్వే కంట తడి పెట్టారు. అప్పటివరకు నవ్వుతూ మాట్లాడిన ఆమె అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతారని ఎవరూ ఊహించలేకపోయారని అన్నారు. గుండెపోటుకు అరగంట ముందు, మంగళవారం రాత్రి 8:50 గంటల ప్రాంతం లో సుష్మా హరీష్‌కి కాల్‌ చేసి మాట్లాడారు. . ‘మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ చాలా ఉద్వేగపూరితమైనది. ఒక్క రూపాయి నేను నీకు ఇవ్వాల్సి ఉంది. వెంటనే వచ్చి తీసుకోండి’ అని ఆమె చెప్పారని ఆయన అన్నారు. ‘‘నిజంగానే ఆ రూపాయి ఎంతో విలువైనది. ఎందుకంటే అది ఒక లాయర్‌గా నాకు ఆమె చెల్లించే ఫీజు. అందుకే తప్పకుండా వచ్చి తీసుకుంటా’ అని నేను చెప్పాను. ‘ సరే బుధవారం సాయంత్రం 6 గంటలకల్లా వచ్చి ఆ రూపాయి తీసుకోండి’ అని ఆమె చెప్పారు. ‘నేను సరే’ అనడంతో ఆమె ఫోన్‌ పెట్టేశారు. సుష్మాతో అవే  చివరి మాటలవుతాయని ఊహించలేకపోయానని సాల్వే గద్గద స్వరంతో చెప్పారు.  

ఆ రూపాయి కథేంటంటే..  
పాక్‌ జైల్లో ఉన్న కుల్‌భూషణ్‌ జాధవ్‌ కేసును అంతర్జాతీయ కోర్టులో సాల్వే వాదించారు. అందుకు ఆయన భారత ప్రభుత్వం దగ్గర కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఫీజు తీసుకుంటానని చెప్పారు. ఈ కేసులో ఆయన గెలవడంతో జాదవ్‌ ఉరి ఆగింది. భారత్‌ తరఫున సాల్వేను నియమించినప్పుడు విదేశాంగ మంత్రిగా సుష్మా స్వరాజ్‌ ఉన్నారు.

రోజుకో రంగు చీర
సుష్మా స్వరాజ్‌కు ఓ వైవిధ్యమైన అలవాటు ఉంది. వారంలో ఏ రోజు ఏ రంగు చీర కట్టుకోవాలనే దానిపై ఆమె కొన్ని నిబంధనలను పెట్టుకున్నారు. ప్రతి సోమవారం ముత్యపు తెలుపు రంగు లేదా క్రీమ్‌ కలర్‌ చీరలు, మంగళవారాల్లో ఎరుపు, కాషాయం లేదా దొండపండు రంగు చీరలు, బుధవారాల్లో ఆకుపచ్చ రంగు, గురువారాల్లో పసుపుపుచ్చ రంగు, శుక్రవారాల్లో బూడిద లేదా వంగపూత రంగు, శనివారాల్లో నీలం లేదా నలుపు రంగు చీరలను ఆమె ధరించేవారు.

ఆదివారం ఏ రంగు దుస్తులు వేసుకోవాలనేదానిపై ప్రత్యేకమైన నిబంధనలేమీ ఉండేవి కావు. దాదాపు గత రెండు దశాబ్దాలపాటు ఆమె ఈ అలవాటును పాటించారు. ఇలా రోజుకో రంగు చీర ధరించేందుకు జ్యోతిష్యం లేదా మూఢనమ్మకాలు కారణం కాదనీ, కేవలం అది తన అలవాటని సుష్మ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కాగా, బీజేపీ ఎంపీ ఎస్‌ఎస్‌ అహ్లువాలియాకు కూడా ఇలాంటి అలవాటే ఉంది. సిక్కు అయిన ఆయన, రోజుకో రంగు తలపాగాను ధరిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement