బొగ్గు కుంభకోణాన్ని తవ్వి తవ్వి అలసిపోయిన సీబీఐకి మళ్లీ పనిబడింది. సుదీర్ఘకాలం దర్యాప్తు తతంగాన్ని సాగించి ఒడిశాలోని తలబిరా-2 బొగ్గుగని కేటాయింపు కేసులో ప్రత్యేక న్యాయస్థానానికి నాలుగునెలలనాడు ముగింపు నివేది క సమర్పించిన సీబీఐకి ఇది నిజంగా షాక్. తలబిరా గని కేటాయింపు విషయంలో ఎవరూ నేరానికి పాల్పడలేదని ముక్తాయిస్తూ ఇచ్చిన ఆ నివేదికలోని లొసుగులను ప్రత్యేక న్యాయస్థానం ఎత్తిచూపడమే కాక మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కూడా విచారించాలని ఆదేశాలివ్వాల్సివచ్చింది. దర్యాప్తు చేసినప్పుడే తెలియ వలసిన అనేక అంశాలు కనీసం నివేదిక రూపొందించినప్పుడైనా గుర్తుకొచ్చి ఉంటే సీబీఐకి ఈ భంగపాటు తప్పేది.
ఎందుకంటే, సీబీఐ మామూలు సంస్థ కాదు. అది దేశంలోనే అగ్రశ్రేణి దర్యాప్తు సంస్థ. ఏదైనా వ్యవహారాన్ని దర్యాప్తు చేసేటపుడు తనకు తారసపడిన అంశాల్లోని సత్యాసత్యాలను అవగాహన చేసుకుని...అందులో మరింత లోతుగా, క్షుణ్ణంగా తెలుసుకోవలసినవి ఏమున్నాయో, అందుకు ఎవరె వరిని ప్రశ్నించాలో నిర్ధారించుకోవాల్సిన బాధ్యత సీబీఐపై ఉంటుంది. ఆ నిర్ధార ణకు అనుగుణంగా సంబంధిత వ్యక్తులను ప్రశ్నించవలసివస్తుంది. ఇవన్నీ సీబీఐకి తెలియనివేమీ కాదు. కానీ ఎవరూ అడగబోరన్న భరోసానో...అడిగినా ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవచ్చునన్న ధైర్యమో సీబీఐకి పుష్కలంగా ఉన్నట్టుంది. ఈ కేసులో కుమార మంగళం బిర్లా ప్రధానితో సమావేశం కావడంతోపాటు ఆయనకు రెండు లేఖలు రాశారని దర్యాప్తు సమయంలో వెల్లడైంది.
పారిశ్రామికవేత్తలెవరైనా ప్రధానిని కలవడం, ఆయనకు ఉత్తరాలు రాయడం వింతేమీ కాదు. అయితే, ఆయన లేఖలు రాశాక పీఎంఓనుంచి హిండాల్కో ఫైలు విషయంలో బొగ్గు శాఖపై ఒత్తిళ్లు రావడంలోని మర్మమేమిటన్న సందేహం తలెత్తినప్పుడు దాన్ని తీర్చు కోవాల్సిన బాధ్యత సీబీఐపై ఉంటుంది. అందులో భాగంగా అవసరమనుకుంటే మన్మోహన్‌సింగ్‌ను ప్రశ్నించవలసి రావొచ్చు. అందువల్ల తన సచ్ఛీలతను నిరూ పించుకునే అవకాశం ఆయనకు ఇచ్చినట్టవుతుంది. ఆ దర్యాప్తులో తేలే అంశా ల్లోని తప్పొప్పుల్ని న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. ఇందుకు భిన్నంగా అసలు ఆ విష యం దర్యాప్తునకు అర్హమే కాదన్నట్టు వ్యవహరిస్తే సంస్థపై నీలినీడలు పడే అవ కాశం ఉండదా? ప్రధాని పదవిలో ఉన్నవారు ఇంతక్రితం ఏ స్కాంలోనూ దర్యాప్తు ను ఎదుర్కొనకపోయి ఉండొచ్చు. కానీ, బొగ్గు క్షేత్రాల కేటాయింపు సందర్భంలో ఆయన ఆ శాఖను చూశారు గనుక ఇది తప్పనిసరని సీబీఐ తనకుతానే నిర్ణయాని కొచ్చి ఉంటే బాగుండేది.
చట్టం ముందు అందరూ సమానులేనంటుంది మన రాజ్యాంగం. కానీ సీబీఐ తీరు చూస్తుంటే కొందరు ‘ఎక్కువ సమానుల’న్న అభిప్రాయమేదో దానికి ఉన్నద నిపిస్తున్నది. లేనట్టయితే బొగ్గు కుంభకోణానికి సంబంధించిన కేసులో దర్యాప్తు చేస్తూ అదే సమయంలో ఆ మంత్రిత్వశాఖ వ్యవహారాలను పర్యవేక్షించిన ప్రధాని కార్యాలయం(పీఎంఓ) జోలికెళ్లకపోవడంలోని ఆంతర్యం ఏమై ఉంటుంది? అలా గని పీఎంఓను అది పూర్తిగా వదిలేయలేదు. ఒకరిద్దరిని ప్రశ్నించింది. వారిని కూ డా లోతుగా అడగలేదు. బొగ్గు మంత్రిత్వశాఖ సహాయమంత్రిగా పనిచేసిన దాసరి నారాయణరావును సైతం ప్రశ్నించినవారికి పీఎంఓ అధికారులను అడగాలని ఎందుకు తోచలేదో అంతుబట్టదు. పీఎంఓ అధికారుల విషయంలోనే ఇంతగా మొహమాటపడినవారికి ఇక ప్రధానిగా ఆ మంత్రిత్వ శాఖను కూడా చూసిన మన్మోహన్‌ను ప్రశ్నించే సాహసం ఉంటుందని ఎవరూ అనుకోలేరు.
సీబీఐ పనితీరు మొదటినుంచీ విమర్శలకు గురవుతోంది. అధికారంలో ఉన్నవారిపై ఆరోపణలొచ్చిన పక్షంలో వారికి ఏదో రకంగా క్లీన్‌చిట్ ఇవ్వడానికి లేదా దర్యాప్తును నీరుగార్చడానికి తహతహలాడే సీబీఐ...వారి ప్రత్యర్థులను వేధించడంలో మాత్రం ఎక్కడలేని ఉత్సాహాన్నీ ప్రదర్శిస్తుందని ఎప్పటినుంచో ఆరోపణలున్నాయి. సాక్షాత్తూ సుప్రీంకోర్టే ఎన్నోసార్లు ఈ విషయంలో సీబీఐకి చీవాట్లు పెట్టడమే కాక, అది ‘పంజరంలో చిలుక’వలే తయారైందని వ్యాఖ్యానిం చింది. ఇలాంటి సందర్భాలు ఎన్ని ఎదురైనా ఆ సంస్థ తన పనితీరును మార్చు కోలేదు. బొగ్గు కుంభకోణం కేసు చరిత్రను తిరగదోడితే అడుగడుగునా దాన్ని దాచి పెట్టేందుకు చేసిన ప్రయత్నాలు వెల్లడవుతాయి. 195 బొగ్గు క్షేత్రాల కేటాయింపులో లక్షా 86 వేల కోట్ల రూపాయల స్కాం జరిగిందని 2012లో తొలిసారి కాగ్ వెల్లడించినప్పుడు ఇదంతా ఉత్తదేనని కేంద్ర ప్రభుత్వం వాదించింది. ఊహాజనిత గణాంకాలతో ప్రజలను పక్కదోవపట్టిస్తున్నారని ఆరోపించింది. తీరా ఈ ఏడాది మొదట్లో సుప్రీంకోర్టుకు అందజేసిన నివేదికలో కేవలం 60 బొగ్గు క్షేత్రాల కేటా యింపులు మాత్రమే సవ్యంగా ఉన్నాయని అంగీకరించింది. అలాగే ఉన్నట్టుండి కొన్ని కీలక ఫైళ్లు మాయమయ్యాయి.
తాము ఎంత అడిగినా ఆ ఫైళ్లు లేవని చెబుతున్నారని సీబీఐ ఫిర్యాదు చేసినమీదట సుప్రీంకోర్టు గట్టిగా హెచ్చరిం చాల్సివచ్చింది. ఆ తర్వాతే ఫైళ్లన్నీ బయటికొచ్చాయి. ఇలా ప్రతి సందర్భంలోనూ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే తప్ప పరిస్థితి చక్కబడలేదు. ఎప్పటికప్పుడు సర్వోన్నత న్యాయస్థానం ఇంతగా పర్యవేక్షిస్తున్న కేసు విషయంలోనే సీబీఐ ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడంవల్ల దోషులను కాపాడటానికి అది ప్రయత్నిస్తు న్నదన్న అభిప్రాయం కలుగుతున్నది. సీబీఐ ఈ సంగతిని గ్రహిస్తున్నట్టుగానీ, తన వ్యవహారశైలిని సరిదిద్దుకున్నట్టుగానీ కనబడదు. ఇప్పుడు ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పువల్ల మన్మోహన్‌ను ప్రశ్నించడంతోపాటు పీఎంఓలో కీలకంగా వ్యవహరించిన అధికారులనుంచి కూడా కేసుకు సంబంధించిన వివరాలను రాబట్టడం వీలవుతుంది. కుంభకోణం జరిగి దాదాపు పదేళ్లవుతుండగా, దర్యాప్తు ప్రారంభమై రెండేళ్లు పూర్తవుతున్నది. ఇప్పటికైనా ఎలాంటి లోటుపాట్లకూ తావీయకుండా దీన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తిచేస్తే ప్రజలు సంతోషిస్తారు.
సీబీఐకి మరో మొట్టికాయ
Published Thu, Dec 18 2014 2:45 AM | Last Updated on Sat, Sep 2 2017 6:20 PM
Advertisement
Advertisement