మంత్రిత్వ శాఖలోనే బొగ్గు మాఫియా!: పీసీ పరేఖ్ | Coal Mafia runs the Coal Ministry, PC Parakh wrote to Manmohan singh in 2005 | Sakshi
Sakshi News home page

మంత్రిత్వ శాఖలోనే బొగ్గు మాఫియా!: పీసీ పరేఖ్

Published Sat, Oct 26 2013 4:29 AM | Last Updated on Fri, Sep 1 2017 11:58 PM

మంత్రిత్వ శాఖలోనే బొగ్గు మాఫియా!: పీసీ పరేఖ్

మంత్రిత్వ శాఖలోనే బొగ్గు మాఫియా!: పీసీ పరేఖ్

న్యూఢిల్లీ: హిందాల్కోకు బొగ్గు గనుల కేటాయింపుపై వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్‌కు శుక్రవారం కేబినెట్ మాజీ కార్యదర్శి, ప్రణాళికా సంఘం సభ్యుడు  బీకే చతుర్వేది మద్దతు పలికారు. పరేఖ్ నిజాయితీగల అధికారి అని, దాని కారణంగానే ఆయన పదవీ విరమణ వరకూ పదవిలో కొనసాగారని పేర్కొన్నారు. గతంలో పరేఖ్ రాసిన లేఖ ఒకటి తాజాగా వెలుగు చూసిన నేపథ్యంలో చతుర్వేది స్పందించారు. పరేఖ్‌కు క్లీన్‌చిట్ ఇచ్చారు. బొగ్గు మాఫియా ఎక్కడో లేదని, ఆ మంత్రిత్వ శాఖలోనే ఉందని తన లేఖలో పరేఖ్ పేర్కొన్నారు. బొగ్గు శాఖ మంత్రులు ప్రజాప్రయోజనాలు పట్టించుకోకుండా మౌఖిక ఆదేశాలు జారీ చేసేవారని, ప్రజా ప్రయోజనాల మేరకు కాకుండా తమకు అనుకూలంగా నోట్ ఫైళ్లు కోరేవారని తెలిపారు. దీనిపై తాను బొగ్గు శాఖ మంత్రికి పలు సూచనలు చేశానని, ఆ నిర్ణయాలు హేతుబద్ధంగా, నిజాయితీగా, ప్రజాప్రయోజనం కలిగించేవిగా ఉండాలని సూచించానని, అది ఆ శాఖ కార్యదర్శిగా తన హక్కు, బాధ్యతగా పేర్కొన్నారు.
 
  తన సూచనలను ఆమోదించడం, ఆమోదించకపోవడం అనేది మంత్రి ఇష్టమని అన్నారు. 2005లో బొగ్గు శాఖ మంత్రి శిబూసొరెన్ తనపై పలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో వాటిపై వివరణ ఇస్తూ తాను అప్పటి కేబినెట్ కార్యదర్శి చతుర్వేదికి లేఖ రాసినట్లు పరేఖ్ శుక్రవారం తెలిపారు. పరేఖ్‌ను బదిలీ చేయాలని కోరుతూ అప్పట్లో శిబూ సొరేన్ కేబినెట్ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. కాగా హిందాల్కోకు బొగ్గు గనుల కేటాయింపు నిర్ణయం సబబేనని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రకటించడం ఆయన ఔన్నత్యానికి నిదర్శనమని పరేఖ్ అన్నారు. కేసుకు సంబంధించిన అంశాలను అవగాహన చేసుకోవడంలో సీబీఐ విఫలమైందని విమర్శించారు. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా.. ప్రధాని మన్మోహన్‌ను, తనను కలిసిన తర్వాత బొగ్గు గనుల నిర్ణయం మారిందన్న సీబీఐ ఆరోపణల్లో ఎక్కడా నేర కోణం కనిపించడం లేదన్నారు.
 
 హిందాల్కో ఫైళ్లు సీబీఐకి ఇచ్చిన పీఎంవో
 ఇలావుండగా హిందాల్కో కంపెనీకి బొగ్గు గనుల కేటాయింపునకు సంబంధించిన ఫైళ్లను ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) సీబీఐకి సమర్పించింది. ‘‘తలబిరా బొగ్గు గనులకు సంబంధించిన అన్ని ఫైళ్లను సీబీఐకి అందించాం. ఒక రసీదు కూడా తీసుకున్నాం. భవిష్యత్తులో ఏవైనా వివరాలు కావాలంటే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని సీబీఐకి తెలిపాం’’ అని పీఎంవో వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. హిందాల్కోకు బొగ్గు గనుల కేటాయింపునకు సంబంధించిన ఫైళ్లను ఇవ్వాలని సీబీఐ.. మంగళవారం పీఎంవోకు లేఖ రాసిన విషయం తెలిసిందే. మరోవైపు 14 బొగ్గు క్షేత్రాల వద్ద పనులు, బొగ్గు వెలికితీత తీరుతెన్నులను అంతర మంత్రిత్వశాఖల అధికారుల బృందం (ఐఎంజీ) శుక్రవారం సమీక్షించింది. జైప్రకాశ్ అసోసియేట్స్, మాన్నెట్ ఇస్పాత్ ఎనర్జీ, జిందాల్ స్టీల్, పవర్ లిమిటెడ్ తదితర సంస్థలకు కేటాయించిన బొగ్గు బ్లాకులను సమీక్షించినట్టు ఐఎంజీ వర్గాలు తెలిపాయి.
 
 ప్రధాని రాజీనామా చేయాల్సిందే: బీజేపీ
 బొగ్గు కుంభకోణంలో సీబీఐ విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రధానమంత్రి ప్రకటించడంలో అర్థం లేదని బీజేపీ పేర్కొంది. ప్రధాని గద్దె దిగితేనే ఈ విషయంలో నిష్పాక్షిక దర్యాప్తు జరుగుతుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ శుక్రవారం నాడిక్కడ పేర్కొన్నారు. వాస్తవాలను దాచి మన్మోహన్ గతంలో చేసిన ప్రకటనలనే మళ్లీమళ్లీ చేస్తున్నారని విమర్శించారు. ప్రధానికి రాజీనామా చేయడం మినహా మరోమార్గం లేదని అన్నారు. రాజీనామా చేసిన తర్వాతే సీబీఐ ఎదుట హాజరుకావాలని చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement