Coal mines allocation
-
కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఈడీ దాడులు.. సీఎం సంచలన కామెంట్స్
ప్రతిపక్ష పార్టీల నేతలే టార్గెట్‌గా దేశంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు జరుగుతున్నాయని ఇప్పటికే విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో ఈడీ దాడులు పొలిటికల్‌గా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. బొగ్గు కుంభకోణం కేసులో కాంగ్రెస్ పార్టీ నేతల ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు జరుగుతున్నాయి. వివరాల ప్రకారం.. బొగ్గు కుంభకోణానికి సంబంధించిన కేసులో ఈడీ సోమవారం 14 చోట్ల తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ రామ్ గోపాల్ అగర్వాల్‌కు రూ. 52 కోట్లు ముడుపులు ముట్టినట్లు డాక్యుమెంటరీ ఆధారాలు ఉన్నాయని ఈడీ పేర్కొన్నది. ఆరి డోంగ్రి మైనింగ్‌లో జరిగిన అక్రమాలకు సంబంధించిన కేసులో కూడా ఈడీ దర్యాప్తు చేస్తోంది. టన్ను బొగ్గు సరఫరాపై అక్రమంగా రూ.25 వసూల్ చేసి.. 2021లో సగటున సుమారు 500 కోట్లు వసూల్ చేసినట్లు ఈడీ ఆరోపణ చేసింది. ఈ కేసులో భాగంగా రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతల ఇళ్లు, ఆఫీసుల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇక, ఈడీ తనిఖీలపై సీఎం భూపేష్ భఘేలే స్పందించారు. ఈ సందర్భంగా సీఎం భఘేల్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం అవడాన్ని బీజేప తట్టుకోలేకపోతోంది. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఆదారణ చూసి బీజేపీ భయాందోళనకు గురువుతోంది. హిండెన్ బర్గ్ నివేదికతో అదానికి చెందిన అసలు విషయాలు వల్ల బీజేపీ ఇబ్బందిపడుతోంది. వీటిని నుంచి ప్రజల దృష్టిమరల్చేందుకే బీజేపీ.. ఈడీ దాడులు చేస్తోందని ఆరోపణలు చేశారు. ఈ దేశానికి నిజం తెలుసు.. పోరాడి గెలుస్తాం అంటూ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మూడు రోజుల పాటు కాంగ్రెస్ ప్లీనర్ రాయ్‌పూర్‌లో జరుగనుంది. ఈ నేపథ్యంలో ఈ దాడులు జరగడం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. -
మంత్రిత్వ శాఖలోనే బొగ్గు మాఫియా!: పీసీ పరేఖ్
న్యూఢిల్లీ: హిందాల్కోకు బొగ్గు గనుల కేటాయింపుపై వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్‌కు శుక్రవారం కేబినెట్ మాజీ కార్యదర్శి, ప్రణాళికా సంఘం సభ్యుడు బీకే చతుర్వేది మద్దతు పలికారు. పరేఖ్ నిజాయితీగల అధికారి అని, దాని కారణంగానే ఆయన పదవీ విరమణ వరకూ పదవిలో కొనసాగారని పేర్కొన్నారు. గతంలో పరేఖ్ రాసిన లేఖ ఒకటి తాజాగా వెలుగు చూసిన నేపథ్యంలో చతుర్వేది స్పందించారు. పరేఖ్‌కు క్లీన్చిట్ ఇచ్చారు. బొగ్గు మాఫియా ఎక్కడో లేదని, ఆ మంత్రిత్వ శాఖలోనే ఉందని తన లేఖలో పరేఖ్ పేర్కొన్నారు. బొగ్గు శాఖ మంత్రులు ప్రజాప్రయోజనాలు పట్టించుకోకుండా మౌఖిక ఆదేశాలు జారీ చేసేవారని, ప్రజా ప్రయోజనాల మేరకు కాకుండా తమకు అనుకూలంగా నోట్ ఫైళ్లు కోరేవారని తెలిపారు. దీనిపై తాను బొగ్గు శాఖ మంత్రికి పలు సూచనలు చేశానని, ఆ నిర్ణయాలు హేతుబద్ధంగా, నిజాయితీగా, ప్రజాప్రయోజనం కలిగించేవిగా ఉండాలని సూచించానని, అది ఆ శాఖ కార్యదర్శిగా తన హక్కు, బాధ్యతగా పేర్కొన్నారు. తన సూచనలను ఆమోదించడం, ఆమోదించకపోవడం అనేది మంత్రి ఇష్టమని అన్నారు. 2005లో బొగ్గు శాఖ మంత్రి శిబూసొరెన్ తనపై పలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో వాటిపై వివరణ ఇస్తూ తాను అప్పటి కేబినెట్ కార్యదర్శి చతుర్వేదికి లేఖ రాసినట్లు పరేఖ్ శుక్రవారం తెలిపారు. పరేఖ్‌ను బదిలీ చేయాలని కోరుతూ అప్పట్లో శిబూ సొరేన్ కేబినెట్ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. కాగా హిందాల్కోకు బొగ్గు గనుల కేటాయింపు నిర్ణయం సబబేనని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రకటించడం ఆయన ఔన్నత్యానికి నిదర్శనమని పరేఖ్ అన్నారు. కేసుకు సంబంధించిన అంశాలను అవగాహన చేసుకోవడంలో సీబీఐ విఫలమైందని విమర్శించారు. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా.. ప్రధాని మన్మోహన్‌ను, తనను కలిసిన తర్వాత బొగ్గు గనుల నిర్ణయం మారిందన్న సీబీఐ ఆరోపణల్లో ఎక్కడా నేర కోణం కనిపించడం లేదన్నారు. హిందాల్కో ఫైళ్లు సీబీఐకి ఇచ్చిన పీఎంవో ఇలావుండగా హిందాల్కో కంపెనీకి బొగ్గు గనుల కేటాయింపునకు సంబంధించిన ఫైళ్లను ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) సీబీఐకి సమర్పించింది. ‘‘తలబిరా బొగ్గు గనులకు సంబంధించిన అన్ని ఫైళ్లను సీబీఐకి అందించాం. ఒక రసీదు కూడా తీసుకున్నాం. భవిష్యత్తులో ఏవైనా వివరాలు కావాలంటే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని సీబీఐకి తెలిపాం’’ అని పీఎంవో వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. హిందాల్కోకు బొగ్గు గనుల కేటాయింపునకు సంబంధించిన ఫైళ్లను ఇవ్వాలని సీబీఐ.. మంగళవారం పీఎంవోకు లేఖ రాసిన విషయం తెలిసిందే. మరోవైపు 14 బొగ్గు క్షేత్రాల వద్ద పనులు, బొగ్గు వెలికితీత తీరుతెన్నులను అంతర మంత్రిత్వశాఖల అధికారుల బృందం (ఐఎంజీ) శుక్రవారం సమీక్షించింది. జైప్రకాశ్ అసోసియేట్స్, మాన్నెట్ ఇస్పాత్ ఎనర్జీ, జిందాల్ స్టీల్, పవర్ లిమిటెడ్ తదితర సంస్థలకు కేటాయించిన బొగ్గు బ్లాకులను సమీక్షించినట్టు ఐఎంజీ వర్గాలు తెలిపాయి. ప్రధాని రాజీనామా చేయాల్సిందే: బీజేపీ బొగ్గు కుంభకోణంలో సీబీఐ విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రధానమంత్రి ప్రకటించడంలో అర్థం లేదని బీజేపీ పేర్కొంది. ప్రధాని గద్దె దిగితేనే ఈ విషయంలో నిష్పాక్షిక దర్యాప్తు జరుగుతుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ శుక్రవారం నాడిక్కడ పేర్కొన్నారు. వాస్తవాలను దాచి మన్మోహన్ గతంలో చేసిన ప్రకటనలనే మళ్లీమళ్లీ చేస్తున్నారని విమర్శించారు. ప్రధానికి రాజీనామా చేయడం మినహా మరోమార్గం లేదని అన్నారు. రాజీనామా చేసిన తర్వాతే సీబీఐ ఎదుట హాజరుకావాలని చెప్పారు. -
బొగ్గు ఫైళ్ల గల్లంతుపై సుప్రీం ఆగ్రహం
న్యూఢిల్లీ: బొగ్గు గనుల కేటాయింపుల ఫైళ్లలో కొన్ని అందుబాటులో లేవని కేంద్ర ప్రభుత్వం చెప్పడంపై సుప్రీంకోర్టు మండిపడింది. 1993-2009 మధ్యకాలంలోని పత్రాలు, సమాచారం, ఫైళ్లు కనిపించడం లేదని ప్రభుత్వం చెబుతున్న విషయం తెలిసిందే. కనిపించకుండా పోయిన వాటిపై కనీసం పోలీసు ఫిర్యాదన్నా చేశారా లేదా అని కోర్టు ప్రశ్నించింది. జస్టిస్ ఆర్ఎం లోధా, జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌ల నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం ఈ కేసును విచారించింది. ‘కనిపించని ఫైళ్లపై కేసు ఎందుకు నమోదుచేయలేదు? అవి మొత్తానికే పోయాయా? లేక మళ్లీ దొరికే అవకాశముందా?’ అని ప్రభుత్వాన్ని అడిగింది. ఈ కేసులో సీబీఐ అడిగిన పత్రాలు, సమాచారం, ఫైళ్లను రెండువారాల్లోగా అందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. కేసు దర్యాప్తుపై అక్టోబర్ 22 నాటికి స్థాయీ నివేదికను సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. బొగ్గు కుంభకోణంలో అధికారుల పాత్రపై విచారణ అంశం సీబీఐ, కేంద్రం మధ్య పరస్పరం ఘర్షణ వాతావరణం నెలకొంది. కోర్టు స్వయంగా పర్యవేక్షిస్తున్న ఈ కేసులో అధికారులను విచారించేందుకు ప్రభుత్వ అనుమతి అక్కర్లేదని సీబీఐ తన వాదనను కొనసాగిస్తుండగా, ప్రభుత్వం మాత్రం వ్యతిరేకిస్తోంది. మరోవైపు, కేసు దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. ‘మీరింకా ఫస్ట్‌గేర్‌లోనే ఉన్నారు. వేగం పెంచండి’ అని జస్టిస్ లోధా సీబీఐని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తుది చార్జిషీట్లను సీబీఐ తమ న్యాయవాదులతో పంచుకునేందుకు కోర్టు అనుమతించింది.